MAA Elections: నేడే ‘మా’ ఎన్నికలు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు ఈరోజు హైదరాబాద్‌లో జరగనున్నాయి. అందుకోసం జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనాని దృష్టిలో ఉంచుకుని సభ్యులు సామాజిక దూరం పాటిస్తూ

Updated : 10 Oct 2021 04:32 IST

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు ఈరోజు హైదరాబాద్‌లో జరగనున్నాయి. అందుకోసం జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనాని దృష్టిలో ఉంచుకుని సభ్యులు సామాజిక దూరం పాటిస్తూ ఓటింగ్‌లో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు ఎన్నికలు జరగనున్నాయి. 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఫలితాల్ని కూడా ఈ రోజే ప్రకటించాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు. మొదట సోమవారం ప్రకటించాలనుకున్నా, ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈరోజు రాత్రి 8 గంటలలోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు పోటీకి దిగిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ లేని రీతిలో ఈసారి ‘మా’ ఎన్నికల ప్రచారం సాగింది. రెండు ప్యానెళ్ల సభ్యులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. 900మందికి పైచిలుకు సభ్యులున్న ఈ అసోసియేషన్‌ ఎన్నికలు ఈసారి సాధారణ ఎన్నికల సమరాన్ని తలపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాయి. మరి ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మంచు విష్ణు కోసం ఆయన తండ్రి, ప్రముఖ నటుడు మోహన్‌బాబు పరిశ్రమ పెద్దలందరినీ కలిసి మద్దతుని కూడగట్టే ప్రయత్నం చేశారు. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌కి చిరంజీవి కుటుంబం మద్దతుగా నిలుస్తోంది. ఆ మేరకు ఆ కుటుంబం నుంచి నాగబాబు ముందుకొచ్చి మద్దతుని ప్రకటించారు. ఈసారి ఎన్నికల్లో ‘మా’ భవన నిర్మాణం, సభ్యుల సంక్షేమ పథకాలు ప్రధాన హామీలుగా మారాయి.


అంతదూరం లాగకండి: విష్ణు

‘‘తెలుగులో పరీక్ష రాస్తే...నాతో పోటీ పడుతున్న మేధావి కంటే నాకు తక్కువ మార్కులే రావొచ్చు. కానీ వ్యక్తిగతంగా గుణం విషయంలో మార్కులు వేయాల్సి వస్తే ఎవరికి ఎక్కువ వస్తాయో పరిశ్రమలో అడగండి. ఆయనకి ఎన్ని మార్కులు వస్తాయో ఆయన పనిచేసిన అన్ని పరిశ్రమలవాళ్లనీ అడగండి’’ అన్నారు కథానాయకుడు మంచు విష్ణు. నటుడు నాగబాబు ఇటీవల తనపై చేసిన విమర్శలకు స్పందిస్తూ శనివారం ఓ వీడియోని విడుదల చేశారు విష్ణు. నేను ఏం చేశానని మీకంత కోపం అంటూ నాగబాబుని ప్రశ్నించారు. ఆయన్ని ఉద్దేశిస్తూనే ‘‘నాకు ప్రత్యర్థిగా నిలబడిన వ్యక్తి పవన్‌కల్యాణ్‌ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆయన్ను తిడుతూ సామాజిక మాధ్యమాల్లో మీరే వ్యాఖ్యలు చేశారు. ఈరోజు అలాంటి వ్యక్తి మీకు మేధావి అయిపోయి, నన్ను చిన్నచూపు చూస్తారా? వ్యక్తిగతంగా విమర్శించడం మంచిది కాదు. నేను పుట్టిన తర్వాత మా నాన్న ఇంత సహనంతో ఉండటం ఇప్పటివరకూ చూడలేదు. ఆయన్ను బయటకు లాగాలని చూస్తున్నారు. ఆయన ఒక్కసారి బయటికి వచ్చి మాట్లాడితే బంధాలన్నీ తెగిపోతాయి. అంత దూరం లాగకండి. ఓడిపోతున్నారనే అక్కసుతోనే విమర్శలు చేస్తున్నారు. మనమంతా ఒక కుటుంబం అన్న సంగతి మరిచిపోతున్నారు. అక్కడ అధ్యక్ష అభ్యర్థిగా నిలబడిన వ్యక్తి స్వార్థంతో పోటీ చేస్తున్నార’’న్నారు మంచు విష్ణు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని