అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు: పవన్‌ 

కరోనా మహమ్మారి విలయతాండవం ప్రదర్శిస్తున్న వేళ.. చిత్రపరిశ్రమై ఆధారపడి పనుల్లేక ఎందరో కళాకారులు, సినీ కార్మికులు నానావస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో కార్మికులకు అండగా నిలిచిన వారికి జనసేనాని, పవన్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో

Updated : 30 Mar 2020 04:20 IST

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి విలయతాండవం ప్రదర్శిస్తున్న వేళ.. చిత్రపరిశ్రమై ఆధారపడి పనుల్లేక ఎందరో కళాకారులు, సినీ కార్మికులు నానావస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో కార్మికులకు అండగా నిలిచిన వారికి జనసేనాని, పవన్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘‘కరోనా మహమ్మారి విజృంభించిన ఆపత్కాలమిది. ఈ సమయంలో ప్రభుత్వానికి, ప్రజలకు, సినీ కార్మిక లోకానికి అండగా నిలిచి పెద్ద మనసు చాటుకొంటున్న సినిమా కుటుంబానికి ధన్యవాదాలు. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ విధించిన తరుణంలో ఇక్కట్లలో ఉన్నవారికి బాసటగా నిలిచేందుకు నిధులు చాలా అవసరం. అగ్రశ్రేణి హిందీ కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌ రూ.25 కోట్లు ప్రధాన మంత్రి సహాయ నిధికి భూరి విరాళం ప్రకటించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. తెలుగు చిత్రపరిశ్రమ ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ(సీసీసీ)’ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పొయి ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకొనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం. కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న పెద్దన్నయ్య చిరంజీవికి, కమిటీ సభ్యులు డి.సురేశ్‌బాబు, ఎన్‌.శంకర్‌, సి.కల్యాణ్‌, దామోదర ప్రసాద్‌, బెనర్జీ, తమ్మారెడ్డ భరద్వాజకు అభినందనలు’’ అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. 

‘‘సీసీసీ’ కోసం ఇప్పటికే పెద్దన్నయ్య చిరంజీవి రూ.కోటి ప్రకటించారు. నాగార్జున రూ.కోటి, సురేశ్‌బాబు, వెంకటేశ్‌, రానా కుటుంబం రూ. కోటి, ఎన్టీఆర్‌, మహేశ్‌ బాబు, నాగచైతన్యలు తలో రూ.25 లక్షల చొప్పున, రామ్‌ చరణ్‌ 30 లక్షలు, వరుణ్‌ తేజ్‌ రూ.20 లక్షలు, సాయి ధర్మతేజ్‌ 10 లక్షలు, రవితేజ రూ.20 లక్షలు, శర్వానంద్‌ రూ.15 లక్షలు, విశ్వక్సేన్‌ రూ.5 లక్షలు, కార్తికేయ రూ.2లక్షలు, వెన్నెల కిశోర్‌ రూ.2 లక్షలు కథానాయిక లావణ్య త్రిపాఠి రూ.లక్ష, నిర్మాతలు దిల్‌ రాజు, శిరీష్‌ 10 లక్షలు ‘సీసీసీ’కి ప్రకటించి విపత్తు వేళ సినీ కార్మికులకు బాసటగా నిలిచారు. యువ కథానాయకుడు నిఖిల్‌ తెలంగాణ, ఏపీల్లోని ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బందికి అవసరమైన మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు, ప్రొటెక్ట్‌ గ్లాసెస్‌ ఇచ్చారు. కథానాయకుడు సుధీర్‌ బాబు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి రెండు లక్షలు ప్రకటించారు. యాంకర్‌, నటుడు ప్రదీప్‌ మాచిరాజు టీవీ రంగ కార్మికులకు నెల రోజుల పాటు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకోవడం అభినందనీయమని’’ పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. సామాజిక బాధ్యతతో అండగా నిలిచిన వారందరికీ అభినందనలు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని