MAA Elections: చిత్రసీమలో ‘మా’ ఎన్నికల వేడి

'తెలుగు చిత్రసీమలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల పోరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. బరిలో నిలిచిన రెండు ప్యానెళ్లూ రాజకీయ ఎన్నికల్ని తలపించేలా పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి.

Updated : 04 Oct 2021 04:32 IST

'తెలుగు చిత్రసీమలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల పోరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. బరిలో నిలిచిన రెండు ప్యానెళ్లూ రాజకీయ ఎన్నికల్ని తలపించేలా పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. అధ్యక్షులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు  ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు ఓటర్లని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రకాశ్‌రాజ్‌ ఆదివారం హైదరాబాద్‌ ఎఫ్‌.ఎన్‌.సి.సిలో కొంతమంది ‘మా’ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించగా, మంచు విష్ణు ఇంటింటికీ వెళ్లి ఓటుని అభ్యర్థించారు. చిత్రసీమలో కొన్ని కుటుంబాలు కీలకంగా మారాయి. వారి మద్దతుని కూడగట్టుకోవడం కోసం రెండు ప్యానెళ్లూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. మంచు విష్ణు ఆదివారం నందమూరి బాలకృష్ణని కలిశారు. ‘‘బాల అన్న మద్దతు  నాకు లభించడం నా గౌరవం’’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇటీవలే  తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి సీనియర్‌ నటులు కృష్ణని కలిశారు మంచు విష్ణు. తన తనయుడి కోసం ఓటర్లకి స్వయంగా ఫోన్‌ చేసి ఓటుని అభ్యర్థిస్తున్నారు మోహన్‌బాబు. ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌ మంచు విష్ణుకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, విష్ణు ఇద్దరూ సోమవారం మేనిఫెస్టోని ప్రకటించే అవకాశం ఉంది. ఇద్దరి మేనిఫెస్టోలోనూ ‘మా’ భవన నిర్మాణమే ప్రధాన హామీ అని తెలుస్తోంది. 914 మంది మా సభ్యులు ఉండగా, గతేడాది 400 పైచిలుకు మంది సభ్యులే ఓటుకి హాజరయ్యారు. ఈసారి ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని