‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అలా షూట్‌ చేయనున్నారా?

కరోనా వైరస్‌ కారణంగా అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు మొదలు

Published : 16 Jun 2020 14:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌ కారణంగా అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు మొదలు పెట్టారు. కాగా, టెలివిజన్‌ సీరియళ్లు, కొన్ని చిన్న సినిమాల షూటింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అగ్ర నటుల చిత్రాలు కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు దర్శక-నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. అత్యధిక భాగం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా కూడా కరోనా కారణంగా తాత్కాలికంగా వాయిదా పడింది. చిత్రీకరణలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రాజమౌళి అండ్‌ కో తదుపరి షెడ్యూల్‌ను ప్లాన్‌ చేసినట్లు సమాచారం. షూటింగ్‌ సమయంలో ఎలాంటి నిబంధనలు పాటించాలి? ఎంతమంది సెట్‌లో ఉండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర విషయాలపై చిత్ర బృందంతో చర్చించారట. ఇందులో భాగంగా త్వరలోనే రెండు రోజుల పాటు ట్రయల్‌ షూట్‌ చేయాలని నిర్ణయించారట. అది కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు 50మందితో మాత్రమే షూటింగ్‌ చేయనున్నట్లు తెలిసింది. అంత తక్కువ మందితో షూటింగ్‌ సాధ్యమవుతుందా? లేదా? అన్నది పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్‌ టాక్‌. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. 

గండిపేట సమీపంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సాబు శిరిల్‌  నేతృత్వంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్‌లో ఈ షూటింగ్‌ జరుగుతుందని సమాచారం. కరోనా నేపథ్యంలో సెట్‌లో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారట. పీపీఈ కిట్లు, థర్మోమీటర్లు, హ్యాండ్‌ శానిటైజర్లు సహా భద్రతకు సంబంధించిన ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిసింది. అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రను పరిచయం చేస్తూ, విడుదల చేసిన టీజర్‌ ఆ అంచనాలను పెంచింది. ఇక కొమరం భీంగా ఎన్టీఆర్‌ దర్శనమివ్వనున్నారు. అలియాభట్‌, ఓలివియా మోరిస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 8, 2021న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని