Gangs Of 18: పాఠశాల రోజుల్లోకి...

విద్యార్థులకి సరైన గురువు దొరికితే వాళ్ల జీవితం ఎలా మారుతుంది? వాళ్లు జీవితంలో ఎంత ఎత్తుకు ఎదగగలరనే అంశం ఆధారంగా రూపొందిన ఓ మంచి సందేశాత్మక చిత్రమే మా ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ 18’ అంటున్నారు గుదిబండి వెంకట సాంబిరెడ్డి.

Updated : 25 Jan 2022 12:23 IST

విద్యార్థులకి సరైన గురువు దొరికితే వాళ్ల జీవితం ఎలా మారుతుంది? వాళ్లు జీవితంలో ఎంత ఎత్తుకు ఎదగగలరనే అంశం ఆధారంగా రూపొందిన ఓ మంచి సందేశాత్మక చిత్రమే మా ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ 18’ అంటున్నారు గుదిబండి వెంకట సాంబిరెడ్డి. ఆయన నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రమిది. మమ్ముట్టి, ప్రియమణి, ఆర్య, పృథ్వీరాజ్‌ ప్రధాన పాత్రధారులుగా మలయాళంలో రూపొందిన ‘పడి నెట్టం పడి’ చిత్రానికి అనువాద రూపం. నా స్కూల్‌ డేస్‌... అనేది ఉపశీర్షిక. ఈ నెల 26న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా వెంకటసాంబిరెడ్డి మాట్లాడుతూ ‘‘అలీ ప్రధాన పాత్రధారిగా రూపొందిన ‘పండుగాడి ఫొటో స్టూడియో’ తర్వాత మా సంస్థ నుంచి ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రమిది. విద్యార్థి దశని దర్శకుడు తెరపై ఆవిష్కరించిన తీరు బాగుంటుంది. ప్రతి ఒక్కరినీ వాళ్ల పాఠశాల రోజుల్లోకి తీసుకెళ్లే కథ ఇది. గురువు పాత్రలో మమ్ముట్టి విద్యార్థులకి స్ఫూర్తిదాయకంగా నిలిచే తీరుతోపాటు కార్పొరేట్‌ కళాశాల, ప్రభుత్వ కళాశాలల నేపథ్యంలో సాగే సన్నివేశాలు చాలా బాగుంటాయి. ప్రతీ విద్యార్థితోపాటు వాళ్ల తల్లిదండ్రులు కచ్చితంగా చూడాల్సిన చిత్రమిది’’ అన్నారు. తదుపరి తన సంస్థలో నేరుగా ఓ సినిమా చేస్తున్నట్టు తెలిపారు వెంకట సాంబిరెడ్డి. ‘‘కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలు విద్యాసంస్థల్ని నిర్వహిస్తున్నా. సినిమా అంటే ఎంతో ఆసక్తి. కొత్తతరం కొత్త రకమైన మంచి కాన్సెప్ట్‌లతో వస్తున్నారు. వాళ్లని ప్రోత్సహిస్తూ సినిమాలు చేయబోతున్నా’’ అని ఆయన తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని