అందుకే వేర్వేరుగా ఉంటున్నాం: శృతిహసన్

కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో అందరూ గృహ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. విదేశాల నుంచి వచ్చిన వాళ్లు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని పదేపదే చెబుతోంది...

Published : 25 Mar 2020 01:39 IST

ముంబయి: కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో అందరూ గృహ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. విదేశాల నుంచి వచ్చిన వాళ్లు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని పదేపదే చెబుతోంది. అయినా కొంతమంది మాత్రం యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో తన కుటుంబం మొత్తం క్వారంటైన్‌లోకి వెళ్లడానికి గల కారణాలను హీరోయిన్‌ శృతిహసన్‌ వెల్లడించింది. గత పది రోజుల క్రితం లండన్‌ నుంచి ముంబయి వచ్చిన శృతిహసన్‌, తండ్రి కమల్‌హసన్‌, తల్లి సారిక, సోదరి అక్షరహసన్‌ సైతం క్వారంటైన్‌లోకి వెళ్లారు. అయితే, అందరూ ఒకే ఇంట్లోకి వెళ్లకుండా వేర్వేరు ఇళ్లలో నిర్బంధం విధించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. అయితే, ఇలా వేర్వే ఇళ్లలో క్వారంటైన్‌ కావడానికి గల కారణాలు ఆమె వెల్లడించింది.

‘కరోనా గురించి ప్రజలంతా భయపడుతున్నారు. వైరస్‌ భయం మాలోనూ ఉంది. అందుకే మా కుటుంబం మొత్తం స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఒక వ్యక్తి సోషల్‌ మీడియాలో సామాజిక దూరం గురించి మాట్లాడుతున్నప్పుడు అతని చుట్టూ మరో ఐదుగురు వ్యక్తులు ఉండటం గమనించాను. ఇంకో వ్యక్తి తన స్నేహితుడిని కలవాలని అంటుంటే విన్నాను. ఇలాంటి సమయంలో చదువుకున్నవాళ్లే ఇలా బాధ్యత లేనట్లుగా వ్యవహరించడం సరికాదు. విద్యావంతులు మరింత బాధ్యతగా ఉండాలి. మేం బాధ్యతాయుతంగా ఉండాలనుకున్నాం. అందుకే నాన్న, చెల్లి చెన్నైలో ఉండగా అమ్మ, నేను ముంబయిలో వేర్వేరుగా క్వారంటైన్‌లో ఉన్నాం’ అని ఆమె పేర్కొన్నారు.

‘క్వారంటైన్‌లో నేను నాలా ఉండాలని అనుకుంటున్నా. ఇందులో కష్టమైన విషయం ఏంటంటే బయటకు వెళ్ళడానికి అవకాశం లేకపోవడమే. అయితే, మీరు మీతో సమయం గడపలేకపోతే మీరు ఎవరికీ మంచి కంపెనీ ఇవ్వలేరని అర్థం. అందుకే నాకు నేను కంపెనీ ఇవ్వాలని నిశ్చయించుకొని ఒంటరిగా నిర్బంధంలోకి వెళ్లాను. నాతో పాటు ఇంట్లో ఎవరూ లేరు. సహాయకులు కూడా లేరు. నా వంట నేనే చేసుకోవాలి’ అని ఆమె పేర్కొన్నారు. కాగా తనకు బాగా ఇష్టమైన వంట, ఇతర పనులను తానే చేసుకుంటున్నట్లు ఆమె తన అభిమానులతో పంచుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని