దీపికకు సలహాదారుగా ఉంటా : రాందేవ్‌బాబా

బాలీవుడ్‌ అగ్రశ్రేణి కథానాయిక దీపికా పదుకొణెకు సలహాదారుగా ఉంటానని ప్రముఖ యోగా గురువు రాందేవ్‌బాబా అన్నారు. అయితే దీపిక సామాజిక, రాజకీయ విషయాల్లో మరింత ఎదగాలని అందుకోసం తనలాంటి వాళ్లను సలహాదారులుగా నియమించుకోవాలని అన్నారు.

Published : 15 Jan 2020 00:52 IST

దిల్లీ: బాలీవుడ్‌ అగ్రశ్రేణి కథానాయిక దీపికా పదుకొణెకు సలహాదారుగా ఉంటానని ప్రముఖ యోగా గురువు రాందేవ్‌బాబా సంసిద్ధత వ్యక్తంచేశారు. దీపిక సామాజిక, రాజకీయ రంగాల్లో మరింత ఎదగాలని అందుకోసం తనలాంటి వాళ్లను సలహాదారులుగా నియమించుకోవాలని అన్నారు. వాళ్ల ద్వారా లోతైన అవగాహన ఏర్పరచుకోవాలని ఆయన సూచించారు. ‘దీపిక ఎంతో సత్తా ఉన్న నటి. అయితే, ఆమె పనిచేసే సినిమా రంగం రాజకీయాలకు పూర్తి భిన్నమైంది. ఏదేమైనా మొదట ఆమె మన దేశంలోని సామాజిక, రాజకీయ, సాంస్కృతిక విషయాలను అర్థం చేసుకోవాలి. పరిపూర్ణ అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే పెద్ద నిర్ణయాలు తీసుకోవాలి’ అని అన్నారు.

దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జనవరి 5న కొంతమంది విద్యార్థులు, అధ్యాపకులపై ఆగంతకులు ముసుగుల్లో వచ్చి దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థులను పరామర్శించేందుకు దీపిక.. జేఎన్‌యూను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆమెపై పలువురు భాజపా నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె తన చపాక్‌ సినిమా ప్రచారం కోసమే జేఎన్‌యూకు వెళ్లిందని ఆరోపించారు. అయితే, ఈ విషయంలో దీపికకు చాలామంది మద్దతు సైతం లభించింది. పలువురు సినిమా ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆమె చర్యను మెచ్చుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని