
Cinema News: కథ కంచికి.. కన్నీళ్లతో ఇంటికి
సుఖాంతాలే తప్ప.. దుఃఖాంతాల్ని అంతగా ఇష్టపడరు తెలుగు సినీప్రియులు. వాళ్ల దృష్టిలో హీరో అంటే హీరోనే. అతడు మరణం లేని చిరంజీవి. వందల మంది ప్రతినాయక గణం ఎదురుగా ఉన్నా.. ఒంటి చేత్తో మట్టికరిపించి ప్రేక్షకుల మోములపై నవ్వులు పూయిస్తాడు హీరో. వీర మరణాలు.. విషాదాంతాలు అతనికెప్పుడూ ఆమడ దూరమే. ఇలాంటి ముగింపులే ప్రేక్షకులకు రుచిస్తాయి. అందుకే దర్శక నిర్మాతలూ విషాదాంతపు ప్రయోగాల వైపు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. ఇక అగ్ర హీరోతో అలాంటి ప్రయోగమంటే.. దాన్నో సాహసంలానే భావించేవారు. ఇటీవల కాలంలో ప్రేక్షకులు సహజత్వాన్ని, వాస్తవికతను ఇష్టపడుతుండటంతో.. హీరోలు, దర్శకులు సాహసాలకు వెనుకాడటం లేదు. ఫలితంగా తెలుగు తెరపై విషాదాంతపు కథల జోరు పెరిగింది.
విషాదాంతాలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. అలనాటి ‘దేవదాసు’ నుంచి ఇటీవల కాలంలో వచ్చిన ‘జెర్సీ’, ‘సైరా నరసింహారెడ్డి’ వరకు యాంటీ క్లైమాక్స్ చిత్రాలు చాలానే వచ్చాయి. ఇవన్నీ ప్రేక్షకులతో కంటతడి పెట్టించి మరీ విజయబావుటా ఎగరేసిన దృశ్యమాలికలే. చెప్పే కథ మనసుల్ని హత్తుకునేలా ఉన్నప్పుడు.. ఆ కథకు తగ్గ ముగింపును ఇవ్వొచ్చనే భరోసానిచ్చాయి. అందుకే ఈ మధ్య తెలుగులో యాంటీ క్లైమాక్స్ చిత్రాల జోరు మరింత పెరిగింది. సాధారణంగా విషాదాంతపు కథలనగానే ముందుగా గుర్తొచ్చేది ప్రేమకథలే. కులాంతార ప్రేమకథలన్నీ ఆఖరికి కంటతడి పెట్టించే ముగుస్తుంటాయి. ఈ ఏడాది వచ్చిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఈకోవకు చెందినదే. సుధీర్‌బాబు, ఆనంది జంటగా నటించిన చిత్రమిది. ‘పలాస’ ఫేం కరుణ కుమార్ తెరకెక్కించారు. ఇందులో భారమైన క్లైమాక్స్‌తో ప్రేక్షకులతో కంటతడి పెట్టించారు. అయితే ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ ఆదరణే దక్కింది.
* కన్నడలో విజయవంతమైన ‘దియా’ చిత్రాన్ని తెలుగులో ‘డియర్ మేఘ’గా రీమేక్ చేశారు దర్శకుడు ఎ.సుశాంత్ రెడ్డి. అరుణ్ అదిత్, మేఘా ఆకాష్ జంటగా నటించారు. అర్జున్ సోమయాజులు మరో హీరో. ముక్కోణపు ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా, విషాదభరితంగానే ముగిసింది. నిజానికి ఈ యాంటీ క్లైమాక్స్ కన్నడ ప్రేక్షకుల్ని మెప్పించినా.. తెలుగు సినీప్రియులకు రుచించలేదు.
* సాయి తేజ్ హీరోగా దేవ్ కట్టా తెరకెక్కించిన చిత్రం ‘రిపబ్లిక్’. వ్యవస్థను మార్చడం కోసం ఓ యువ కలెక్టర్ ఎలాంటి సాహసాలు చేశాడన్నది ఇందులో చూపించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కినా.. వాణిజ్య పరంగా మెప్పించలేకపోయింది. ఇందులో సాయితేజ్ పోషించిన అభిరామ్ పాత్రది విషాదాంతమే.
* ‘రొమాంటిక్’ సైతం ఈ నెగటివ్ క్లైమాక్స్ చిత్రాల జాబితాలోకే చేరింది. ఆకాష్ పూరి, కేతిక శర్మ నటించిన ఈ చిత్రాన్ని.. అనిల్ పాదూరి తెరకెక్కించారు.
ఇవీ విషాదాంతాలేనట!
విషాదాంత కథల ప్రస్తావన రాగానే.. తెలుగు ప్రేక్షకులకు ఠక్కున గుర్తొచ్చే హీరో నాని. ఈతరం యువ హీరోల్లో ఎక్కువ యాంటీ క్లైమాక్స్ చిత్రాలు చేసింది ఆయనే. ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘ఈగ’, ‘జెర్సీ’ చిత్రాల్లో ఆయన పాత్రలన్నీ విషాదభరితంగానే ముగిశాయి. ఇప్పుడు నాని నుంచి రానున్న ‘శ్యామ్ సింగరాయ్’లోనూ ఇలాంటి ముగింపు కనిపించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. విభిన్నమైన సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోంది. నాని దీంట్లో శ్యామ్ సింగరాయ్‌గా, వాసుగా రెండు భిన్నమైన పాత్రలో కనిపిస్తారు. వీటిలో ఓ పాత్ర విషాదంగానే ముగుస్తుందని తెలుస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
* ముంబయి 26/11 ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథతో రూపొందుతోన్న చిత్రం ‘మేజర్’. టైటిల్ పాత్రను అడివి శేష్ పోషిస్తున్నారు. శశి కిరణ్ తిక్క దర్శకుడు. కథ రిత్యా ఈ సినిమాది విషాదభరిత ముగింపే. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
* ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘రాధేశ్యామ్’. 70ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే ప్రేమకథతో రూపొందుతోంది. ఇదీ యాంటీ క్లైమాక్స్ చిత్రమేనని ప్రచారం వినిపిస్తోంది. ఆ మధ్య విడుదలైన ఈ చిత్ర మోషన్ పోస్టర్‌లో రోమియో - జులియెట్.. సలీం - అనార్కలీ.. దేవదాసు - పార్వతీ.. వంటి అమర ప్రేమికులను చూపిస్తూ చివరకు ‘విక్రమాదిత్య - ప్రేరణ’ల ప్రేమ కావ్యంగా రూపొందుతోందని హింట్ ఇచ్చారు. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోన్న ఈ సినిమా.. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
* బాలీవుడ్‌లోనూ ఈ ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల ప్రేక్షకుల మెప్పు పొందిన ‘షేర్షా’, ‘సర్దార్ ఉదమ్’ కథలూ విషాదాంతాలే. కెప్టెన్ విక్రమ్‌బాత్రా వీరగాథ నేపథ్యంలో విష్ణువర్దన్ తెరకెక్కించిన చిత్రం ‘షేర్షా’. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అడ్వాణీలు నాయకానాయికలు. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో సుజిత్ సర్కార్ రూపొందించిన చిత్రం ‘సర్దార్ ఉదమ్’. మనసును హత్తుకొనే భావోద్వేగాలు, ఆకట్టుకునే కథనంతో ఇవి అభిమానుల మది దోచాయి.