
MAA Elections: ‘మా’ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ వివాదం
ఆరోపణలు... ప్రత్యారోపణలతో మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల రాజకీయం మరింతగా వేడెక్కింది. ఎన్నికల నియమావళిని మంచు విష్ణు ప్యానల్ ఉల్లంఘిస్తోందంటూ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు నటుడు, ‘మా’ అధ్యక్ష అభ్యర్థి ప్రకాశ్‌రాజ్. ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతోందని, ఏజెంట్ల ద్వారా కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒక కుటుంబంలా ఉన్న ‘మా’ అసోసియేషన్‌ని ప్రకాశ్‌రాజ్ విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంచు విష్ణు ప్రత్యారోపణలు చేశారు. మేం న్యాయబద్ధంగానే ఎన్నికల్లో తలపడుతున్నామని, ప్రకాశ్‌రాజ్ పరిశ్రమలోని పెద్దలకి మర్యాద ఇచ్చి మాట్లాడాలని హితవు పలికారు. మంగళవారం పోస్టల్ బ్యాలెట్ విషయంపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన అనంతరం ప్రకాశ్‌రాజ్ తన ప్యానెల్ సభ్యులతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. అనంతరం మంచు విష్ణు విలేకర్ల సమావేశం నిర్వహించారు.
ఇలా గెలుస్తారా మామీద?: ప్రకాశ్‌రాజ్
‘‘కరోనా కారణంగా 60 ఏళ్లు పైబడిన సభ్యుల కోసం పోస్టల్ బ్యాలెట్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఎన్నికల అధికారులు. రూ.500 రుసుము చెల్లించి లేఖ ద్వారానో, లేదంటే తమ సహాయకుల ద్వారానో ఓటు అడిగితే దాన్ని పరిశీలించి పోస్టల్ బ్యాలెట్‌ని వారి చిరునామాకి పంపిస్తారు ఎన్నికల అధికారులు. దానికంటూ స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. కానీ విష్ణు, మోహన్‌బాబు ప్యానెల్ తరఫున ఏజెంట్లు సభ్యుల దగ్గరికి వెళ్లి సంతకాలు సేకరించి, వాళ్లే స్వయంగా ఓటర్ల తరఫున డబ్బులు కడుతున్నారు. 60 పోస్టల్ బ్యాలెట్ అభ్యర్థనలు వస్తే, అందులో ఒక ఆగంతకుడు వచ్చి 56 మంది సభ్యుల తరఫున రూ. 28 వేలు కట్టారు. అతనెవరని ఆరా తీస్తే మోహన్‌బాబు కంపెనీలో మేనేజర్ అని తెలిసింది. సభ్యులు వ్యక్తిగతంగా అడగాల్సిన ఓటుని మరెవరో వచ్చి అడగడం ఏమిటి? వాళ్లు అందరి తరఫున డబ్బు కడితే ఎన్నికల అధికారులు ఎలా తీసుకున్నారు? ఇదే విషయాన్ని అధికారిని నేనడిగాక కొద్దిసేపటికి మరో వ్యక్తి వచ్చి ఆ డబ్బుని వెనక్కి తీసుకెళ్లారు. ఇలా అసహ్యంగా జరుపుతామా ఎన్నికలు? ఆవేదనతో క్రమశిక్షణ సంఘం కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజుని అడుగుతున్నా. ఆయన డబ్బు కూడా కట్టారు ఇక్కడ. ఘట్టమనేని కృష్ణ, విశాఖలో ఉన్నవాళ్లు, పరుచూరి బ్రదర్స్ తరఫున డబ్బు కట్టారు? చెన్నైలో లక్ష్మి, శారద, శరత్‌బాబు డబ్బు కట్టారు. ఆయా సభ్యులు లేఖలు రాసినప్పుడు అందులో ఇలా ఒకరొచ్చి డబ్బు కడతారని అందులో పేర్కొన్నారా? ఇలా గెలుస్తారా మా మీద? ఇంత దిగుజారుతారా? అని అడుగుతున్నా. సినీ పెద్దలు చిరంజీవి, మురళీమోహన్, నాగార్జున సమాధానం చెప్పాలి. సంక్షేమ సంఘం ఇది. 60 ఏళ్లు దాటినవాళ్లని ఆదుకోవాలని, వాళ్లకి కావల్సిన ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో వస్తున్నాం. వాళ్లని ఇలా వాడుకుంటారా?’’ అని ప్రశ్నించారు. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న నటి జీవిత మాట్లాడుతూ ‘‘మేం గెలుస్తాం మాదే గెలుపు అని అంత బలంగా ఎందుకు చెబుతున్నారనే సందేహం ఉండేది. ఇప్పుడు స్పష్టత వచ్చింది. ప్రతి సభ్యుడికీ చెప్పేదొక్కటే. ఈ ఓటు మన హక్కు. మన భవిష్యత్తు ఈ ఓటు మీదే ఆధారపడి ఉంది. ఫోన్ చేశారు, మాటిచ్చాం కదా అనుకోకుండా ఆలోచించి ఓటు వేయండి. సరైనవాళ్లు గెలిచేందుకు సహకారం అందించండి’’ అని కోరారు.
పెద్దల్ని అవమానిస్తారా?: మంచు విష్ణు
‘‘ఒక కుటుంబంలో జరిగే ఎన్నికల్లో ప్రతి విషయాన్నీ తీసుకొచ్చి ప్రకాశ్‌రాజ్ మీడియా ముందు పెడుతున్నారు. ప్రతి విషయానికీ తీవ్రంగా స్పందిస్తున్నారు. నిజ జీవితంలోనూ ఆయన బాగా నటిస్తున్నారు. ఆయనకి పగ ద్వేషాలు ఎందుకో నాకు తెలియడం లేదు. 60 ఏళ్లు పైబడిన వాళ్లకి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పిస్తున్నామని ఎన్నికల సంఘమే తెలిపింది. ఆ వయసువారు ‘మా’లో 160 మంది సభ్యులు తేలారు. వీళ్లందరికీ నేను వ్యక్తిగతంగా ఫోన్ చేసి మాట్లాడా. లేఖ ఎలా పంపాలో వాళ్లకి తెలియకపోతే ఓ ఫార్మాట్ పంపా. అది చూసి వాళ్లే ఓటుని కోరుతూ పంపారు. అందులో చాలామంది నాకు ఫోన్ చేసి సమయం లేదు కాబట్టి మీరే రూ.500 కట్టమని కోరారు. ఎన్నికల సంఘం సలహాతో న్యాయబద్ధంగానే కట్టాం. ఆ తర్వాత కొన్ని గంటలకి ఎన్నికల సంఘం నుంచి ఫోన్ వచ్చింది. పోస్టల్ బ్యాలెట్‌కి డబ్బు చెల్లించేందుకు సభ్యులకి సమయం ఇస్తాం, మీరు డబ్బులు వాపస్ తీసుకెళ్లండని చెప్పారు. వాళ్లు చెప్పినట్టుగానే డబ్బు తీసుకెళ్లాం. ఎవరికీ తెలియకుండా భయపెట్టి ఓట్లు పొందాలని చూస్తే మమ్మల్ని ప్రశ్నించవచ్చు. నోరు ఉంది కదా? అని పెద్దా చిన్నా తేడా లేకుండా మాట్లాడకూడదు. ఈ విషయంలో పెద్ద నటులు కృష్ణంరాజు, కృష్ణలని అవమానిస్తారా? ప్రకాశ్‌రాజ్ ఎలాగైనా చేసి ఎన్నికలు ఆపేయాలనుకుంటున్నారు. ప్రతి విషయంలోనూ మా కుటుంబం పేరెత్తడం భావ్యం కాదు. మేం ఎవరినీ విమర్శించడం లేదు. మా అసోసియేషన్ ఓ కుటుంబం. దయచేసి విడగొట్టకండి’’ అన్నారు.
బ్యాలెట్ పద్ధతిలోనే ‘మా’ ఎన్నికలు: కృష్ణమోహన్
పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ‘మా’ ఎన్నికల్లో పోలింగ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు ఎన్నికల అధికారి కృష్ణమోహన్. బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరపాలని అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న మంచు విష్ణు ఎన్నికల అధికారులకి లేఖ రాశారు. మరో ప్యానెల్ నుంచి అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్ ఈవీఎంల ద్వారానే పోలింగ్ జరపాలని కోరారు. ఈ ఇద్దరి అభ్యర్థనల్ని క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజు దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. ఆయన పోస్టల్ బ్యాలెట్‌కే మొగ్గు చూపడంతో, అదే పద్ధతిలో ఎన్నికలు జరపాలని నిర్ణయించారు. స్థానిక ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే జరపాలని సుప్రీంకోర్టు 2019లో ఇచ్చిన ఉత్తర్వుల్ని కూడా పరిగణనలోకి తీసుకున్నామని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్‌ల వివాదంపై ఆయన స్పందిస్తూ... 60 మంది సభ్యులు పోస్టల్ బ్యాలెట్ కావాలని అడిగారనీ, వారందరికీ బ్యాలెట్ పేపర్లు పంపిస్తామన్నారు. డబ్బు ఒక్కరే చెల్లించడం నిబంధనలకి విరుద్ధం కావడంతో, వెనక్కి తిరిగిచ్చేశామనీ పోస్టల్ బ్యాలెట్ రద్దు చేసే అవసరం లేదన్నారు. ఓటింగ్ విషయంలో అక్రమాలు జరిగితే ఎన్నికల తర్వాత ఫిర్యాదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ నెల 10న ‘మా’ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.