బ్యాంక్‌ల్లోనూ థియేటర్లు కడతారు

‘‘రానున్న పదేళ్ల కాలంలో సినీ ప్రదర్శన రంగంలో పెను మార్పులు జరుగుతాయి’’ అన్నారు ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు. ఇప్పుడున్న విధానం మారిపోయి  అపార్ట్‌మెంట్లలోనూ... బ్యాంక్‌ల్లోనూ యాభై సీట్లతో కూడిన థియేటర్లు ఏర్పాటయ్యే 

Published : 19 Jul 2021 02:18 IST

‘‘రానున్న పదేళ్ల కాలంలో సినీ ప్రదర్శన రంగంలో పెను మార్పులు జరుగుతాయి’’ అన్నారు ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు. ఇప్పుడున్న విధానం మారిపోయి  అపార్ట్‌మెంట్లలోనూ... బ్యాంక్‌ల్లోనూ యాభై సీట్లతో కూడిన థియేటర్లు ఏర్పాటయ్యే  అవకాశాలు  ఉంటాయని చెబుతున్నారు. ఇటీవల ఆయన కలైపులి ఎస్‌.థానుతో కలిసి ‘నారప్ప’ చిత్రాన్ని నిర్మించారు. వెంకటేష్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం  అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ నెల 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సురేష్‌బాబు ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

‘‘మా ‘నారప్ప’ సినిమా థియేటర్లలో విడుదల కాకపోవడం వల్ల వెంకటేష్‌కి,  దర్శకుడికీ, అభిమానులకే కాదు నాకూ బాధగా ఉంది. కొన్ని విషయాల్లో వాస్తవిక ధోరణిలో ఆలోచించక తప్పదు. ‘నారప్ప’ సినిమాకి నేను మాత్రమే నిర్మాత అయ్యుంటే కచ్చితంగా ఓటీటీలో విడుదల చేసేవాణ్ని కాదు. ఓటీటీలో విడుదల  చేయడంతో నాకు డబ్బు మిగిలినా నేను ఆ డబ్బుని వేరే వ్యాపారంలో పెట్టను కదా. ఆ డబ్బుతో మామూలుగా ఉన్న థియేటర్లని మరిన్ని హంగులతో బాగు చేయించుకుంటా. లేదా ఇంకో సినిమా చేస్తాను. ఎటొచ్చీ  పరిశ్రమలోనే మేం డబ్బు పెడతాం’’.

* ‘‘మనకు రకరకాల మార్కెట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఒకటి ఓటీటీ. మనం ఓటీటీని అడ్డుకోగలమని నేను అనుకోవడం లేదు. కొవిడ్‌ రాకపోయుంటే మాత్రం ఇంత వేగంగా మనం అలవాటయ్యేవాళ్లం కాదు. ఓటీటీ వేదికల వల్ల సినిమా రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రదర్శన రంగం మాత్రం ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వం స్పందించి సహకారం అందించాల్సిన  అవసరం ఉంది. భవిష్యత్తులో ఓటీటీ కొనసాగుతూనే.. పెద్ద పెద్ద నగరాల్లో సూపర్‌స్క్రీన్స్‌ రాబోతున్నాయి. క్లబ్‌హౌస్‌ల తరహాలో పలు అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ల్లో మూడు నాలుగేళ్ల తర్వాత మినీ థియేటర్లు కట్టేస్తారు. ఈకామర్స్‌ వల్ల మనం బ్యాంక్‌కి వెళ్లాల్సిన పనే లేదిప్పుడు. కానీ బ్యాంక్‌లు వారి ప్రాజెక్టుల్ని వ్యక్తిగతంగా వివరిస్తూ ఖాతాదారులకి అమ్మాల్సి ఉంటుంది. అలా వాళ్లని బ్యాంక్‌లకి ఆకర్షించడం కోసం అక్కడ థియేటర్లని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలా వినోద రంగంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటాయి’’.

* ‘‘థియేటర్ల పరంగా ఆంధ్రప్రదేశ్‌లో చాలా సమస్యలు ఉన్నాయి. తెలంగాణలోనూ  సమస్యలున్నా త్వరలోనే థియేటర్లని తెరిచేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ.20, రూ.30 టికెట్‌ ధర పెట్టి ఏసీ థియేటర్‌ నడపడం అంటే చాలా కష్టం. దీనికితోడు కరోనా వల్ల యాభై శాతం సీటింగ్‌ కెపాసిటీతో ప్రదర్శనలు కొనసాగించాల్సి రావడం, రాత్రివేళల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతుండడం వంటి కారణాల వల్ల అక్కడ థియేటర్లని తెరవడం కష్టం అవుతోంది’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని