Pelli SandaD: ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి

‘‘హీరోల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. అలా ఉంటే ఈ పరిశ్రమలో ఎలాంటి వివాదాలు ఉండవు. తాత్కాలికమైన పదవుల కోసం మాటలు అనడం.. అనిపించుకోవడం వల్ల బయట వాళ్లకి లోకువైపోతామ’’న్నారు...

Updated : 11 Oct 2021 04:56 IST

‘‘హీరోల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. అలా ఉంటే ఈ పరిశ్రమలో ఎలాంటి వివాదాలు ఉండవు. తాత్కాలికమైన పదవుల కోసం మాటలు అనడం.. అనిపించుకోవడం వల్ల బయట వాళ్లకి లోకువైపోతామ’’న్నారు కథానాయకుడు చిరంజీవి. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘పెళ్లి సందడి’ విడుదల ముందస్తు వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రోషన్‌, శ్రీలీల జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రమిది. గౌరీ రోణంకి తెరకెక్కించారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈనెల 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ వేడుకకు చిరంజీవి, వెంకటేష్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘బెజవాడలో ‘పెళ్లి సందడి’ 175రోజుల వేడుకకు నేనే ముఖ్య అతిథిగా హాజరయ్యా. మళ్లీ పాతికేళ్ల తర్వాత ఇప్పుడీ ‘పెళ్లి సందడి’ వేడుకకి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం ఆనందంగా ఉంది. వెంకటేష్‌ నా చిరకాల మిత్రుడు. తన సినిమా బాగుంటే నేను.. నా చిత్రం నచ్చితే తను ఒకరినొకరం అభినందించుకుంటాం. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం అందరి హీరోల మధ్య ఉండాలి. మన ఆధిపత్యం చూపించుకోవడానికి అవతలి వాళ్లను కించపరచాల్సిన అవసరం లేదు.  అసలు వివాదానికి మూలం ఎవరో గుర్తించి.. అలాంటి వ్యక్తుల్ని దూరం పెట్టగలిగితే మనదే వసుధైక కుటుంబం’’ అన్నారు. వెంకటేష్‌ మాట్లాడుతూ.. ‘‘రాఘవేంద్రరావు లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. చాలా ఎనర్జీ ఉన్న వ్యక్తి ఆయన. ‘పెళ్లి సందడి’ బృందానికి నా శుభాకాంక్షలు’’ అన్నారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం మా అన్నయ్య కృష్ణమోహన్‌ కోసం చేశా. అనుకోకుండా ఆయన ఈ చిత్రం చూడకుండానే కాలం చేశారు. ఈ చిత్రంలో నేనూ ఓ చిన్న పాత్ర చేశా’’ అన్నారు. హీరో రోషన్‌ మాట్లాడుతూ.. ‘‘నాన్న సినిమాల్లో పెద్ద హిట్‌ ‘పెళ్లి సందడి’. ఆయన టైటిల్‌తో హీరోగా నా తొలి చిత్రం రావడం సంతోషంగా ఉంద’’న్నారు. కార్యక్రమంలో అల్లు అరవింద్‌, అశ్విని దత్‌, శ్రీకాంత్‌, గౌరీ రోణంకి, శ్రీలీల, కీరవాణి, చంద్రబోస్‌, దీప్తి భట్నాగర్‌, రవళి, బి.గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని