అప్పుడు చాలా భయపడ్డా

‘‘ఫలానా పాత్రలే చేయాలి అని ప్రత్యేకంగా పరిమితులేం పెట్టుకోలేదు. మంచి కథల్లో భాగమవ్వాలి.. నటిగా  ప్రేక్షకుల మదిలో కలకాలం గుర్తుండిపోవాలి. అదే నా లక్ష్యం’’ అంటోంది ప్రియాంక జవాల్కర్‌. ‘టాక్సీవాలా’ చిత్రంతో సినీప్రియుల హృదయాల్ని కొల్లగొట్టిన తెలుగు సోయగం ఆమె. కాస్త విరామం తర్వాత ఇప్పుడు వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది. 

Updated : 12 Jul 2021 05:23 IST

‘‘ఫలానా పాత్రలే చేయాలి అని ప్రత్యేకంగా పరిమితులేం పెట్టుకోలేదు. మంచి కథల్లో భాగమవ్వాలి.. నటిగా  ప్రేక్షకుల మదిలో కలకాలం గుర్తుండిపోవాలి. అదే నా లక్ష్యం’’ అంటోంది ప్రియాంక జవాల్కర్‌. ‘టాక్సీవాలా’ చిత్రంతో సినీప్రియుల హృదయాల్ని కొల్లగొట్టిన తెలుగు సోయగం ఆమె. కాస్త విరామం తర్వాత ఇప్పుడు వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ‘ఈనాడు సినిమా’ ఆమెని పలకరించగా ఆసక్తికర విషయాలు పంచుకుంది. 

‘టాక్సీవాలా’ హిట్‌తో తెలుగు తెరపైకి దూసుకొచ్చారు. తర్వాత వేగం పెంచలేకపోయారెందుకు?

‘‘మూడేళ్లుగా తెరపై కనిపించకపోవచ్చు కానీ.. నేను ఏరోజు ఖాళీగా లేను. ఏదోక సినిమాతో సెట్స్‌పై బిజీగానే ఉంటున్నా. ‘టాక్సీవాలా’ విడుదలవక ముందు నుంచే చాలా ఆఫర్లు వచ్చాయి. పాతికకు పైగా స్క్రిప్ట్‌లు విన్నా. వాటిలో ‘గమనం’ కథ నచ్చడంతో దానికి ఓకే చెప్పా. ఆ సినిమా 2019లోనే సెట్స్‌పైకి వెళ్లింది. వెంటనే ‘ఎస్‌.ఆర్‌.కల్యాణమండపం’ చేశా. ఈ రెండు గతేడాదే   విడుదల కావాల్సి ఉన్నా.. కొవిడ్‌  పరిస్థితుల వల్ల ఆలస్యమయ్యాయి. ఈలోపు ‘తిమ్మరుసు’ చిత్రం పూర్తి చేశా. ఇవన్నీ ఈ ఏడాదిలో వరుసగా ప్రేక్షకుల ముందుకు వస్తాయి. నాకు తెలిసి ఇకపై గ్యాప్‌ కనిపించకపోవచ్చనే  అనుకుంటున్నా’’.

మునుపటితో పోల్చితే చాలా నాజుగ్గా తయారయ్యారు. ఏదైనా పాత్ర కోసమా?

‘‘వ్యక్తిగత ఆరోగ్యాన్ని.. సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని ఇలా ప్రయత్నించా. ‘టాక్సీవాలా’ తర్వాత నేను చాలా లావై పోయా. థైరాయిడ్‌ సమస్యతో పాటు హార్మోన్ల అసమతౌల్యం వల్ల నేను అనారోగ్యానికి గురయ్యా అన్న సంగతి గుర్తించలేకపోయా. ఒకానొక సమయంలో ముఖమంతా మొటిమలు విపరీతంగా వచ్చేశాయి. దాంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటే.. నాకున్న   సమస్యలన్నీ బయటకొచ్చాయి. అప్పుడు చాలా భయపడ్డా. తర్వాత నా జీవన శైలిని పూర్తిగా మార్చుకోవాలని బలంగా నిర్ణయించుకున్నా. వ్యాయామాలు, యోగా చేయడం ప్రారంభించా. ప్రత్యేక డైట్‌ తీసుకోవడం మొదలు పెట్టా. ఇంట్లోనే రకరకాల కసరత్తులు చేసి మళ్లీ ఇలా ఫిట్‌గా మారా.

త్వరలో ‘తిమ్మరుసు’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కథేంటి? మీ పాత్ర ఎలా ఉండనుంది?

‘‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా చూశాక సత్యదేవ్‌తో కచ్చితంగా కలిసి పనిచేయాలనుకున్నా. అదే సమయంలో ‘తిమ్మరుసు’ కథ నా దగ్గరకొచ్చింది. సత్య చేస్తున్నాడని తెలిశాక కథ వినకుండానే ఓకే చెప్పేశా. చిత్రీకరణకు ముందు పూర్తి స్క్రిప్ట్‌ విన్నాక.. నా ఎంపిక సరైనదే అనిపించింది. ఇదొక పరిశోధనాత్మక థ్రిల్లర్‌. నేను.. సత్య.. లాయర్లుగా కనిపిస్తాం. మేమిద్దరం కలిసి ఓ కేసు ఇన్వెస్టిగేట్‌ చేస్తుంటాం. ఆ కేసేంటి? దాన్ని ఛేదించే క్రమంలో మాకెదురైన ఇబ్బందులేంటి? ఆ కేసు మేం గెలిచామా.. లేదా? అన్నది చిత్ర కథాంశం. నా పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది’’.

‘గమనం’, ‘ఎస్‌.ఆర్‌.కల్యాణమండపం’ విశేషాలేంటి?

‘‘గమనం’ నాకు చాలా స్పెషల్‌ సినిమా. వాస్తవికతకు చాలా దగ్గరగా ఉండే కథతో తెరకెక్కుతోంది. అందులో నేను మధ్యతరగతి కుటుంబానికి చెందిన ముస్లిం యువతిగా కనిపిస్తా. చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. సుజనా రావు ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. తెరపై చూస్తున్నప్పుడు ప్రేక్షకుల గుండెలు భావోద్వేగంతో బరువెక్కుతాయి. ‘ఎస్‌.ఆర్‌.కల్యాణమండపం’లో ఓ గడుసుదనం నిండిన కాలేజీ అమ్మాయిలా కనిపిస్తా. ఈ పాత్ర కోసం నా కాస్ట్యూమ్స్‌ నేనే   ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్నా’’.

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలకు ఎలాంటి ఆదరణ కనిపిస్తోంది?
‘‘మంచి ఆదరణే కనిపిస్తోంది. ఈమధ్య ఇండస్ట్రీలో తెలుగు కథానాయికల సందడి బాగానే కనిపిస్తోంది. మంచి అవకాశాలే దక్కుతున్నాయి. చాలా మంది ‘తెలుగమ్మాయి కావడం వల్ల ఏమన్నా అవకాశాలు కోల్పోయారా’ అని అడుగుతుంటారు. నిజానికి నాకిప్పటి వరకు అలాంటి అనుభవమే ఎదురుకాలేదు. ఆ ఫీలింగ్‌ ఎప్పుడూ కలగలేదు. కథలు.. పారితోషికాల  విషయాల్లో కొన్ని సినిమాలు చేజారి ఉండొచ్చు.. అంతే కానీ, మరే ఇబ్బందులు లేవు. ఓ తమిళ చిత్రానికీ సంతకాలు చేశా. కరోనా పరిస్థితుల వల్ల కాస్త ఆలస్యమవుతోంది’’.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని