ఫోర్బ్స్‌ జాబితాలో ఏకైక భారతీయ సెలబ్రిటీ..

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పారితోషికం పొందుతున్న మొదటి వంద మంది సెలబ్రిటీల జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్‌కు చెందిన ప్రముఖ నటుడు రాజీవ్‌ హరి ఓం భాటియా స్థానం....

Updated : 05 Jun 2020 19:30 IST

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆర్జిస్తున్న మొదటి వంద మంది సెలబ్రిటీల జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో ఏకైక  బాలీవుడ్‌ సెలబ్రిటీ, ప్రముఖ నటుడు అక్షయ్‌ కుమార్ స్థానం సంపాదించారు. ఫోర్బ్స్‌ వెల్లడించిన ఈ జాబితాలో 52 ఏళ్ల అక్షయ్‌ స్థానం కూడా ఆయన వయసుకు సమానంగా ఉండటం గమనార్హం. కాగా ప్రముఖ హాలీవుడ్‌ నటులు విల్‌ స్మిత్‌, ఏంజలీనా జోలీలనే కాకుండా రిహానా, లేడీ గాగా, కేటీ పెర్రీ, జెన్నిఫర్‌ లోపెజ్‌ వంటి పాప్‌ స్టార్ల కంటే అక్షయ్‌ ముందంజలో నిలవడం విశేషం.

590 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల ఆర్జనతో అమెరికన్ మోడల్‌ కైలీ జెన్నర్‌ ఫోర్బ్స్‌ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. ఇక నటి కిమ్‌ కర్దాషియన్‌ భర్త, పాశ్చాత్య గాయకుడు అయిన కేన్‌ వెస్ట్ 170 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల సంపాదనతో రెండో స్థానంలో ఉన్నారు. హాలీవుడ్‌ నటుడు డ్వెయిన్‌ జాన్సన్‌ 11వ స్థానంలో ఉండగా, ఈ జాబితాలో ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు క్రిస్టియానో రోనాల్డో, లియోనల్‌ మెస్సీ టాప్‌ టెన్‌లో చోటు సంపాదించుకున్నారు.

జూన్‌ 2019 నుంచి జూన్‌ 2020 మధ్యకాలంలో  అక్షయ్‌ సంపాదన 48.5 మిలియన్లు అని ఫోర్బ్స్‌ తేల్చింది. అయితే గతేడాది 33వ స్థానంలో ఉన్న అక్షయ్‌.. ఈ సారి 52వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ సందర్భంగా ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రకటనలో... అక్షయ్‌ తన రానున్న చిత్రాలు ‘బచ్చన్‌ పాండే’, ‘బెల్‌ బాటమ్‌’ల ద్వారా 13 మిలియన్‌ డాలర్లు రాబట్టగలడని అంచనా వేసింది. అంతే కాకుండా కొవిడ్-19 ఉపశమన కార్యక్రమాలకు భారీగా విరాళమిచ్చిన అక్షయ్‌ని భారత దేశంలోనే గొప్ప దాత అని ప్రశంసించింది. గత సంవత్సరం విడుదలైన అక్షయ్‌ చిత్రాల్లో ‘మిషన్‌ మంగళ్‌’, ‘గుడ్‌ న్యూజ్‌’, ‘కేసరి’, ‘హౌస్‌ఫుల్‌ 4’ మంచి కలెక్షన్లు సాధించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని