
శతక్కొట్టిన సరిలేరు నీకెవ్వరు
ఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు హ్యాట్రిక్ విజయాన్ని అందించిన సరిలేరు నీకెవ్వరు.. రికార్డుల వేటలో తగ్గేదే లేదంటోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం కలెక్షన్లలో దూసుకెళుతోంది. మహేశ్ హీరోగా నటించిన భరత్ అను నేను, మహర్షి సినిమాలు విజయాలు సాధించిన తర్వాత వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ నెల 11న విడుదలైంది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అభిమానులను అలరిస్తూ రికార్డుల సునామీ సృష్టిస్తోంది. తొలి మూడు రోజుల్లోనే రూ.103కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా విడుదలైన మరునాడే అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురములో విడుదలయింది. అయినా మహేశ్ సినిమా కలెక్షన్లు ఏమాత్రం తగ్గలేదు. బాక్సాఫీస్ వద్ద వందకోట్ల మార్కు దాటిన సందర్భంగా ఆ సినిమా బృందం తన ఆనందాన్ని ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘బ్లాక్‌బస్టర్ కా బాప్.. బాక్సాఫీస్ హంటర్..’ అంటూ ఓ పోస్టు పెట్టింది. అంతేకాదు అభిమానుల కోసం ఓ ప్రోమో సైతం విడుదల చేసింది. దానిని బ్లాక్‌బస్టర్ కా బాప్ ప్రోమో అంటూ పేర్కొంది. అందులో ‘ఫారెస్టా.. వెళ్లినవాడేమైనా టూరిస్టా.. వేటగాడు’ అంటూ విజయశాంతి చెప్పిన డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది.