Gauri Khan: డ్రగ్స్‌ కేసు.. ఆర్యన్ అరెస్టుపై తొలిసారి పెదవి విప్పిన గౌరీ ఖాన్‌

బాలీవుడ్ స్టార్‌ షారుక్‌ ఖాన్(Shah Rukh Khan) తనయుడు ఆర్యన్ ఖాన్(Aryan Khan) గత ఏడాది డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే.

Updated : 22 Sep 2022 13:10 IST

ముంబయి: బాలీవుడ్ స్టార్‌ షారుక్‌ ఖాన్(Shah Rukh Khan) తనయుడు ఆర్యన్ ఖాన్(Aryan Khan) గత ఏడాది డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తర్వాత ఆ కేసులో ఆర్యన్‌కు క్లీన్‌ చిట్ కూడా లభించింది. అయితే, ఆ అరెస్టు వ్యవహారంపై అతడి తల్లి గౌరీ ఖాన్(Gauri Khan) తొలిసారి పెదవి విప్పారు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్(Karan Johar) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్‌ కరణ్‌’(Koffee With Karan 7) షోలో అడిగిన ప్రశ్నకు స్పందించారు. 

‘వ్యక్తిగతంగా మీ కుటుంబం క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంది. అప్పుడు మీరంతా దృఢంగా కనిపించారు. కుటుంబపరంగా అదంతా సులభమేమీ కాదని నాకు తెలుసు. గౌరీ.. ఆ సమయంలో మీరు మరింత బలంగా ఉండటం నేను గమనించాను. మీరు దానిని ఎలా ఎదుర్కొన్నారు..?’ అంటూ ఆర్యన్ ఖాన్‌ కేసును నేరుగా ప్రస్తావించకుండా కరణ్ ప్రశ్నించారు. 

దీనికి గౌరి స్పందిస్తూ.. ‘ఒక తల్లిగా, ఒక కుటుంబంగా అంతకంటే కఠిన పరిస్థితి మరొకటి లేదు. కానీ, మేం బలంగా నిలబడ్డాం.  అందరి ప్రేమను పొందిన ఒక ప్రదేశంలో ఉన్నామని మాత్రం చెప్పగలను. ఎంతోమంది స్నేహితులు అండగా నిలిచారు. ఆ సమయంలో మద్దతుగా ఉన్న కొందరు మాకు తెలీదు కూడా. ఎన్నో సందేశాలు వచ్చాయి. ఎంతో ప్రేమను కురిపించారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’ అంటూ ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు.

ముంబయి తీరంలోని ఓ క్రూజ్‌ నౌకలో మాదక ద్రవ్యాలు లభించడం.. అదే నౌకలో ఆర్యన్‌ ఖాన్‌ ఉండటంతో అతడిని అరెస్టు చేశారు. గతేడాది ఈ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో గతేడాది అక్టోబరు 3న ఆర్యన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు. 28 రోజుల పాటు జైల్లో ఉన్న అతడు.. అక్టోబరు 30న బెయిల్‌పై విడుదలయ్యాడు. కోర్టు ఆదేశాల మేరకు ఎన్సీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యాడు. అయితే, ఆర్యన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లభించకపోవడంతో.. ఎన్సీబీ అతడికి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని