Maha Samudram: ఇక తెలుగు ప్రేక్షకుల్ని వదిలివెళ్లను

‘‘రెండు చిత్రాలు ఒకేసారి రావడమంటే.. ఇద్దరు ఒకేసారి గుడిలోకి వెళ్లడం లాంటిది. అయితే దేవుడు ఎవరికి వరమిస్తాడనేది మనం చెప్పలేం’’ అన్నారు సిద్ధార్థ్‌. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’,

Updated : 09 Oct 2021 04:42 IST

‘‘రెండు చిత్రాలు ఒకేసారి రావడమంటే.. ఇద్దరు ఒకేసారి గుడిలోకి వెళ్లడం లాంటిది. అయితే దేవుడు ఎవరికి వరమిస్తాడనేది మనం చెప్పలేం’’ అన్నారు సిద్ధార్థ్‌. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ లాంటి విజయవంతమైన చిత్రాలతో లవర్‌బాయ్‌గా పేరు తెచ్చుకున్న హీరో ఆయన. కొన్నాళ్ల విరామం తర్వాత ఆయన తెలుగులో నటించిన కొత్త చిత్రం ‘మహా సముద్రం’. అజయ్‌ భూపతి దర్శకుడు. శర్వానంద్‌ మరో కథానాయకుడు. ఈ సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు సిద్ధార్థ్‌. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

‘‘ఓ అదిరిపోయే కథతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తానని నాలుగేళ్ల క్రితమే ట్విటర్‌ వేదికగా తెలియజేశా. అప్పటి నుంచి అలాంటి కథ కోసం ఎదురు చూస్తూనే ఉన్నా. ఆ సమయంలోనే దర్శకుడు అజయ్‌ భూపతి నాకోసం ఈ కథ తీసుకొచ్చారు. ఇది చాలా పెద్ద స్కేల్‌ ఉన్న కథ. వైజాగ్‌ నేపథ్యంలో ఉంటుంది. రెండు పీరియడ్స్‌లో సాగుతుంటుంది. అయితే ఇది సినిమాలోని పాత్రలకు తెలియదు. చూసే ప్రేక్షకులకే తెలుస్తుంది. ఈ కథ వింటున్నంత సేపూ నాకు అజయ్‌ రెండో సినిమా దర్శకుడిలా కనిపించలేదు. గొప్ప అనుభవమున్న డైరెక్టర్‌లా కనిపించాడు. అందుకే కథ వినగానే వెంటనే ఓకే చెప్పాను. నాకిప్పటి వరకు తెలుగు ప్రేక్షకుల్లో చాక్లెట్‌ బాయ్‌, లవర్‌ బాయ్‌ అనే ఇమేజ్‌ ఉంది. కానీ, ఈ సినిమాతో మరో కొత్త రకమైన ఇమేజ్‌ వస్తుంది. ఇది నాకు బెస్ట్‌ కమ్‌ బ్యాక్‌ సినిమా అవుతుంది’’.

అందుకే ఆలస్యం..

‘‘ఈ కథకు రెండో హీరోని వెతికి పట్టుకోవడానికే చాలా టైమ్‌ పట్టింది. నేను, శర్వా ప్రాజెక్ట్‌లోకి వచ్చి చిత్రీకరణ ప్రారంభిద్దామనుకునే సరికి కొవిడ్‌ వచ్చింది. ఆ తర్వాత కరోనా పరిస్థితుల వల్ల చిత్రీకరణ చాలాసార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. కొంత మంది దర్శకులు ఫ్యాన్స్‌ కోసమే సినిమాలు తీస్తారు. ఇంకొందరు మాస్‌ సినిమాలు చేసి ఓ అభిమాన గణాన్ని సృష్టించుకుంటారు. ‘మహాసముద్రం’ ఈ రెండో కోవకు చెందే సినిమా. కచ్చితంగా ఇది ట్రెండ్‌ సెట్టర్‌ చిత్రమవుతుంది’’.

మా ఇద్దరి కెమిస్ట్రీనే హైలైట్‌..

‘‘నేనిందులో మంచి వాడిగా కనిపిస్తానా? లేక చెడ్డ వాడిగా కనిపిస్తానా? అన్నది తెరపైనే చూడాలి. నా దృష్టిలో ఓ వ్యక్తి మంచివాడా.. చెడ్డవాడా? అన్నది వాళ్లు తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. నేను సినిమా చూశాను. ‘శర్వా నువ్వు మంచోడివా?’ అని అడిగా. ఏమో నాకు తెలియడం లేదన్నాడు. ‘మరి నువ్వు మంచోడివా?’ అని నన్నడిగాడు. నాకు ఏమీ అర్థం కాలేదన్నా. ఒకటి కచ్చితంగా చెప్పగలం.. ఇందులో అద్భుతమైన ప్రేమకథ ఉంది. అజయ్‌ నాయికల పాత్రల్ని గొప్పగా రాసుకున్నారు. సినిమాలో హీరోయిన్లతో మా కెమిస్ట్రీ ఎలా ఉంటుందో తెలియదు కానీ, శర్వాకు నాకు మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది’’.

నన్ను నేను వెతుక్కున్నా..

‘‘2003లో ‘బాయ్స్‌’ వచ్చినప్పుడు ఎలా ఉన్నానో.. ఇప్పటికీ అలాగే ఉన్నా. ఈ మధ్యలో వచ్చింది బ్రేక్‌ కాదు.. నాలో నన్ను వెతుక్కునే క్రమంలో వచ్చిన విరామమది. ఈ గ్యాప్‌ వల్ల నాకు మరింత పరిణతి వచ్చిందని అనుకుంటున్నా. నన్ను స్టార్‌ను చేసింది తెలుగు వాళ్లే. నేనెప్పుడూ తెలుగు స్టార్‌ని.. భారతీయ నటుడ్ని అని చెప్పుకోవడానికే ఇష్టపడతా. ఇకపై తెలుగు ప్రేక్షకుల్ని వదిలిపెట్టి వెళ్లను’’.


రాజకీయాల్లోకి రానని చెప్పను.. కానీ!

‘‘ఎప్పుడూ నిజం మాట్లాడాలి, నిజాయితీగా ఉండాలి అనుకుంటాను. దాని వల్ల ఎలాంటి పరిణామాలొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటా. అందుకే నేనెప్పుడూ ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడుతుంటాను. పక్కోళ్లకు పేరొస్తుందా? రాదా? అని నేనెప్పుడూ ఆలోచించను. అందరికీ పేరు రావాలి.. అందరూ బాగుండాలనే కోరుకుంటా. రాజకీయాల్లోకి రాననని చెప్పను కానీ.. వచ్చే అవకాశాలు తక్కువ. భవిష్యత్తులో కచ్చితంగా దర్శకత్వం చేస్తా. దానికోసం కథలు రాసుకుంటున్నా. సొంతంగా నిర్మాణ సంస్థ పెట్టా. తెలుగులోనూ కొంత మంది యువ దర్శకులతో  సినిమాలు నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నా. అలాగే హీరోగా తెలుగులోనే నేరుగా రెండు ప్రాజెక్ట్‌లున్నాయి. త్వరలో ఆ వివరాలు చెబుతా’’.


‘‘నేను మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా)లో లైఫ్‌ టైమ్‌ మెంబర్‌ని. ఈ ‘మా’ ఎన్నికల్లో కచ్చితంగా ఓటు వేస్తున్నాను. ప్రస్తుతం ఇందులో జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనిస్తూనే ఉన్నాను. నేను ‘మా’లో గానీ.. రాజకీయాల్లో కానీ.. ఏ ఒక్కరినీ వదలను. అందరినీ తిడతాను. ఓటు వేసే ప్రతి ఒక్కరికీ ఆ హక్కు ఉంటుంది. నేను కచ్చితంగా అందరి మాట విని..నా మనసులో ఎవరినిపిస్తారో.. వారికే ఓటు వేస్తాను’’.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు