నా షూటింగ్‌ని వాయిదా వేస్తున్నాను: చిరంజీవి 

కరోనా వైరస్‌ వ్యాప్తి ఆందోళనల నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీనటుడు మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. చిత్రీకరణ జరుపుకుంటున్న తన సినిమాను తక్షణం వాయిదా

Updated : 15 Mar 2020 06:28 IST

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి ఆందోళనల నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీనటుడు మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. చిత్రీకరణ జరుపుకుంటున్న తన సినిమాను తక్షణం వాయిదా వేసుకుంటున్నట్లు చిరంజీవి ప్రకటించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడుగా ప్రజా సహకారం కూడా అవసరం. ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది. కరోనాపై మరింత అప్రమత్తత అవసరం. కరోనా మహమ్మారి నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న ద్విముఖ వ్యూహం అభినందనీయం. కరోనా నియంత్రణ బాధ్యత ప్రభుత్వాలకే వదిలివేయకుండా అందరూ భాగస్వామ్యులు కావాలి. అందరిలో చైతన్యం కలిగించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందరిలో ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకున్నందుకు ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా కొన్ని ముందస్తు నివారణా చర్యలు ప్రారంభించినట్టు తెలిసింది. కరోనా పాజిటివ్ వచ్చిన నెల్లూరులో పాఠశాలలు, మాల్స్, థియేటర్లు, స్విమ్మింగ్స్ పూల్స్ మూసివేయడం వల్ల వైరస్ వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకున్నట్టు అయింది. పరిస్థితులకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తగిన నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నాను’’ అని మెగాస్టార్‌ అన్నారు. 

‘‘సినిమా షూటింగ్స్‌లో కూడా పెద్ద సంఖ్యలో సాంకేతిక నిపుణులు పనిచేయాల్సి ఉంది. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 10 నుంచి 15 రోజుల పాటు షూటింగ్స్ వాయిదా వేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం చిత్రీకరణ కొనసాగుతోన్న నా సినిమా షూటింగ్‌ని  వాయిదా వేద్దామని దర్శకుడు కొరటాల శివతో చెప్పినప్పుడు ఆయన వెంటనే అంగీకరించారు. ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేదు కనుక ఆర్థికంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నప్పటికీ కరోనా వైరస్ ని నియంత్రణ చేసే ఉద్యమంలో సినీరంగం కూడా పాలు పంచుకోవాలని కోరుతున్నాను. అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను’’ అని చిరంజీవి తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని