Chiranjeevi: మాది గురుశిష్యుల అనుబంధం

తనకు అల్లురామలింగయ్యతో గురుశిష్యుల అనుబంధం ఉండేదని, సినిమాల్లో హాస్యం పండించిన ఆయన నిజ జీవితంలో మార్గదర్శకునిగా నిలిచారని మాజీ ఎంపీ, అగ్ర కథా నాయకుడు చిరంజీవి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అల్లు రామలింగయ్య హోమియో కళాశాలలో శుక్రవారం అల్లు  రామలింగయ్య కాంస్య విగ్రహ ఆవిష్కరణ, నూతన భవన   నిర్మాణాన్ని ఆయన ప్రారంభించారు.

Updated : 02 Oct 2021 04:45 IST

సినీ నటుడు చిరంజీవి

నకు అల్లురామలింగయ్యతో గురుశిష్యుల అనుబంధం ఉండేదని, సినిమాల్లో హాస్యం పండించిన ఆయన నిజ జీవితంలో మార్గదర్శకునిగా నిలిచారని మాజీ ఎంపీ, అగ్ర కథా నాయకుడు చిరంజీవి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అల్లు రామలింగయ్య హోమియో కళాశాలలో శుక్రవారం అల్లు  రామలింగయ్య కాంస్య విగ్రహ ఆవిష్కరణ, నూతన భవన   నిర్మాణాన్ని ఆయన ప్రారంభించారు.  అనంతరం అల్లు శతజయంతి ఉత్సవ  వేదికపై చిరంజీవి మాట్లాడారు. ‘‘నటుడిగా జన్మించింది ఈ గడ్డమీదే. ముఖానికి మేకప్‌ వేసుకొన్నది ఇక్కడే. నా మొదటి మూడు చిత్రాలు రాజమహేంద్రవరంలోనే షూటింగ్‌ జరుపుకోవడం విశేషం. ఇక్కడే అల్లు రామలింగయ్యతో పరిచయం ఏర్పడిందన్నారు. మన ఊరి పాండవులు సినిమా షూటింగ్‌ తర్వాత రైలులో తిరిగి వెళుతూ రావుగోపాల రావుతోపాటు కొందరితో రైలులో సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడే నా గుణగుణాలపై టిక్‌ మార్కు పడింది. దాంతో సురేఖ ద్వారా బంధుత్వం ఏర్పడింది. సినీరంగంలో స్థిరపడి హోమియోపై ఆసక్తితో పరీక్షలు రాసి ఆర్‌ఎంపీ ఇన్‌ హోమియోపతిగా రామలింగయ్య ధ్రువీకరణ పత్రం పొందారు. ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, సత్యనారాయణ తదితర నటులకు ఆయనే మందులు ఇచ్చేవారు. తాను రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించే సమయంలో ఎంపీ నిధుల నుంచి రూ.2 కోట్లు ఈ హోమియో భవన నిర్మాణానికి కేటాయించాను. అంతకంటే ముందు కళాశాల నిర్మాణ సమయంలో  సొంత డబ్బులు ఇచ్చాను’’ అని చిరంజీవి తెలిపారు.

పరిశ్రమకు పెద్దదిక్కు

మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్‌ మాట్లాడుతూ అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలు సినీ రంగానికి పండగ లాంటిదన్నారు. చిరంజీవి సినిమా పరిశ్రమకు పెద్దాయనగా ఉన్నారన్నారు. దాసరి నారాయణరావు, డీవీఎస్‌ రాజు వంటి వాళ్లు చనిపోయిన తర్వాత ఇప్పుడున్న జనరేషన్‌లో పరిశ్రమకు  ఎటువంటి ఇబ్బంది వచ్చినా, నిలబడి నేనున్నానని ముందుకు వస్తున్నాడన్నారు. కరోనా సమయంలో పేద కళాకారులకు ఆర్థిక సహాయంతోపాటు సినీ రంగంలో చిన్న చిన్న భేదాభిప్రాయాలను ఆయనే సరిచేస్తున్నారన్నారు. నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ మా కుటుంబం హోమియో వైద్యానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలబడతామని ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు.

- న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం


ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య జయంతి వేడుకలు శుక్రవారం హైదరాబాద్‌లో జరిగాయి. కోకాపేట్‌లోని అల్లు స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య విగ్రహాన్ని కథానాయకుడు అల్లు అర్జున్‌ తన సోదరులు అల్లు బాబీ, అల్లు శిరీష్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ యేడాది అల్లు రామలింగయ్య వందో జయంతి వేడుకల్ని రెండు చోట్ల జరపాలని నిర్ణయించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని