First Day First Show Review: రివ్యూ: ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో

‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్‌ కె.వి. కథ అందించిన ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ సినిమా ఎలా ఉందంటే?

Published : 02 Sep 2022 15:59 IST

First Day First Show Review చిత్రం: ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో; న‌టీన‌టులు: శ్రీకాంత్‌, సంచిత బ‌సు, వెన్నెల కిషోర్‌, తనికెళ్ల భ‌ర‌ణి, వంశీధ‌ర్ గౌడ్ , రంగ‌స్థ‌లం మ‌హేష్, ప్ర‌భాస్ శ్రీను, సి.వి.ఎల్ న‌ర‌సింహారావు త‌దిత‌రులు;
క‌థ‌, మాట‌లు: అనుదీప్. కె. వి; సంగీతం: ర‌ధ‌న్‌; ఛాయాగ్ర‌హ‌ణం: శ్రీకాంత్; నిర్మాణం: శ్రీజ ఏడిద‌; స‌మ‌ర్ప‌ణ‌: శ్రీరామ్ ఏడిద‌; ద‌ర్శ‌క‌త్వం: వ‌ంశీధ‌ర్ గౌడ్‌, లక్ష్మీనారాయ‌ణ పుట్టంశెట్టి; సంస్థ‌: శ్రీజ ప్రొడ‌క్ష‌న్స్, మిత్ర‌వింద మూవీస్‌; విడుద‌ల‌: 02-09-2022.

‘జాతిర‌త్నాలు’ సినిమాతో ప్రేక్షకులను క‌డుపుబ్బా న‌వ్వించి విజ‌యాన్ని అందుకున్నారు ద‌ర్శ‌కుడు అనుదీప్ కె.వి. ఆయ‌న క‌థ‌తో తెర‌కెక్కుతున్న సినిమాగా ‘ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో’కి మంచి ప్ర‌చార‌మే ల‌భించింది.  ఎన్నో ప్ర‌తిష్ఠాత్మక‌మైన సినిమాలు తీసిన నిర్మాణ సంస్థ పూర్ణోద‌య నుంచి పుట్టిన కొత్త సంస్థ శ్రీజ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మించ‌డం... ప్ర‌చార చిత్రాలతోపాటు, చిత్ర‌ బృందం చేసిన ప్రమోషన్లు.. సినిమాపై ఆస‌క్తిని రేకెత్తించాయి. మ‌రి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం...

క‌థేంటంటే?

ప‌వ‌న్‌కల్యాణ్ చిత్రం ‘ఖుషి’ విడుద‌ల స‌మ‌యం నాటి క‌థ ఇది. శ్రీనివాస్ (శ్రీకాంత్ రెడ్డి) ఓ కాలేజీ స్టూడెంట్‌. ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌కి వీరాభిమాని. త‌న అభిమాన హీరో సినిమా విడుల‌ద‌వుతోందంటే తొలి రోజు తొలి ఆట చూడాల్సిందే. ఊళ్లో బ్యానర్లు కూడా క‌ట్టిస్తుంటాడు. ‘ఖుషి’ సినిమా విడుద‌లవుతోంద‌ని తొలి రోజు తొలి ఆట చూడ‌టం కోసం ముందుగానే టికెట్ల వేట మొద‌లు పెడ‌తాడు. అంత‌లోనే త‌నకి ఇష్ట‌మైన అమ్మాయి, క్లాస్‌మేట్ ల‌య (సంచిత బ‌సు) తాను కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానినే అని, తొలి రోజు తొలి ఆట టికెట్ కావాల‌ని అడుగుతుంది. త‌న‌కిష్ట‌మైన అమ్మాయితో క‌లిసి త‌న అభిమాన క‌థానాయ‌కుడి సినిమాని చూడాల‌ని క‌ల‌లు క‌న్న ఆ యువ‌కుడు టికెట్ల‌ కోసం ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేశాడు? తొలి రోజు తొలి ఆట క‌లిసి చూశారా, లేదా? అనేది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే?

ఒక అభిమాని తొలి రోజు తొలి ఆట టికెట్ సంపాదించ‌డ‌మే ఈ సినిమా క‌థ‌. దానికి ఓ జంట మ‌ధ్య సాగే ఓ చిన్న ప్రేమ‌క‌థ‌ని కూడా జోడించారు. ఇలా ప‌ల‌చ‌గా అనిపించే ఒకే ఒక్క అంశంతోనే రెండు గంట‌లు సినిమాని న‌డ‌ప‌డం క‌త్తిమీద సామే. ప్రేక్ష‌కుడిని క‌థ గురించి ఆలోచించ‌నీయ‌కుండా... ఆద్యంతం కామెడీతో బండిని న‌డిపించాలి. ఆ ప్ర‌య‌త్నంలో ద‌ర్శ‌కులు కొద్దిమేరే స‌ఫ‌ల‌మ‌య్యారు. కొన్ని స‌న్నివేశాలు మాత్ర‌మే న‌వ్విస్తాయి. మిగ‌తా స‌న్నివేశాలు తేలిపోయాయి. ప‌వ‌న్‌ క‌ల్యాణ్ అభిమానులు, తొలి రోజు తొలి ఆట టికెట్ల కోసం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన కొద్దిమందిని మెప్పించ‌వ‌చ్చంతే.

2000 ద‌శ‌కం ఆరంభంలో థియేట‌ర్ల ద‌గ్గ‌ర జ‌నాల హ‌డావుడి, రీళ్లు థియేట‌ర్‌కి చేరుకునే విధానం, సినిమా చూడ‌క‌ముందే క‌థ తెలుసంటూ ఒక‌రికొక‌రు డ్ర‌మ‌టైజ్ చేసి చెప్పుకొనే విధానం, అభిమానుల పాట్లు పాత రోజుల్ని గుర్తు చేస్తాయి. పాత తరం అనుభూతిని పంచుతాయి. టికెట్లు చేతికి అందిన‌ట్టే అంది చేజారిపోయే స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా అనిపిస్తాయి. ఫ్యాన్స్ అసోసియేష‌న్ నాయ‌కుడిగా వెన్నెల కిషోర్ చేసే హంగామా న‌వ్విస్తుంది. అయితే శ‌వం  ద‌గ్గ‌ర టికెట్ కోసం ప‌డే పాట్లు, పేలుతున్న ట‌పాసులు చేత‌ప‌ట్టి జ‌నాల మీద‌కి విసిరి మ‌రీ టికెట్ కౌంట‌ర్ ద‌గ్గ‌రికి ప‌రిగెత్తుకెళ్లే అభిమాని చేష్ట‌లు..  సామాన్య ప్రేక్ష‌కుడికి ఏమాత్రం రుచించ‌క‌పోగా, అతిగా అనిపిస్తాయి. ప్రేమ‌క‌థ‌లో కూడా బ‌లం లేదు. స‌న్న‌టి  క‌థ‌, బ‌లం లేని క‌థ‌నంతో తెర‌కెక్కిన ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ... ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. అక్క‌డ‌క్క‌డా ఆయ‌న ఇమేజ్‌, ఆయ‌నపై అభిమానాన్ని చాటే స‌న్నివేశాలు అభిమానుల్ని అల‌రిస్తాయంతే.

ఎవ‌రెలా చేశారంటే?

నాయ‌కానాయిక‌లు శ్రీకాంత్‌రెడ్డి, సంచిత బ‌సు పాత్ర‌ల్లో స‌హ‌జంగా ఒదిగిపోయారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ వీరాభిమానిగా శ్రీకాంత్ రెడ్డి చేసే హంగామా ఆక‌ట్టుకుంటుంది. వెన్నెల కిషోర్‌తోపాటు, ద‌ర్శ‌కుడు వంశీధ‌ర్ గౌడ్ ఓ పాత్ర‌లో న‌టించి న‌వ్వించారు. శ్రీనివాస్‌రెడ్డి, మ‌హేష్, సీవీఎల్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతిక విభాగాల్లో సంగీతానికి ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. నీ న‌వ్వే పాట, దాని చిత్రీకరణ బాగుంది. నేప‌థ్య సంగీతం కూడా ఆక‌ట్టుకుంటుంది. అనుదీప్, వంశీ త‌మ ర‌చ‌న‌తో అక్క‌డ‌క్క‌డా న‌వ్వించినా, పూర్తిస్థాయిలో ప్ర‌భావం చూపించ‌లేక‌పోయారు. ఇద్ద‌రు ద‌ర్శ‌కులు ఈ సినిమాకి ప‌నిచేసినా ఎక్క‌డా ఆ ప్ర‌భావాన్ని, సినిమా ప్ర‌త్యేక‌త‌ని ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయారు. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉన్నాయి.

బ‌లాలు

+ అక్క‌డ‌క్క‌డా కామెడీ

+ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభిమానుల్ని అల‌రించే అంశాలు

బ‌ల‌హీన‌త‌లు

- ప‌ల‌చ‌టి క‌థ‌, క‌థ‌నం

- అతిగా అనిపించే కొన్ని స‌న్నివేశాలు

చివ‌రిగా..: ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో... టికెట్ దొర‌కొచ్చు కానీ...?

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts