Updated : 30 Oct 2021 06:42 IST

Puneeth Rajkumar: సేవలతో... పునీతం.. మృత్యువుతో... విషాదం

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ హఠాన్మరణంతో సినీలోకం దిగ్భ్రాంతి

ఆయన నటనకు చందనసీమ పులకించేది... ఆయన సేవలతో కన్నడ ప్రాంతం ‘పునీత’మయ్యేది...ఆయన వ్యక్తిత్వానికి సమాజం పరవశించేది. ప్రాంతాలు, భాషలతో సంబంధం లేకుండా... ఎంతో మంది స్నేహితులను, అభిమానులను సంపాదించు   కున్న కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ హఠాన్మరణం... సినీలోకాన్ని కన్నీట ముంచింది. లక్షలాది అభిమానులను విషాదంలోకి నెట్టింది.

న్నడ కంఠీరవ, తండ్రి రాజ్‌కుమార్‌ వారసత్వంతో ఆరు నెలల వయసులోనే వెండి తెరకు పరిచయమైన పునీత్‌ రాజ్‌కుమార్‌ అనతి కాలంలోనే మంచి నటుడిగా ఎదిగారు. వరుస విజయాలతో కన్నడనాట పవర్‌స్టార్‌గా ప్రేక్షకుల గుండెల్లో నిలిచారు. ఆ గుండెలన్నింటినీ ముక్కలు చేసేలా... ఆయన శుక్రవారం అభిమానులందరినీ శాశ్వతంగా వదిలిపెట్టి   వెళ్లిపోయారు. గురువారం ఆయనకు కొంత నలతగా అనిపించింది. శుక్రవారం ఉదయం వ్యాయామం అనంతరం తన తండ్రి సొంత గ్రామమైన చామరాజనగర జిల్లాలోని గాజనూరు వెళ్లాలని సన్నిహితులకు చెప్పారు. గాజనూరులో సోమవారం వరకు విశ్రాంతి  తీసుకుని తిరిగిరావాలని అనుకున్నారు. తానొకటి తలిస్తే.. విధి మరోలా చేసింది.  వ్యాయామం చేసే సమయంలో ఛాతీలో నొప్పి వచ్చింది. అది మృత్యువుగా మారి తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది.

ప్రేమించి...

1999లో ఆయనకు ఓ స్నేహితుడి ద్వారా బెంగళూరు నగరానికి చెందిన అశ్విని అనే యువతితో పరిచయం అయింది. పరిచయం ప్రేమగా మారింది. ఈవిషయాన్ని తండ్రి రాజ్‌కుమార్‌కు వివరించగా వారు పునీత్‌ ప్రేమను గుర్తించి ఇద్దరికీ వివాహం జరిపించారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ దంపతులకు ధ్రితి, వందితా కుమార్తెలు.

నిర్మాణ సంస్థ పెట్టి...

వివాహానంతరం సొంత నిర్మాణ సంస్థ పి.ఆర్‌.కె. (పునీత్‌రాజ్‌కుమార్‌)ను నెలకొల్పారు. ఈ సంస్థ ద్వారా 2019లో ‘కవలుదారి’ అనే సినిమాను నిర్మించారు. తరువాతి సినిమాగా ‘మాయాబజార్‌’ను తీశారు. ఆ తరువాత ‘లా’, ‘ఫ్రెంచ్‌ బిర్యానీ’ రూపొందాయి. పీఆర్‌కే పతాకంపై ‘ఫ్యామిలీ ప్యాక్‌’, ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’, ‘ఓ2’ సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌ అనేక సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరించారు. కర్ణాటక పాల సమాఖ్యకు చెందిన నందిని పాలు, మణప్పురం, పెప్సీ, ఎల్‌ఈడీ బల్బులు, రాయల్‌ ఛాలెంజర్స్‌ క్రికెట్‌ జట్టుకు, పోతి సిల్క్స్‌, జియాక్‌్్స మొబైల్‌, ఫ్లిప్‌కార్ట్‌, తదితర సంస్థలకు ప్రచారకర్త బాధ్యతల్ని నిర్వర్తించారు.

కసరత్తులే...

శరీర సౌష్ఠవం కోసం కఠిన వ్యాయామం  చేయడమే పునీత్‌కు కంటకంగా మారిందా? అంటే.. అవుననే సమాధానం వినవస్తోంది. పునీత్‌ రాజ్‌కుమార్‌ కఠిన వ్యాయామాలు చేసేవారు.నివాసంలోనే ఓ వ్యాయామశాలను ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఆధునిక వ్యాయామ సామగ్రిని     అమర్చారు. నిత్యం ఒకటి రెండు గంటల పాటు అక్కడే గడిపేవారు. కరోనా కఠిన ఆంక్షలు కొనసాగే సమయంలో ఆయన వ్యాయామం గురించిన అనేక వీడియోల్ని రూపొందించి యూట్యూబ్‌లో పెట్టేవారు. అదే విధంగా సైక్లింగ్‌ అంటే పునీత్‌ అమితంగా ఇష్టపడేవారు. స్నేహితులతో కలిసి బెంగళూరు నుంచి నంది హిల్స్‌కు సైక్లింగ్‌ చేశారు. సైకిల్‌పై సుదూర ప్రాంతాలను చుట్టొచ్చేవారు.


ఎన్టీఆర్‌తో సాన్నిహిత్యం

ప్రముఖ తెలుగు నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌తో పునీత్‌ రాజ్‌కుమార్‌కు అపూర్వ స్నేహం కొనసాగింది. ఈ నేపథ్యంలోనే పునీత్‌ నటించిన ‘చక్రవ్యూహ’ సినిమా కోసం ఎన్టీఆర్‌ ‘గెళయా గెళయా గెలువే నమదయ్యా..’ అంటూ గానం చేశారు. బాలనటుడుగా 20కి పైగా సినిమాల్లో నటించిన పునీత్‌రాజ్‌కుమార్‌ కథా  నాయకుడుగా 26 సినిమాల్లో నటించారు. పునీత్‌ నటించిన దాదాపు అన్ని సినిమాలకూ కథానాయకుడి పేరు ప్రధానంగా ఉండడం గమనార్హం. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘అప్పు’ సినిమాతో ఆరంభమైన అభినయం కన్నడ చిత్రసీమలో పవర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చింది.


దిగ్భ్రాంతిలో తెలుగు చిత్రసీమ

వర్‌స్టార్‌గా కన్నడ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తున్న పునీత్‌ రాజ్‌కుమార్‌ అకాలమరణం భారతీయ సినీ పరిశ్రమని దిగ్భ్రాంతికి గురిచేసింది. జీర్ణించుకోలేని విషాదం అంటూ సామాజిక మాధ్యమాల్లో పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. తెలుగు చిత్రసీమలోనూ తీవ్ర విషాదం అలుముకుంది. పునీత్‌ రాజ్‌కుమార్‌కి తెలుగు చిత్ర పరిశ్రమతో ఎంతో అనుబంధం ఉంది. ఆయన నటించిన సినిమాలు ఇటీవల తెలుగులోనూ విరివిగా అనువాదం అవుతున్నాయి. పునీత్‌ రాజ్‌కుమార్‌ సోదరుడు శివరాజ్‌కుమార్‌ కథానాయకుడిగా నటించిన ‘జై భజరంగి’ చిత్రం శుక్రవారమే తెలుగులో విడుదలైంది. తెలుగు కథానాయకులు, దర్శకులతో పునీత్‌ రాజ్‌కుమార్‌ సన్నిహితంగా మెలిగేవారు. ‘ఒక్కడు’, ‘అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘రెడీ’, ‘ఆంధ్రావాలా’, ‘ఇడియట్‌’, ‘దూకుడు’ సినిమాలు కన్నడలో రీమేక్‌ కాగా, అందులో పునీత్‌ నటించారు. పూరి జగన్నాథ్‌, జయంత్‌ సి. పరాన్జీ, మెహర్‌ రమేష్‌, వీరశంకర్‌ వంటి దర్శకులతో కలిసి పనిచేశారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న పునీత్‌ చాలా త్వరగా దూరమయ్యారని తెలుగు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. పునీత్‌ రాజ్‌కుమార్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం ప్రకటించారు.


‘‘పునీత్‌ నాకు అత్యంత ఆప్తుడు. ఎప్పుడు బెంగళూరు వెళ్లినా ఆత్మీయంగా పలకరిస్తారు. ఆయన హఠాన్మరణం గురించి తెలియగానే నోట మాట రాలేదు. నా హృదయం ముక్కలైంది.’’

- చిరంజీవి


‘‘అప్పూ మృతితో గొప్ప స్నేహితుడిని కోల్పోయా. ఆయన మృతి కన్నడ చిత్ర పరిశ్రమకి తీరనిలోటు. బాలనటుడిగా సినీ రంగప్రవేశం చేసి కథానాయకుడు, గాయకుడు, నిర్మాత, బుల్లితెర వ్యాఖ్యాతగా ప్రతిభ చాటాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు’’

- బాలకృష్ణ


‘‘యావత్‌ సినీ ప్రపంచానికి విషాదకరమైన రోజు ఇది. పునీత్‌ రాజ్‌కుమార్‌ చాలా మంచి మనిషి. భగవంతుడు కొన్నిసార్లు ఎందుకు ఇలా చేస్తాడో అర్థం కాదు. పునీత్‌ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సంతాపం’’.

- మోహన్‌బాబు


‘‘ఒకట్రెండుసార్లు మాత్రమే నేను పునీత్‌ రాజ్‌కుమార్‌ని కలిశా. ఆ సమయంలో ఆయన చూపించిన ప్రేమ, ఆప్యాయత, ఇచ్చిన ఆతిథ్యం ఎప్పటికీ మరిచిపోలేను. ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి’’.

- ఎస్‌.ఎస్‌.రాజమౌళి


‘‘నా ప్రియమైన తమ్ముడు పునీత్‌. ఆయన కుటుంబానికీ, కర్నాటకలోని ఆయన అభిమానులకి నా ప్రగాఢ సానుభూతి’’.

- కమల్‌హాసన్‌


‘‘మరణం ఊహించనిది అని నాకు తెలుసు. కానీ పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణం నిజంగా షాక్‌కి గురిచేసింది. తను కథానాయకుడిగా నటించిన మొట్ట మొదటి సినిమా ‘అప్పు’ నేను తీశా. తన కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా ఎంతోమందిని ఆదుకున్నాడు, సాయం చేశాడు. ఒక నెల కింద ఇద్దరం మాట్లాడుకున్నాం. కలుద్దాం అనుకున్నాం. ఆలోపే ఇది జరిగింది. పునీత్‌ మరణం కన్నడ పరిశ్రమకి తీరని లోటు’’.

- పూరి జగన్నాథ్‌

పవన్‌ కల్యాణ్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌తోపాటు పలువురు కథానాయకులు, నాయికలు, ఇతర సినీ ప్రముఖులు ట్విటర్‌ ద్వారా పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.


సమాజ సేవకు అగ్రస్థానం

కన్నడ చిత్రసీమలో పవర్‌స్టార్‌గా కొన సాగుతూ.. మరోవైపు తన ఆదాయంలో కొంత భాగాన్ని సామాజిక సేవ కోసం వినియోగిస్తూ పునీత్‌రాజ్‌కుమార్‌  ఔన్నత్యాన్ని చాటుకున్నారు. అప్పటి వరకు తమ తల్లి పార్వతమ్మ రాజ్‌కుమార్‌  ఆధ్వర్యంలో కొనసాగిన మైసూరులోని శక్తిధామ కేంద్రం ద్వారా అభాగ్యులైన మహిళలకు ఆశ్రయం లభించేది. పార్వతమ్మ మరణానంతరం ఆ బాధ్యతల్ని పునీత్‌రాజ్‌కుమార్‌ చేపట్టారు. ఇతర ప్రాంతాల్లో సాయం కోసం చేతులు చాచే అభాగ్యులకు అండగా నిలిచారు. ఆయన నేపథ్య గాయకుడుగా పొందే ఆదాయాన్ని ఈ సేవల కోసం ప్రత్యేకించారు. తొలుత ఉచితంగా గానం చేయాలని భావించినా నిర్మాతల ఒత్తిడి కారణంగా స్వీకరించాల్సి వచ్చింది. అందుకే ఆ నిధుల్ని సేవా  కార్యక్రమాలకు వినియోగించేలా  ప్రణాళికను రూపొందించారు.  ఎందరినో ఆదుకున్నారు. విద్యార్థులను చదివించారు.


‘‘భవిష్యత్తు మన చేతిలో లేదు. గతాన్ని వెనక్కి    తీసురాలేం, ఎలా ఉంటే అలా జరుగుతుంది. విధి రాతను ఎవరూ మార్చలేరు’’ అంటూ పునీత్‌ సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానించారు. ఇప్పుడవి ఆయన జీవితానికి వర్తిస్తాయని ఊహించలేకపోయామని అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, సమాజ సేవకు ఎప్పుడూ ముందుండే.. తమ అప్పూ ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక విలపిస్తున్నారు.

- న్యూస్‌టుడే, బెంగళూరు (ఎలక్ట్రానిక్‌ సిటీ)


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని