
కొత్త చిత్రానికి క్లాప్.. క్లాప్
‘రాజా వారు - రాణీ గారు’, ‘ఎస్.ఆర్.కల్యాణ మండపం’ చిత్రాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు కిరణ్ అబ్బవరం. ఇప్పుడాయన కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఓ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంతో రమేష్ కాదూరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కొరటాల శివ క్లాప్ నివ్వగా.. కేఎస్ రవీంద్ర (బాబీ) కెమెరా స్విచ్చాన్ చేశారు. గోపీచంద్ మలినేని గౌరవ దర్శకత్వం చేశారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్, చిరంజీవి (చెర్రీ) దర్శకుడికి స్క్రిప్ట్ అందించారు.
‘‘అన్ని రకాల వాణిజ్యాంశాలతో నిండిన ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తామ’’ని చిత్ర బృందం తెలిపింది.
కృష్ణ.. సత్యభామల పాట
కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘సమ్మతమే’. గోపీనాథ్ రెడ్డి దర్శకుడు. కంకణాల ప్రవీణ నిర్మాత. శేఖర్ చంద్ర స్వరాలందిస్తున్నారు. ఈ సినిమాలోని ‘కృష్ణ అండ్ సత్యభామ’’ అంటూ సాగే తొలి పాటను సోమవారం విడుదల చేశారు. ‘‘నేనూహించలే.. నేననుకున్న అమ్మాయి నువ్వేనని..’’ అంటూ వినసొంపుగా సాగుతున్న ఈ మెలోడీ పాటకు కృష్ణకాంత్ సాహిత్యమందించగా.. యాజిన్ నాజిర్, శిరీష భగవతుల ఆలపించారు. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.