ఆ పని నేనెప్పటికీ చేయను: యశ్‌

కన్నడ స్టార్‌ యశ్‌ నటిస్తున్న ‘కేజీఎఫ్‌ 2’ సినిమా ఓటీటీలో విడుదల కాబోతోందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా డిజిటల్‌ హక్కుల్ని నిర్మాతలు ఓటీటీ ప్లాట్‌ఫాంకు ఇచ్చేశారని చెప్పుకొచ్చారు. థియేటర్‌లో సినిమా విడుదల కావడం లేదని......

Updated : 13 Jun 2020 13:54 IST

తప్పుడు ప్రచారంపై ‘కేజీఎఫ్‌’ స్టార్‌ అసహనం

బెంగళూరు: కన్నడ స్టార్‌ యశ్‌ నటిస్తున్న ‘కేజీఎఫ్‌ 2’ సినిమా ఓటీటీలో విడుదల కాబోతోందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా డిజిటల్‌ హక్కుల్ని నిర్మాతలు ఓటీటీ ప్లాట్‌ఫాంకు ఇచ్చేశారని చెప్పుకొచ్చారు. థియేటర్‌లో సినిమా విడుదల కావడం లేదని నేరుగా డిజిటల్‌లోనే చూడొచ్చని వదంతులు రాశారు. దీనిపై యశ్‌ తాజాగా స్పందించారు.

‘‘కేజీఎఫ్‌ 2’ను ఓటీటీలో విడుదల చేసే ప్రసక్తే లేదు. అసలు ఆ ప్రశ్నకు చోటేలేదు. బిగ్‌స్క్రీన్‌పై కనువిందు చేసేలా సినిమాను రూపొందిస్తున్నాం. ప్రేక్షకుల అంచనాలు నాకు, నా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌కు తెలుసు. మొదటి పార్ట్‌కంటే రెండో పార్ట్‌ ఇంకా ప్రతిష్ఠాత్మకంగా ఉండాలని, అలరించాలని అభిమానులు అనుకుంటున్నారు. వారిని నిరాశకు గురి చేయడం నాకిష్టం లేదు, ఎప్పటికీ అలా చేయను’ అని యశ్‌ చెప్పారు.

ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించిన ‘కేజీఎఫ్‌’కు కొనసాగింపుగా ‘కేజీఎఫ్‌ 2’ను తెరకెక్కిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో యశ్‌ పాత్రకు సంబంధించి 20 శాతం షూటింగ్‌ జరగాల్సి ఉంది. లాక్‌డౌన్‌ తర్వాత చిత్రీకరణ ప్రారంభించనున్నారు. ‘షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ఇంకా 20 రోజుల చిత్రీకరణ ఉంది. ప్రభుత్వ అనుమతులు తీసుకున్న తర్వాత పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభిస్తాం. జులైలో అనుమతులు దొరికినా.. షెడ్యూల్‌ ప్రకారం అక్టోబరులో చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది’ అని ఇటీవల సహ నిర్మాత కార్తిక్‌ గౌడ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని