ఆయన దారి రహదారి

శివాజీరావ్‌ గైక్వాడ్‌గా పుట్టి.. బెంగళూరులో అల్లరి పిల్లాడిగా ఎదిగి... కండక్టర్‌గా ఉద్యోగ జీవితం   ప్రారంభించి... నటుడిగా ఎదిగిన రజనీకాంత్‌...  జుట్టు దువ్వితే అందమే. షర్ట్‌ పక్కకు జరిపితే కేకలే. నవ్వితే ఈలలే. నడిస్తే.. అభిమానుల ఆనందహేళలే. స్టైల్‌కు ఆయన సెల్ఫీలాంటోడు. డైలాగులకు ఫేస్‌బుక్‌ పేజీ. నటనకు మకుటం ర.జ.నీ.కాం.త్‌. ఇంత పెద్ద అభిమాన గణాన్ని ఆయన ఊరికే సంపాదించలేదు....

Updated : 02 Apr 2021 09:26 IST

ఇంత నల్లగ ఉన్నాడు.. ఈయన.. హీరోనా?
ఒట్టి హీరో కాదు... సూపర్‌ స్టార్‌.
ఆయన డైలాగ్‌ చెబితే బాక్స్‌ఫీసు దద్దరిల్లిపోతుంది.
ఆయన కాలు కదిపితే దేశదేశాలు ఊగిపోతాయి.
వెండితెరకు ‘స్టైల్‌’ కాంతులు అద్దిన రజనీకాంత్‌ ఆయన.

ఈ బక్కటి మనిషికి ఇంత ఉందా?
ఓయ్‌... మనిషి సన్నవాడైనా మనసు చాలా పెద్దది.
‘రాఘవేంద్ర ట్రస్ట్‌ పబ్లిక్‌ చారిటీ ట్రస్ట్‌’ పెట్టి వచ్చిన  ఆదాయంలో సగం సేవలకే ఇచ్చేస్తున్నారు.
అడుగడుగునా అనుసరించే కోట్ల మంది అభిమానగణంతో బలమైన కథానాయకుడాయన.

నెత్తిమీద కాసింతైన జుట్టు లేదు..
ఈయనకు ఇంత మంది అభిమానులా?
జుట్టు లేకపోతే ఏంది?
కావాల్సినంత మంచితనం..  మాటలకందనంత
నిరాడంబరత ఆయన సొంతం.
ఆయనకు గాక... ఇంక ఎవరికి ఉంటారు?
పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌, దాదాసాహెబ్‌ ఫాల్కే...
ఏ అవార్డు అయినా ఆయనకు కాక ఎవరికిస్తారు?

‘‘ఓ వ్యక్తి దేనినైనా దక్కించుకోవాలని బలంగా ప్రయత్నిస్తే... ప్రపంచంలోని ఏ శక్తి ఆపజాలదు.’’ వివేకానందుడు చెప్పిన ఈ మాటలు... రజనీకాంత్‌ ఇంటి గుమ్మంపై స్ఫూర్తి కిరణాలై మెరుస్తుంటాయి.

అసలు పేరు : శివాజీరావ్‌ గైక్వాడ్‌
పుట్టింది : డిసెంబర్‌ 12, 1950
తల్లిదండ్రులు : రాంబాయి,రాణోజీ గైక్వాడ్‌
చదివింది : ఎస్‌ఎస్‌ఎల్‌సీ
భార్య : లతా
పిల్లలు : ఐశ్వర్య, సౌందర్య
నటించిన సినిమాలు : 160కి పైగా
తొలిచిత్రం : అపూర్వ రాగంగళ్‌(1975)
రజనీకాంత్‌ ఎలా అయ్యాడు
దర్శకుడు బాలచందర్‌ తీస్తున్న ‘అపూర్వ రాగంగళ్‌’ సినిమాలో పాత్రకు శివాజీరావ్‌ గైక్వాడ్‌ ఎంపికయ్యారు. అప్పటికే చిత్ర పరిశ్రమలో శివాజీ ఉండటంతో...శివాజీరావ్‌కు ... రజనీకాంత్‌గా నామకరణం చేశారు.
సూపర్‌స్టార్‌ అయ్యిందెప్పుడు
‘భైరవి’(1978)... కలైపులి థాను మొదటి సారి సినిమాలో రజనీకాంత్‌ పేరుకు ముందు సూపర్‌స్టార్‌ అని వేయించారు.
తెలిసిన భాషలు
తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, మరాఠి, ఆంగ్లం... ఈ భాషల్లో ఆయన సినిమాలూ చేశారు.
అత్యధికంగా ఎస్పీ ముత్తురామన్‌ దర్శకత్వంలో 25 సినిమాల్లో నటించారు సూపర్‌స్టార్‌. ఈయన అత్యధిక చిత్రాలకు సంగీతం అందించిన ఘనత ఇళయరాజాకు దక్కుతుంది.

శివాజీరావ్‌ గైక్వాడ్‌గా పుట్టి.. బెంగళూరులో అల్లరి పిల్లాడిగా ఎదిగి... కండక్టర్‌గా ఉద్యోగ జీవితం   ప్రారంభించి... నటుడిగా ఎదిగిన రజనీకాంత్‌...  జుట్టు దువ్వితే అందమే. షర్ట్‌ పక్కకు జరిపితే కేకలే. నవ్వితే ఈలలే. నడిస్తే.. అభిమానుల ఆనందహేళలే. స్టైల్‌కు ఆయన సెల్ఫీలాంటోడు. డైలాగులకు ఫేస్‌బుక్‌ పేజీ. నటనకు మకుటం ర.జ.నీ.కాం.త్‌. ఇంత పెద్ద అభిమాన గణాన్ని ఆయన ఊరికే సంపాదించలేదు. తిండిలేని రాత్రులెన్నో గడిపారు. బెంగళూరు నుంచి చెన్నై వెళ్లి సినిమా ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. ఆయనలోని తపన చూసి, ప్రతిభను మెచ్చిన దర్శకుడు కె.బాలచందర్‌ ‘అపూర్వ రాగంగళ్‌’ చిత్రంలో అవకాశమిచ్చారు. ఈ పాత్ర.. ఆ పాత్ర అనకుండా చిన్నచిన్న క్యారెక్టర్లు సైతం చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఈ భాష.. ఆ భాష అనుకోకుండా దూసుకుపోయాడు. 160కి పైగా చిత్రాల్లో నటించారు. నటిస్తున్నారు. యువ కథానాయకులతో పోటీ పడుతూ... బాక్స్‌ఫీసుపై విజయయాత్రలను కొనసాగిస్తున్నాడు. చలనచిత్ర రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారంతో రజనీకాంత్‌ని సత్కరించింది.
ఇలా మొదలై...
1975 ఆగస్టు 15.. ‘అపూర్వ రాగంగళ్‌’ సినిమా అది.. తెరపై ఓ నల్లని రూపం.. కోటుసూటు వేసుకుని ఓ పేద్ద గేటును తెరచి లోపలకు వస్తారో సాధారణ నటుడు.. అప్పటి వరకు ఎవరూ ఊహించలేదు.. అతనే సూపర్‌స్టార్‌ అవుతాడని! ఆ సన్నివేశం మాదిరిగానే ‘స్టైల్‌’ అనే గేటును తెరచుకుని లోపలకు వచ్చిన ఆయనకు సినీవినీలాకాశం ఎర్రతివాచి పరిచింది. తమిళతంబిలు ఆయన స్టైల్‌కు ఫిదా అయ్యారు. 1976లో వచ్చిన ‘మూండ్రు ముడిచ్చు’, 1977లో ‘అవర్గళ్‌’ వంటి చిత్రాలకు ఆయనకు మరింత క్రేజీని తెచ్చిపెట్టాయి. 1978లో వచ్చిన ‘భైరవి’లో సోలో హీరోగా అన్నివర్గాల ప్రేక్షకులను కట్టిపడేశారు రజనీకాంత్‌. అదే ఏడాదిలోని ‘ముల్లుం మలరుం’ నటన పరంగా ఎక్కువ మార్కులు కొట్టేశారు. సంవత్సరానికి ఏడు నుంచి పది చిత్రాల్లో నటిస్తూ తిరుగులేని హీరోగా నిలిచారు. అంతకుముందు ఎంజీఆర్‌, శివాజి వంటి మహా నటులు తమకంటూ ప్రత్యేక ముద్రవేసినప్పటికీ.. వారి శైలిని అనుకరించకుండా తనకంటూ ప్రత్యేక మార్గంలో నడవడమే రజనీకాంత్‌కు కలిసొచ్చింది.
నచ్చిన రంగు తెలుపు..
ఒకప్పుడు నల్లని దుస్తులను ఇష్టపడే రజనీకాంత్‌.. ఆధ్యాత్మికంపై ఎక్కువ దృష్టిపెట్టిన తర్వాత తెల్లని దుస్తులనే ఎక్కువగా ధరించేవారు. రజనీకాంత్‌లో చింతన, భక్తితత్వం అంతాఇంత కాదు.. ఏదైనా స్టేజీపై నాస్తికులు ఉన్నా.. వారి మనసు మారేవిధంగా మాట్లాడటం ఆయన స్టైల్‌. ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా ‘ఓంకారనాదం’ వినేందుకు ఇష్టపడతారు. రజనీకాంత్‌కు హిమాలయాలంటే ఎక్కువ ఇష్టమన్న విషయం అందరికీ తెలిసిందే. తాను నటించే సినిమా చిత్రీకరణ పూర్తయిన వెంటనే ఆ సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా హిమాలయాలకు వెళ్లిపోతుంటారు.  
మరవలేని హోలీ..
తన గురువు, దర్శక శిఖరం కె.బాలచందర్‌ అంటే రజనీకాంత్‌కు ఎనలేని గౌరవం. ఆయన ఫోన్‌చేస్తే ఇంట్లో ఉన్నాకానీ, లేచి నుంచోనే మాట్లాడుతారని ఆయన కుటుంబీకులు పలుమార్లు చెప్పారు. హోలీరోజున  రజనీకాంత్‌ పనిగట్టుకుని తన గురువు కె.బాలచందర్‌కు ఫోన్‌ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత బాలచందర్‌.. ‘ఎందుకు హోలీ రోజున తప్పకుండా నాకు ఫోన్‌ చేస్తున్నావ్‌’ అని అడిగితే.. ‘నాకు రజనీకాంత్‌ అని పేరు పెట్టింది ఈ హోలీ రోజునే సార్‌’ అని చెప్పారు. శివాజి గణేశన్‌ను ‘నటనా నిఘంటువు’గా అభివర్ణిస్తారు రజనీకాంత్‌. ఆయనే తనకు స్ఫూర్తి అని పలు సందర్భాల్లో చెప్పారు.
నిరాడంబరత...
కోట్లల్లో రెమ్యూనరేషన్‌.. కోట్లాది అభిమానుల తార.. అయినప్పటికీ నిరాడంబరతే రజనీ అస్త్రం. ఉన్నట్టుండి తన స్నేహితుల ఇంటికి సాధారణంగా వెళ్లి ఆశ్చర్యపరుస్తారు. పర్సు, క్రెడిట్‌కార్డులు వాడే అలవాటు లేదు. రోడ్డు పక్కన ఉన్న తోపుడుబండ్లపై విక్రయించే వంటకాలను ఇష్టపడీ మరీ భోంచేస్తారు. చెన్నైలోని పోరూర్‌ సిగ్నల్‌లో ఉన్న ఓ హోటెల్‌కు ఇప్పటికీ వెళ్తుంటారు.  
వెతికి తీసిన ఆణిముత్యం
అప్పుడు అతని పేరు శివాజీరావ్‌ గైక్వాడ్‌. సినిమా అవకాశాల కోసం చెన్నై వచ్చి ఆరంభంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. భాష రాదు. డబ్బు లేదు.  అవకాశాల కోసం ఎన్నో కార్యాలయాల మెట్లు ఎక్కి దిగాడు. అవకాశం రాలేదు. చెన్నై నుంచి తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. సెంట్రల్‌స్టేషన్‌లో ఉండగా.. దర్శకుడు బాలచందర్‌ శిష్యులు ఆయన్ను గుర్తించి ఓ సినిమా స్టూడియోకు తీసుకెళ్లారు. ఎందుకంటే ఆ ఘటనకు కొన్నిరోజుల ముందుగా తాను  తెరకెక్కించనున్న ‘అపూర్వ రాగంగళ్‌’ చిత్రం కోసం నల్లని, సూటిముక్కు ఉన్న శివాజిరావ్‌నే ఆయన ఎంచుకున్నారు. కానీ ఇన్‌స్టిట్యూట్‌లో ఆ వ్యక్తి లేకపోవడంతో.. విషయం తెలుసుకుని సెంట్రల్‌స్టేషన్‌లో వెతికి గుర్తించారు. అలా వెండితెరపై మెరిసిన రజనీకాంత్‌ ‘నా దారి రహదారి’ అంటూ దూసుకుపోతున్నారు. భారతదేశ సినీ చరిత్రలో మకుటం లేని నటమహారాజులా వెలిగిపోతున్నారు. తను ఒక అడుగు వేస్తే... వంద అడుగులు ముందుకు వేసే కోట్ల మంది అభిమానులను అలరిస్తున్నారు.  
తెలుగు తెరపై రజనీ‘కాంతులు’
రజనీకాంత్‌ను ప్రత్యేకంగా ఏ భాషకు పరిమితం చేయలేం. ఆయన భారతీయ సినిమా గర్వించే గొప్ప నటుడు. ఆయన ఎక్కువ  తమిళంలో నటించినా ఆ సినిమా అన్ని భాషల ప్రేక్షకులను అలరించేది. ఆయన నటించిన చాలా చిత్రాలు తెలుగులోకి అనువాదం కావడం చాలా సర్వసాధారణం. అదే సమయంలో తెలుగులోనూ నేరుగా పలు చిత్రాల్లో నటించి మెప్పించారు రజనీ. ఆయన తొలి చిత్రం ‘అపూర్వరాగంగళ్‌’, రెండోది కన్నడ చిత్రం ‘సంగమ’ కాగా, మూడోది తెలుగు చిత్రం ‘అంతులేని కథ’. తొలి మూడు చిత్రాలు మూడు భాషల్లో నటించిన ఘనత రజనీ సొంతం. కెరీర్‌ తొలినాళ్లలో చాలా చిత్రాల్లో చిన్న పాత్రలే పోషించినా తనదైన మేనరిజమ్‌, స్టైల్స్‌తో ఆకట్టుకున్నారు. మధ్యతరగతి జీవితాల్ని హృద్యంగా తెరపై ఆవిష్కరించే దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్‌. ఆయన తెరకెక్కించిన చిత్రమే ‘అంతులేని కథ’. ఇందులో తాగుబోతు అన్న మూర్తి పాత్రలో రజనీ నటనను మర్చిపోలేం. ఆయనకిది తెలుగులో తొలి చిత్రమే అయినా గుర్తుండిపోయేలా నటించారు. ‘చిలకమ్మ చెప్పింది’లో రవిగా, ‘తొలి రేయి గడిచింది’లో చిట్టిబాబుగా ఆకట్టుకున్నారు.

తెలుగు స్టార్‌లతో తలైవా

తెలుగు చిత్రసీమలో ప్రముఖ కథానాయకులైన ఎన్టీఆర్‌, కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, మోహన్‌బాబు...ఇలా స్టార్‌ హీరోలతో తెరను పంచుకున్నారు రజనీ. ఆయన, కృష్ణ హీరోలుగా తెర   కెక్కిన ‘అన్నదమ్ముల సవాల్‌’, ‘ఇద్దరూ అసాధ్యులే’ చిత్రాలు మంచి విజయం సాధించాయి. కృష్ణతో కలిసి రజనీ నటించిన మరో చిత్రం ‘రాబర్ట్‌ రామ్‌ రహీమ్‌’. విజయనిర్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌గా రజనీ, రాబర్ట్‌గా కృష్ణ, రహీమ్‌ పాత్రలో చంద్రమోహన్‌ నటించారు. రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘కాళీ’ చిత్రంలో చిరంజీవి ఓ కీలక పాత్ర పోషించారు. శోభన్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కిన ‘జీవన పోరాటం’ చిత్రంలో ఆయనకు తమ్ముడి పాత్రలో నటించారు రజనీ. కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఆమె కథ’ చిత్రంతో పాటు సుమన్‌ హీరోగా వచ్చిన ‘న్యాయం మీరే చెప్పాలి’లో అతిథి పాత్రల్లో మెరిశారు రజనీ. ఎన్టీఆర్‌తో కలిసి రజనీకాంత్‌ నటించిన చిత్రం ‘టైగర్‌’. ఎన్టీఆర్‌ స్నేహితుడు రషీద్‌ పాత్రలో రజనీ మెప్పించారు. ‘అమ్మ ఎవరికైనా అమ్మే’, అందమైన అనుభవం, కథానాయకుడు వంటి చిత్రాలతోనూ అలరించారు రజనీ.
పాపారాయుడి తీర్పుని మర్చిపోలేరు: మోహన్‌బాబు కెరీర్‌లో మైలు రాయి చిత్రం ‘పెదరాయుడు’. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీసుని వసూళ్లతో నింపేసింది. ఇందులో పెదరాయుడు తండ్రి పాపారాయుడి పాత్రలో రజనీ ఒదిగిపోయిన వైనం తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. స్టైల్‌గా చుట్ట వెలిగిస్తూ తీర్పులు చెప్పే ఆ పాత్రలో రజనీ నటన చిత్రానికే ప్రత్యేక ఆకర్షణ.

- న్యూస్‌టుడే, కోడంబాక్కం

కర్ణాటకలో అల్లరి అబ్బాయి  

జనీకాంత్‌కు దాదా సాహెబ్‌ ఫాల్కె పురస్కారం లభించడంతో బెంగళూరులోని ఆయన బాల్య  స్నేహితులు, సోదరుడు అమితానందాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఎప్పుడు ఇక్కడికి వచ్చినా    రహస్యంగా వచ్చివెళ్లేవారు. కారణం అభిమానులు పోటెత్తుతారని. తన వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకూడదని. శివాజీరావు గైక్వాడ్‌.. బాల్యంలో మహాతుంటరి అనే పేరుండేది. విద్యార్థి దశలోనే చురుగ్గా ఉండేవారు. నాటకాల్లో కనిపించేవారు. ఇదే ఆసక్తి సినిమాల వైపు నడిచేలా చేసిందంటారు. చదువు తరువాత ఉపాధి కోసం బెంగళూరు ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థ (అప్పట్లో బి.టి.ఎస్‌.) లో కండక్టర్‌గా చేరారు. విధి నిర్వహణలో స్టైల్‌గా ఉండేవారట. అందుకే ఇప్పటికీ రజనీ స్టైల్‌ అనే పిలుస్తుంటారు. చెన్నైలో సినిమా రంగంలోకి ప్రవేశించినా తాను పుట్టి పెరిగిన కన్నడ చిత్రసీమ పట్ల అభిమానాన్ని కొనసాగించారు. కన్నడలో కథా సంగమ, బాళు జేను, ఒందు ప్రేమద కథె, సహోదర సవాల్‌, కుంకుమరక్షె, గలాటె సంసార, కిలాడి కిట్టు, మాతు తప్పద మగ, తప్పిద తాళ, ప్రియ, గర్జనె సినిమాల్లో నటించారు.  కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అభినందనలు తెలిపారు.

-న్యూస్‌టుడే, బెంగళూరు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని