‘గాలి సంపత్‌’ అంటే మీరనుకునేది కాదు

యువ కథానాయకుడు శ్రీ విష్ణు, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘గాలి సంపత్‌’. లవ్లీ సింగ్‌ నాయిక. అనీష్‌ దర్శకుడు. మరో దర్శకుడు అనిల్‌ రావిపూడి సమర్పిస్తూ పర్యవేక్షించారు.

Published : 21 Feb 2021 22:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ కథానాయకుడు శ్రీ విష్ణు, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘గాలి సంపత్‌’. లవ్లీ సింగ్‌ నాయిక. అనీష్‌ దర్శకుడు. మరో దర్శకుడు అనిల్‌ రావిపూడి పర్యవేక్షించారు.  సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది, ఎస్‌. కృష్ణ నిర్మించారు. మార్చి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ...  ‘ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. మహా శివరాత్రికి మార్చి 11న ‘గాలి సంపత్‌’ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. అనిల్‌ రావిపూడి గారి మార్క్‌ ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. అంతగా మాకు సహకారం అందించారాయన. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు’ అని అన్నారు. ‘అనిల్‌ రావిపూడి సమర్పించు.. ఇది చాలా కొత్తగా ఉంది. అందరి ప్రయాణం చిన్న సినిమాల నుంచే పెద్ద స్థాయికి చేరుతుంది. అనుకున్న గమ్యం చేరుకున్న తర్వాత వచ్చిన దారి మర్చిపోతాం. ఇలాంటి డిస్కషన్‌ ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. నిన్నటి తరం దర్శకులు పెద్ద చిత్రాలు చేస్తూనే చిన్న సినిమాలు చేశారు.  ఇప్పటి దర్శకులూ ఇది అనుసరించాలి. పెద్దవాటితోపాటు చిన్న సినిమా చేయ్‌ అని అనిల్‌ని అడుగుతుండే వాణ్ని. ఆ ఆలోచనతో వచ్చిందే గాలి సంపత్‌. చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌’ అన్నారు నిర్మాత దిల్‌రాజు.

‘ఈ కథ ఎస్. కృష్ణది. నేను తెరకెక్కించిన ప్రతి కథలో కీలక పాత్ర పోషించాడు. స్వయంగా ఓ కథ రాసి తానే నిర్మాతగా మారాలనుకున్నపుడు నేనూ చిత్రంలో భాగస్వామి అవుతానన్నాను. గాలి సంపత్‌ అంటే చాలా మంది గాలికి తిరిగే వాడో, గాలోడో? అని రకరకాలుగా అనుకోవచ్చు. ప్రమాదం వల్ల రాజేంద్ర ప్రసాద్‌ గారికి మాట రాదు, గాలి మాత్రమే వస్తుంది. అదే చిత్ర కథ. ‘బాహుబలి’లోని కిల్కి భాషలా ఇందులో ఫిఫీ భాష అలరిస్తుంది. కామెడీతోపాటు తండ్రికొడుకుల ఎమోషన్‌ ఆకట్టుకుంటుంది. గాలి సంపత్‌ అంటే ఏంటో తెలియజేయడానికే ఈ సమావేశమన్నా’రు అనిల్‌ రావిపూడి. ‘ఇప్పటి వరకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. తొలిసారి నిర్మాతగా మారాను. అనిల్‌ నా జీవితంలోని కొత్త మలుపుకి శ్రీకారం చుట్టాడు. టీమ్ అందరూ కష్టపడ్డారు. అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎస్‌.కృష్ణ.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని