
Tamannaah: కఠిన సమయంలో.. విజయవంతంగా
‘‘మాస్ట్రో’ చిత్రంలో తన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది నటి తమన్నా. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్‌లో విజయవంతమైన ‘అంధాదూన్’కి రీమేక్‌గా రూపొందుతోంది. ఆ సినిమాలో టబు చేసిన పాత్రనే ఇప్పుడు తెలుగులో తమన్నా పోషిస్తోంది. ప్రతినాయిక ఛాయలున్న పాత్ర ఇది. సవాళ్లతో నిండిన ఈ పాత్రతో.. మిల్కీబ్యూటీ ప్రయాణం ముగిసింది. దీనిపై ఆమె ఇన్‌స్టా వేదికగా స్పందిస్తూ.. ‘‘మాస్ట్రో’లో నా పాత్ర చిత్రీకరణ పూర్తయింది. ఈ క్లిష్టసమయంలో చిత్రీకరణ జరపడం సవాల్‌తో కూడిన పనే. అయినా మేం దీన్ని విజయవంతంగా పూర్తి చేశాం. ఇక సినిమాని తెరపై చూడటమే మిగిలింది. ఇందుకోసం నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. త్వరలో విడుదల తేదీ అధికారికంగా ప్రకటిస్తారు’’ అని తెలియజేసింది. తమన్నా ప్రస్తుతం సత్యదేవ్‌కు జోడీగా ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రంలో నటిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.