Rajinikanth: ‘పెద్దన్న’ మెప్పిస్తాడు

‘‘కరోనా తర్వాత సినీ పరిశ్రమ పునరుద్ధరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే థియేటర్‌కి రావడం మొదలు పెట్టారు. ఇలాంటి సమయంలో మరో వాణిజ్య ప్రధానమైన పెద్ద సినిమా...

Updated : 01 Nov 2021 05:21 IST

‘‘కరోనా తర్వాత సినీ పరిశ్రమ పునరుద్ధరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే థియేటర్‌కి రావడం మొదలు పెట్టారు. ఇలాంటి సమయంలో మరో వాణిజ్య ప్రధానమైన పెద్ద సినిమా అయితే మరింత మంది ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించడం సులభం అవుతుంది. అందుకే మేం కలిసి ‘పెద్దన్న’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’’ అన్నారు ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు. ఆయన ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, నారాయణ్‌దాస్‌ నారంగ్‌తో కలిసి రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన ‘పెద్దన్న’ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రం దీపావళి సందర్భంగా ఈ నెల 4న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. నారాయణ్‌దాస్‌ నారంగ్‌ మాట్లాడుతూ ‘‘రజనీకాంత్‌ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. మాపై నమ్మకంతో ‘పెద్దన్న’ చిత్రం హక్కుల్ని ఇచ్చిన సన్‌ టీవీకి, రజనీకాంత్‌కి కృతజ్ఞతలు. చిత్రం తప్పకుండా విజయవంతం అవుతుంది’’ అన్నారు. డి.సురేష్‌బాబు మాట్లాడుతూ ‘‘తమిళంలో తెరకెక్కిన ‘అన్నాత్తే’ సినిమాకి అనువాదంగా వస్తోంది ‘పెద్దన్న’. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సినిమాని విడుదల చేస్తున్నాం. మేం కలిసి ఈ సినిమాని ఎందుకు విడుదల చేస్తున్నామా అనే అనుమానాలు రావొచ్చు. ఇకపై కూడా మేం కలిసి సినిమాలు నిర్మిస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి ‘పెద్దన్న’లాంటి పెద్ద సినిమాలు అవసరం. మంచి కథ, మంచి పాటలు, మంచి వాణిజ్యాంశాలున్న చిత్రమిది. ఒకప్పటి రజనీకాంత్‌ కనిపిస్తున్నారు. భావోద్వేగాలు, అన్నాచెల్లెళ్ల బంధం, క్లాస్‌ మాస్‌ కలిసి చూడగలిగే అంశాలున్న సినిమా. అందుకే మేం కలిసి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’’ అన్నారు. ప్రదర్శన రంగంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల ఇప్పుడు మధ్యస్థమైనవి పాన్‌ ఇండియా స్థాయి సినిమాలు అవుతున్నాయన్నారు సురేష్‌బాబు. ‘‘ప్రేక్షకులు భిన్న రకాల సినిమాలు చూడాలనుకుంటున్నారు. వాళ్లకి రకరకాల కథలు అందించేందుకు ఎగ్జిబిటర్లు కూడా కలిసిపోయి సినిమాల్ని పంచుకుంటున్నారు. ఇదివరకు కొన్ని సినిమాల్నే ఉత్తరాదిలో విడుదల చేసేవాళ్లం. ఇప్పుడు మన సినిమాలు అక్కడ విరివిగా విడుదలవుతున్నాయి. అది ప్రేక్షకులకు మంచిది, పరిశ్రమకీ మంచిది’’ అన్నారు.


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని