మీ అంతట మీరు తప్పుకొంటే మంచిది: గంటా శ్రీనివాసరావు

విశాఖలో సిని పరిశ్రమ విస్తరణ, అభివృద్ధి తదితర అంశాలపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడారు.

Updated : 22 Jun 2024 20:41 IST

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ అభివృద్ధి జరగనీయకుండా గత వైకాపా ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. నిర్మాతలు, కె.ఎస్‌.రామారావు, అశోక్‌కుమార్‌లతో కలిసి ఆయన విశాఖలో మాట్లాడారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌ విడిపోయిన తర్వాత హైదరాబాద్‌లో ఉన్నట్లే ఏపీలోనూ ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌ను పెట్టాలన్న ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా, అప్పటి సీఎం చంద్రబాబునాయుడిగారు చెబితే వెంటనే ఆమోదించారు. తొట్లకొండపై 15 ఎకరాలు కేటాయించారు. భూమి పూజ చేసే సమయంలో అక్కడ బౌద్ధానికి సంబంధించిన కట్టడాలు ఉన్నాయని చెప్పడంతో అనవసరంగా వివాదాలకు తావు ఇచ్చినట్లు అవుతుందని ముందుకు వెళ్లకుండా ఆగిపోయాం. దీంతో సుదీర్ఘ చర్చల అనంతరం రామానాయుడుగారి స్టూడియో వద్ద 5 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఈ క్రమంలో ఎన్నికలు వచ్చి కొత్త ప్రభుత్వం వచ్చింది. దీంతో పరిస్థితులు మారిపోయాయి. వైకాపా ప్రభుత్వంలో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అసోసియేషన్‌ సభ్యులను బెదిరించి, వాళ్ల పదవులు లాక్కొన్నారు. పోనీ అభివృద్ధి పనులు ఏమైనా చేశారా? అదీ లేదు. గత ఐదేళ్లు వాళ్లు చెప్పినట్లే అంతా నడిచింది’’

‘‘వ్యవస్థలను పాడుచేసిన వారందరూ ఎన్నికల ఫలితాలు వచ్చాక తప్పుకొంటూ వస్తున్నారు. ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌ అసోసియేషన్‌లో వ్యక్తులు స్వచ్ఛందంగా తప్పుకొంటే మంచిది. సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఉంటేనే అది అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ అలా చేయకపోతే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. మెంబర్‌షిప్‌ ద్వారా వచ్చిన డబ్బులను కూడా ఆడిట్‌ చేయించమని కె.ఎస్‌.రామారావు, అశోక్‌కుమార్‌లను కోరుతున్నా. ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉంది. కొత్త కమిటీ వచ్చిన తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌, సీఎం చంద్రబాబుతో మాట్లాడి ముందుకు వెళ్తాం. స్థానిక ఎమ్మెల్యేగా ఫిలింనగర్‌ క్లబ్‌ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా’’అని గంటా శ్రీనివాసరావు అన్నారు. భవిష్యత్‌లో సినిమా చిత్రీకరణలకు, ఇతర నిర్మాణానంతర కార్యక్రమాలకు విశాఖ హబ్‌గా మారుతుందని, ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌, ఫిలిం ఇండస్ట్రీ ఇక్కడ మరింత విస్తరిస్తుందని నిర్మాతలు కె.ఎస్‌.రామారావు, అశోక్‌కుమార్‌ ఆశాభావం వ్యక్తంచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని