Gautham Menon: ‘ఛెల్లో షో’ సరైన ఎంపికే కావొచ్చు

డా.విశ్వానంద్‌ పటార్‌ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శక నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘లాట్స్‌ ఆఫ్‌ లవ్‌’. ఆద్య, నిహాంత్‌, దివ్య, రాజేష్‌, భావన ఇతర నాయకానాయికలు. ఈ నెల 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

Updated : 26 Sep 2022 11:59 IST

‘ఛెల్లో షో’ (Chhello Show) భారత్‌ తరపున అధికారికంగా ఆస్కార్‌ (Oscars) బరిలో దిగుతోంది అని ప్రకటించినప్పటి నుంచీ.. ఇది సరైన ఎంపిక కాదంటూ విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. పరిశ్రమకు చెందిన ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ఎంట్రీ దక్కకపోవడంపై కూడా హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకూ పలువురు పెదవి విరిచారు. కానీ తమిళ అగ్ర దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ (Gautham Menon) మాత్రం ‘ఛెల్లో షో’కి కాస్త సపోర్ట్‌గానే మాట్లాడారు. ఆయన పరిశ్రమలోకి వచ్చి 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడారు గౌతమ్‌. ఈ సందర్భంగా విలేకరులు ఈ ఏడాది ఆస్కార్‌ ఎంపిక గురించి అడిగారు. ఆ విషయంపై స్పందిస్తూ ‘అన్ని అర్హతలున్న చిత్రాన్నే తప్పకుండా ఎంపిక చేయాల్సింది. ‘ఛెల్లో షో’ని నేను ఇంతవరకు చూడలేదు. ఎంపిక కమిటీలో అనుభవజ్ఞులు, మేధావులున్నారు. ప్రత్యేకంగా ఆ సినిమానే తీసుకున్నారంటే తప్పకుండా ఏదో కారణం ఉంటుంది. త్వరలోనే ఆ చిత్రాన్ని చూస్తాను’ అన్నారు.


ఐదు కథలతో...

డా.విశ్వానంద్‌ పటార్‌ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శక నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘లాట్స్‌ ఆఫ్‌ లవ్‌’ (Lots Of Love). ఆద్య, నిహాంత్‌, దివ్య, రాజేష్‌, భావన ఇతర నాయకానాయికలు. ఈ నెల 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక నిర్వహించారు. విశ్వానంద్‌ మాట్లాడుతూ ‘‘ఐదు కథల సమాహారం ఈ చిత్రం. కొవిడ్‌ సమయంలో చిత్రీకరించాం. ఎన్నో కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా పూర్తి చేశాం. మహిళలు, పిల్లలకి ఇది పక్కాగా నచ్చుతుంది. టికెట్‌ ధరల్నీ తగ్గిస్తున్నాం’’ అన్నారు. ‘‘పేరుకు తగ్గట్టే చాలా ప్రేమని నింపుకుని చేసిన చిత్రమిది. కథలోనూ ఆ ప్రేమ కనిపిస్తుంది’’ అన్నారు కథానాయకుల్లో ఒకరైన రాజేష్‌. ‘‘తెలుగు రాష్ట్రాల్లో వంద థియేటర్లలో, అమెరికాలో 4 థియేటర్లలో విడుదల చేస్తున్నామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో శ్రీరంగం సతీష్‌, ప్రత్తిపాటి శ్రీనివాసరావు, సోమేశ్వర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని