పోరాట యోధులపై స్ఫూర్తి గీతం

పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులు వంటి కరోనాపై ప్రాణాలకు తెగించి పోరాటం సాగిస్తున్న

Updated : 19 Apr 2020 11:50 IST

ఆలపించిన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి

రాయదుర్గం : పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులు వంటి కరోనాపై ప్రాణాలకు తెగించి పోరాటం సాగిస్తున్న యోధుల శ్రమపై ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చి, ఆలపించిన గీతాన్ని శనివారం ఆవిష్కరించారు. సైబరాబాద్‌ పోలీసు కమిషరేట్‌లో జరిగిన కార్యక్రమంలో కీరవాణి, కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఆ పాటను వివిధ సామాజిక వేదికల్లోనూ విడుదల చేశారు. కమిషనర్‌ పీఏ శ్రీధర్‌ గవ్వల పాటను రాశారు. కమిషనర్‌ కోరిక మేరకు తాను ఇంటి నుంచే రికార్డు చేసి పంపించినట్లు కీరవాణి చెప్పారు. కరోనా నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో తాను భాగం పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కీరవాణిని కమిషనర్‌ సజ్జనార్‌ అభినందించారు. కార్యక్రమంలో డీసీపీ (క్రైమ్‌) రోహిణి ప్రియదర్శిని, పాట రచయిత శ్రీధర్‌ పాల్గొన్నారు.

గీతం సాగిందిలా..
మీ ప్రాణాలు పణమొడ్డి ప్రాణాలు నిలిపేటి ప్రజా వైద్యులారా..
మేము వేసిన చెత్త మీ చేతులతో ఎత్తే సఫాయి తల్లులారా..
సూర్యచంద్రుల సాటి పొద్దు తోటి పోటీ రక్షక భటులారా..
వార్తలెన్నోమోసి ప్రజల ముందు ఉంచే మీడియా మిత్రులారా..
దేవుళ్లంతా కలిసి మీ రూపాలల్లో తిరుగుతున్నారమ్మా..
మీ సేవల పుణ్యాన జనమంతా మరుజన్మ ఎత్తుతున్నదమ్మా..
ఎంత పొగిడినా ఏమి ఇచ్చిన మీ రుణము ఎట్ల తీర్చుకుందుమూ
మరు జన్మ అనేది మళ్లొకటి మాకుంటే మీ కొలువు మే చేతుమూ..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని