షూటింగ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టాలీవుడ్‌ ప్రముఖులు కలిశారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధర్వంలో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్‌, ఎస్.ఎస్‌. రాజమౌళి, దిల్‌రాజు, త్రివిక్రమ్‌, ఎన్‌. శంకర్‌, రాధాకృష్ణ, సి. కల్యాణ్‌, సురేశ్‌బాబు, కొరటాల శివ, జెమిని కిరణ్‌, మెహర్‌ రమేశ్‌, ప్రవీణ్‌బాబు తదితరులు.....

Updated : 22 May 2020 20:09 IST

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్స్‌కు, నిర్మాణానంతర కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టాలీవుడ్‌ సినీ ప్రముఖులు కలిశారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధర్వంలో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్‌, ఎస్.ఎస్‌. రాజమౌళి, దిల్‌రాజు, త్రివిక్రమ్‌, ఎన్‌. శంకర్‌, రాధాకృష్ణ, సి. కల్యాణ్‌, సురేశ్‌బాబు, కొరటాల శివ, జెమిని కిరణ్‌, మెహర్‌ రమేశ్‌, ప్రవీణ్‌బాబు తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. అదే విధంగా సినీ పరిశ్రమలోని కార్మికుల కోసం చేపట్టిన సహాయక చర్యలను వివరించారు. సినిమా షూటింగులు, నిర్మాణానంతర కార్యక్రమాలు, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించారు. సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని, థియేటర్లు తెరిచే అవకాశం ఇవ్వాలని సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షల మంది జీవిస్తున్నారని, ప్రొడక్షన్‌ వర్క్‌, షూటింగ్‌లు, థియేటర్లలో ప్రదర్శనలను దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. తక్కువ మందితో, ఇండోర్‌లో చేసే వీలున్న రీ ప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని సీఎం సూచించారు. జూన్‌లో సినిమా షూటింగులు ప్రారంభించాలని చెప్పారు. చివరిగా పరిస్థితిని బట్టి, సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

సినీ పరిశ్రమ బతకాలని, అదే సందర్భంగా కరోనా వ్యాప్తి కూడా జరగవద్దని సీఎం అన్నారు. అందుకోసం సినిమా షూటింగులను వీలైనంత తక్కువ మందితో లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ, కరోనా వ్యాప్తి నివారణకు అనుసరిస్తున్న మార్గదర్శకాల ప్రకారం నిర్వహించుకోవాలని చెప్పారు. ఎంత మందితో షూటింగులు నిర్వహించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై చర్చించాలని సినీ రంగ ప్రముఖులను ముఖ్యమంత్రి కోరారు. ఆ తర్వాత ప్రభుత్వం ఖచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించి, షూటింగులకు అనుమతి ఇస్తుందని వెల్లడించారు. కొద్ది రోజులు షూటింగులు నడిచిన తర్వాత, అప్పటికే పరిస్థితిపై కొంత అంచనా వస్తుంది కాబట్టి, సినిమా థియేటర్లు ఓపెన్ చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ చెప్పారు. సినిమా షూటింగ్‌లపై సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్‌కు అగ్ర కథానాయకుడు చిరంజీవి ట్విటర్‌ వేదిక కృతజ్ఞతలు తెలిపారు.

 


 


 




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని