కాలం విడదీసిన ప్రేమకథ..!

అనుకోని విధంగా పరిచయమై.. మంచి స్నేహితులుగా మారి.. వివాహబంధంతో ఒక్కటయ్యారు కన్నడ నటుడు చిరంజీవి సర్జా ఆయన సతీమణి మేఘనా రాజ్‌. అయితే..

Published : 11 Jun 2020 01:14 IST

కన్నీరు పెట్టిస్తున్న ఆమె తీరని బాధ

బెంగళూరు: అనుకోని విధంగా పరిచయమై.. మంచి స్నేహితులుగా మారి.. వివాహబంధంతో ఒక్కటయ్యారు కన్నడ నటుడు చిరంజీవి సర్జా ఆయన సతీమణి మేఘనా రాజ్‌. అయితే ఈ చూడముచ్చటైన జంటను విధి విడదీసిన విషయం తెలిసిందే. సర్జా ఆకస్మిక మరణం మేఘనకు తీరని లోటును మిగిల్చింది. అంత్యక్రియల సమయంలో ఆమె మౌనరోదనతో అక్కడ ఉన్నవారందరి హృదయం ద్రవించింది. సదరు ఫొటోలు, వీడియోలను చూసి నెటిజన్లు సైతం భావోద్వేగానికి గురయ్యారు. వీరిద్దరి ప్రేమకథ తెలుసుకుని నెటిజన్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. 

కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన సుందర్‌ రాజ్‌, ప్రమీలా జోషిల ఒక్కగానొక్క కుమార్తె మేఘనా రాజ్‌

కన్నడ ప్రముఖ నటుడు శక్తి ప్రసాద్‌ మనవడిగా వెండితెరకు పరిచయమైన వ్యక్తి చిరంజీవి సర్జా. యాక్షన్‌ హీరో అర్జున్‌కి చిరంజీవి మేనల్లుడు.

ఓ శుభకార్యంలో నటి మేఘనారాజ్‌కి ఆమె తల్లి ప్రమీలా జోషి మొదటిసారి చిరంజీవి సర్జాని పరిచయం చేశారు. అలా వీరిద్దరూ అనుకోకుండా కలుసుకున్నారు.

మొదటి పరిచయంలోనే చిరు మాటలకు ముగ్ధురాలైన మేఘన ఆయనతో పరిచయం పెంచుకున్నారు. పదేళ్లపాటు మంచి స్నేహితులుగా ఉండి, అనంతరం ప్రేమబంధంలోకి అడుగుపెట్టారు.

వీరిద్దరూ కలిసి నటించిన ‘ఆటగార’ చిత్రం 2015లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సిల్వర్‌ స్ర్కీన్‌పై వీరి జంటను చూసి అభిమానులు మురిసిపోయారు.

మేఘనా రాజ్‌పై తనకున్న ప్రేమ గురించి ఆమె తల్లి ప్రమీలా జోషికి 2017లో చిరంజీవి తెలియజేశాడు. పెద్దలు అంగీకరిస్తే మేఘనను మనస్పూర్తిగా పెళ్లాడతానని చెప్పాడు.

ఇరు కుటుంబపెద్దల అంగీకారంతో 2017లో బెంగళూరులోని ఓ హోటల్‌లో చిరు-మేఘనల నిశ్చితార్థం వేడుకగా జరిగింది. అనంతరం 2018లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. క్రిస్టియన్‌, హిందూ సంప్రదాయాల్లో వీరి పెళ్లితంతు నిర్వహించారు.

తన భర్తని ‘డార్ల్‌’ అని ముద్దుగా పిలుస్తానని, ఆయన కూడా ప్రేమగా తనని ‘కుట్టిఅమ్మ’ అంటాడని మేఘనా రాజ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె తల్లిదండ్రులు మాత్రమే ఆ విధంగా పిలిచేవారట.

ప్రస్తుతం మేఘన గర్భవతి. తాను తండ్రి కాబోతున్నానని తెలిసిన వెంటనే చిరు ఎంతో సంతోషించారు. తన కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులకు మాత్రమే శుభవార్తను తెలియజేశారు. త్వరలోనే ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవాలని ఈ జంట భావించింది.

తన తండ్రితో ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో చిరంజీవి కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు.  బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆదివారం తుదిశ్వాస విడిచారు.

 

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని