Gangubai Kathiawadi: సినిమా కోసం మా అమ్మని వేశ్యగా చూపిస్తారా..?గంగూబాయ్‌ తనయుడి ఫైర్‌

బాలీవుడ్‌ భామ అలియా భట్‌ నటించిన  ‘గంగూబాయి కతియావాడీ’ సినిమా ట్రైలర్‌ విడుదలనైప్పటి నుంచి అందరి ప్రశంసలు అందుకుంటూ వచ్చింది. ముంబయిలోని మాఫీయా క్వీన్‌ గంగూబాయి జీవితాన్ని ఆధారంగా సంజయ్‌ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

Updated : 17 Feb 2022 10:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ భామ అలియా భట్‌ నటించిన  ‘గంగూబాయి కతియావాడీ’ సినిమా ట్రైలర్‌ విడుదలనైప్పటి నుంచి అందరి ప్రశంసలు అందుకుంటూ వచ్చింది. ముంబయిలోని మాఫియా క్వీన్‌ గంగూబాయి జీవితం ఆధారంగా సంజయ్‌ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫిబ్రవరి 25న థియేటర్లలో సందడి చేయనున్న ఈసినిమాకు ఊహించని షాక్‌ ఎదురైంది. ట్రైలర్‌కు చక్కటి స్పందన వస్తోందన్న చిత్రబృందం ఆనందాన్ని ఆవిరి చేస్తూ గంగూబాయి తనయుడు సినిమాపై ఫైర్ అయ్యాడు. గంగూబాయి కుటుంబం, ఆమె దత్తపుత్రుడు బాబు రావుజీ షా, ఆమె మనవరాలు భారతి ఈ చిత్రం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ఆందోళనను వెల్లడించారు.

గత ఏడాది  ‘గంగూబాయి కతియావాడీ’ చిత్రంపై బాబూ రావుజీ షా పిటిషన్ దాఖలు చేయడంతో ముంబయి కోర్టు సంజయ్ లీలా భన్సాలీ, అలియా భట్‌లకు సమన్లు ​జారీ చేసింది. ఆ తర్వాత  సినిమా విడుదలపై స్టే విధించేందుకు ముంబయి హైకోర్టు నిరాకరించింది. అంతే కాదు చిత్ర నిర్మాతలపై క్రిమినల్, పరువు నష్టం కేసులపై మధ్యంతర స్టే కూడా ఇచ్చింది. ఇప్పుడు కేసు పెండింగ్‌లో ఉంది. 

మరికొన్ని రోజుల్లో సినిమా విడుదల కానుండగా..  ఆమె కుమారుడు మాట్లాడుతూ సినిమాపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. “నా తల్లిని వేశ్యగా మార్చారు. అమ్మ అసలు వేశ్యనా లేదా సామాజిక కార్యకర్తనా అంటూ ఇప్పుడు అనేకమంది అవమానిస్తున్నారు. ఇలాంటి మాటలు మమ్మల్ని బాధిస్తున్నాయి. మా అందరి మానసిక స్థితి బాగాలేదు. అమ్మగురించి అలాంటి మాటలు మాట్లాడుతుంటే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం.’’ అన్నారు

గంగూబాయిపై సినిమా రూపొందుతోందని వార్తలు వచ్చినప్పటి నుంచే ఆమె కుటుంబం అజ్ఞాతంలో ఉందని, తరచుగా ఇళ్లు మారుతోందని గంగూబాయి కుటుంబం తరఫు న్యాయవాది నరేంద్ర వెల్లడించారు. గంగూబాయి మనవరాలు భారతి కూడా మేకర్స్‌పై విరుచుకుపడింది. డబ్బు కోసం దురాశతో కుటుంబం పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. “డబ్బుపై దురాశతో ఈ సినిమా మేకర్స్‌ అంతా నా కుటుంబం పరువు తీశారు. దాన్ని ఎట్టిపరిస్థితిలోనూ అంగీకరించలేం. ప్రాజెక్ట్‌తో ముందుకు సాగడానికి ముందు మీరు మా కుటుంబం అనుమతి అడగలేదు. మీరు పుస్తకం రాసేటప్పుడు మా దగ్గరికీ రాలేదు. సినిమా తీయడానికి ముందు మా అనుమతి తీసుకోండి. నా అమ్మమ్మ తన జీవితాంతం అక్కడ సెక్స్ వర్కర్ల అభ్యున్నతికి కృషి చేసింది. కానీ ఈ వ్యక్తులు మా అమ్మమ్మను అభ్యంతరకరంగా చూపిస్తున్నారు? ” అంటూ ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని