కంగన x ఊర్మిళ 

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్, రాజకీయాల్లోకి ప్రవేశించిన మాజీ నటి ఊర్మిళ మతోండ్కర్‌ల మధ్య మళ్లీ వివాదం రాజుకుంది.

Updated : 04 Jan 2021 12:44 IST

మతోండ్కర్‌ ఫ్లాట్‌ కొనుగోలుపై ట్విటర్‌లో మాటకు మాట

ముంబయి: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్, రాజకీయాల్లోకి ప్రవేశించిన మాజీ నటి ఊర్మిళ మతోండ్కర్‌ల మధ్య మళ్లీ వివాదం రాజుకుంది. ఆమధ్య బాలీవుడ్‌లో బంధుప్రీతి ఉందంటూ కంగన చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఊర్మిళను ‘శృంగార తార’గా ఆమె అభివర్ణించడంతో వివాదం రేగిన సంగతి తెలిసిందే.  తాజాగా ఊర్మిళ ఫ్లాట్‌ కొనడంపై కంగన చేసిన వ్యాఖ్యలు ఇద్దరి మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. కాంగ్రెస్‌ నుంచి శివసేనలో చేరిన కొద్దిరోజులకే ఊర్మిళ తన కార్యాలయం కోసం రూ.3 కోట్ల విలువైన ఫ్లాట్‌ను కొనుగోలు చేశారంటూ వచ్చిన వార్తలను కంగన ట్విటర్‌లో పంచుకుంటూ ఊర్మిళను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్‌ చేశారు. ‘‘ఊర్మిళాజీ.. నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టుకున్న ఇళ్లను కాంగ్రెస్‌ కూల్చేయించింది. భాజపాను ‘మెప్పించడం’ వల్ల నా మీద 30 కేసులు నమోదయ్యాయి. మీరు మీ తెలివితేటలతో కాంగ్రెస్‌ను సంతోష పరుస్తున్నారు. నేనూ మీ అంత తెలివితో ఉండాల్సింది. నేనెంత మూర్ఖురాలిని’’ అంటూ అందులో వ్యాఖ్యానించారు. ఇటీవల ముంబయిలో కంగన కార్యాలయాన్ని పురపాలక శాఖ కూల్చివేసిన తర్వాత ఆమె శివసేన-కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వంపై  విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఊర్మిళపై ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కంగన వ్యాఖ్యలను ఊర్మిళ తిప్పికొట్టారు. తాను సినీ పరిశ్రమలో పాతికేళ్లు కష్టపడి సంపాదించిన డబ్బుతోనే ఆ ఫ్లాట్‌ను కొన్నట్లు చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందే 2011లోనే దాన్ని కొనుగోలు చేశానని తెలిపారు. దానికి సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయని, కంగన చెప్పిన చోటకు వచ్చి వాటిని చూపించడానికి సిద్ధమని సవాల్‌ విసిరారు. బాలీవుడ్‌లో మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నవారి పేర్లు తనకు తెలుసంటూ కంగన గతంలో చేసిన వ్యాఖ్యలపై ఊర్మిళ స్పందిస్తూ.. వెంటనే ఆ జాబితాను పోలీసులకు అందజేయాలని సూచించారు.

ఇవీ చదవండి..

అక్షయ్‌ ‘ఫౌజీ’గీతం..

హృతిక్‌ డ్రోన్‌ సెల్ఫీ చూశారా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని