Moon Moon Sen: మా అమ్మాయిలకీ చెబుతున్నా

చలన చిత్రోత్సవాలు ప్రాంతాల మధ్య సాంస్కృతిక వాహకాలుగా నిలుస్తాయన్నారు ప్రముఖ నటి మున్‌మున్‌ సేన్‌. మనం రాష్ట్రాలుగా, ప్రాంతాలుగా వేరైనా భాషలు, ఆహారపు అలవాట్లు,...

Updated : 30 Nov 2021 16:47 IST

లన చిత్రోత్సవాలు ప్రాంతాల మధ్య సాంస్కృతిక వాహకాలుగా నిలుస్తాయన్నారు ప్రముఖ నటి మున్‌మున్‌ సేన్‌. మనం రాష్ట్రాలుగా, ప్రాంతాలుగా వేరైనా భాషలు, ఆహారపు అలవాట్లు, అభిరుచుల మధ్య చాలా సారూప్యతలు ఉంటాయని, అవన్నీ ఇలాంటి కళా వేదికల ద్వారానే వెలుగులోకి వస్తాయని చెప్పారామె. 16 భాషల్లో నటించి దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు సుపరిచితం మున్‌మున్‌ సేన్‌. తెలుగులో ‘సిరివెన్నెల’లో నటించి ఉత్తమ క్యారెక్టర్‌ నటిగా నంది పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బెంగాలీ చలన చిత్రోత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శనివారం ఆమె ‘ఈనాడు సినిమా’తో మాట్లాడుతూ ‘‘తెలుగు సినిమాలతో నాది విడదీయలేని అనుబంధం. చిత్రోత్సవాల్లో భాగంగా సుదీర్ఘ కాలం తర్వాత హైదరాబాద్‌ నగరానికి రావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో పురోగమిస్తోంది. మనదైన కథతో ‘బాహుబలి’ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించారు. బెంగాలీ చిత్రసీమ వాణిజ్య పరంగా మంచి ఫలితాలు సాధిస్తున్న క్రమంలో కొవిడ్‌ కుదేలు చేసింది. నటులు రోజుకి రూ.200, రూ.300కి నటించాల్సి వస్తోంది. కోలుకోవడానికి సమయం పడుతుంద’’న్నారు. నటిగా తన ప్రయాణం గురించి చెబుతూ ‘‘భారతీయ నటి అనిపించుకోవడమే లక్ష్యంగా సినిమాలు చేశా. మా అమ్మాయిలకి తెలుగుతోపాటు, అన్ని భాషల్లో నటించమని చెబుతున్నా. తెలుగు సినిమాలు చూస్తుంటాన’’న్నారు మున్‌మున్‌సేన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని