Aditi Rao Hydari: నటిగా నేనెప్పుడూ నిత్య విద్యార్థినే!

‘‘జీవిత కథల్లో నటించాలన్న ఆసక్తి నాకూ ఉంది. డ్యాన్సర్‌, సింగర్‌, యాక్టర్‌, స్పోర్ట్స్‌ పర్సన్‌.. ఇలా ఎవరి బయోపిక్‌ అయినా నేను చేయగలను. వ్యక్తి గతంగా నాకు సంగీతమంటే చాలా ఇష్టం. అవకాశమొస్తే.. ప్రముఖ గాయని ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి

Published : 12 Oct 2021 14:37 IST

‘‘జీవిత కథల్లో నటించాలన్న ఆసక్తి నాకూ ఉంది. డ్యాన్సర్‌, సింగర్‌, యాక్టర్‌, స్పోర్ట్స్‌ పర్సన్‌.. ఇలా ఎవరి బయోపిక్‌ అయినా నేను చేయగలను. వ్యక్తి గతంగా నాకు సంగీతమంటే చాలా ఇష్టం. అవకాశమొస్తే.. ప్రముఖ గాయని ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి బయోపిక్‌లో నటించాలనుంది. నటీమణుల్లో ఎవరైనా జీవిత కథలో నటించాల్సి వస్తే.. నటి రేఖ బయోపిక్‌ను ఎంపిక చేసుకుంటా. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. ఆమెని రేఖమ్మ అని ప్రేమగా పిలుస్తాను’’.


‘‘సవాళ్లతో నిండిన పాత్రలంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అలాంటి పాత్రలు దొరికినప్పుడు.. ప్రతిరోజూ సెట్లో ఓ చిన్నపిల్లాడిలా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోగలుగుతాం’’ అంటోంది అదితి రావు హైదరి. అందం.. అభినయం.. సమపాళ్లలో నిండిన తెలుగు సోయగం ఆమె. ఇటు దక్షిణాదిలోనూ.. అటు ఉత్తరాదిలోనూ వరుస చిత్రాలతో జోరు చూపిస్తోంది. ఇప్పుడామె కథానాయికగా అజయ్‌ భూపతి తెరకెక్కించిన చిత్రం ‘మహా సముద్రం’. శర్వానంద్‌, సిద్ధార్థ్‌ కథానాయకులు. అను ఇమ్మాన్యుయేల్‌ మరో నాయికగా నటించింది. ఈ సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది అదితి రావు హైదరి. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...

‘‘దర్శకుడు అజయ్‌ భూపతి రెండేళ్ల క్రితం నాకీ కథ వినిపించారు. ఈ స్క్రిప్ట్‌ వింటున్నప్పుడే అందులోని పాత్రలు.. వాటి తాలూకూ ఎమోషన్స్‌ నా మనసుని హత్తుకున్నాయి. అందుకే కథ వినగానే నేను చేస్తానని చెప్పా. అయితే మిగిలిన తారాగణం ఎంపిక ఆలస్యం కావడం వల్ల చిత్రం ఆలస్యమైంది. అయితే ప్రతీ రెండు నెలలకు ఓసారి అజయ్‌ నాకు ఫోన్‌ చేసి మాట్లాడేవారు. ఈ కథ కచ్చితంగా మీతోనే చేయాలి.. ఎప్పుడంటే అప్పుడు డేట్స్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉండండని చెబుతుండేవారు’’.


‘‘నేను ప్రస్తుతం దుల్కర్‌ సల్మాన్‌ - బృందా మాస్టర్‌తో ఓ చిత్రం చేస్తున్నా. హిందీలో ఓ సినిమా ఉంది. మలయాళంలో ఓ ప్రాజెక్ట్‌ చర్చల దశలో ఉంది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్‌లు ఉన్నాయి’’.


కథే హీరో..

‘‘ఈ చిత్రంలో నేను మహా అనే యువతిగా నటించా. ఆ పాత్ర చుట్టూ తిరిగే కథతోనే ఈ సినిమా రూపొందింది. అలాగని ఇదేమీ నాయికా ప్రాధాన్య చిత్రం కాదు. సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యముంది. ఇందులో స్నేహం గురించి ఉంది. గాఢమైన ప్రేమకథ ఉంది. మొత్తంగా ఓ బలమైన కథతో అజయ్‌ ఈ సినిమా సిద్ధం చేశారు. నా దృష్టిలో ఆ కథే ఈ చిత్రానికి అసలైన హీరో. ఇక నా పాత్ర విషయానికొస్తే.. మహా చాలా స్వీట్‌. తల్లిదండ్రులంటే ప్రేమ. వాళ్లని జాగ్రత్తగా చూసుకుంటుంది. కష్టపడి తన కుటుంబాన్ని తనే పోషించుకుంటుంది. నిజం నిర్భయంగా చెప్పే    గుణమున్న యువతి తను. కచ్చితంగా సినిమా చూశాక ప్రతి ఒక్కరూ మహా పాత్రని తమ మదిలోదాచుకుని ఇంటికి తీసుకెళ్తారు’’.

చెప్పుల్లేకుండా.. ఎండలో డ్యాన్స్‌

‘‘శర్వానంద్‌, సిద్ధార్థ్‌ సెట్లో ఎప్పుడూ హీరోల్లా ప్రవర్తించలేదు. నేను మహాలా.. వాళ్లిద్దరూ విజయ్‌, అర్జున్‌ లాగే సెట్‌పై సరదాగా ఉండేవాళ్లం. అజయ్‌ మా పాత్రల్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుకున్నారు. మహా ఎలా నవ్వాలి.. ఎలా ఏడ్వాలి.. ఆమె నడత ఎలా ఉండాలి? ఇలా ప్రతిదీ ఎంతో స్పష్టంగా చెప్పేవారు. విశాఖపట్టణం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఈ సినిమా కోసం చెప్పుల్లేకుండా ఎండలో బీచ్‌లో రాళ్లపై డ్యాన్స్‌ చేశా. అది నాకెంతో సవాల్‌గా అనిపించింది. ఈ సినిమాలో నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకోవాలని అనుకున్నా. కానీ, వైజాగ్‌ యాసలో డబ్బింగ్‌ చెప్పుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని నేను చెప్పలేదు’’.

అలా అనేసరికి కన్నీళ్లు ఆగలేదు..

‘‘నేను పుట్టింది హైదరాబాద్‌లోనే అయినా..  పెరిగిందంతా ఉత్తరాదిలోనే. అందుకే నాకు తెలుగు అంతగా రాదు. డైలాగ్స్‌ ఇస్తే.. అలా బట్టీపట్టి ఇలా చెప్పేస్తాను. అందుకే నేనెప్పుడూ నా డైలాగ్స్‌ ముందే ఇవ్వమని అడుగుతాను. రాత్రంతా వాటిని ప్రాక్టీస్‌ చేసుకుని.. ఉదయం సెట్లో నా వాయిస్‌లోనే  చెబుతాను. ఇలా చేయడం వల్ల సెట్లో నా వల్ల ఎవరి సమయం వృథా కాదు. అందుకే మొదటి నుంచి ఇదే పద్ధతి అనుసరిస్తున్నా. అయితే ‘మహా సముద్రం’ షూటింగ్‌ సమయంలో అజయ్‌ సర్‌ నాకు తెలియకుండా ముందు రోజు నాకు ఇచ్చిన డైలాగ్స్‌లో కొన్ని మార్పులు చేశారు. నేనవి ప్రాక్టిస్‌ చేసుకునే లోపే నన్ను షూట్‌కి పిలిచేశారు. డైరెక్టర్‌ రెడీ అన్నాక.. నేను ఒక్క క్షణం కూడా వృథా చేయడానికి ఇష్టపడను. కానీ, ఆరోజు అలా అనేసరికి నాకు కన్నీళ్లు ఆగలేదు. వెంటనే అజయ్‌ సర్‌ వచ్చి.. పది నిమిషాలు తీసుకోండి పర్లేదన్నారు. నేను రెండు నిమిషాలు చాలని చెప్పి.. మళ్లీ వచ్చి ఆ డైలాగ్స్‌ చెప్పాను. ఆ తర్వాత అజయ్‌ దగ్గరకొచ్చి ‘మీరు ఏడుస్తుంటే ఎంత క్యూట్‌గా ఉన్నారు అదితిజీ’ అన్నారు. దాంతో సెట్లో అందరూ నవ్వేశారు..

ప్రతి బంధం.. ఆ ప్రేమతోనే

‘‘నాకు ప్రేమ కథలంటే చాలా ఇష్టం. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైనది ప్రేమే. తల్లి బిడ్డల మధ్య బంధమైనా.. అమ్మాయి అబ్బాయిల మధ్య ఉండే బంధమైనా.. ప్రతిదీ ఆ ప్రేమతోనే ముడిపడి ఉంటుంది. కొలవలేనంత ప్రేమ అనేదాన్ని నేనూ నమ్ముతాను. ప్రతి బంధంలోనూ అలాంటి కొలవలేనంత ప్రేమ దాగి ఉంటుందని విశ్వసిస్తా. నన్నెవరైనా స్టార్‌ అంటే సంతోషమే. కానీ, నన్ను నేను స్టార్‌లా అసలు ఊహించుకోను. నటిగా నేనెప్పుడూ ఓ నిత్య విద్యార్థిననే అనుకుంటా. సెట్లోకి అడుగుపెట్టానంటే దర్శకుడే నా గురువు. వాళ్లు చెప్పిందే చేస్తాను’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని