Updated : 01/12/2021 07:38 IST

Sirivennela: రచయితల కోసం పోరాడిన యోధుడు

‘‘ఆయన వ్యక్తిత్వమే.. కవిత్వం.   కవిత్వమే ఆయన వ్యక్తిత్వం. అలా గొప్పగా జీవించిన మనిషి సీతారామశాస్త్రి. పాటే ప్రాణంగా బతికిన    రచయిత. ఒక మంచి పాట రాసి  వినిపించేవారు. రాస్తే వినేవారు. సూచనలు, సలహాలు ఇచ్చేవారు.  ఇటీవల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం రాసిన ‘దోస్త్‌’ పాట గురించి అరగంట నాతో మాట్లాడారు. ఇంతలోనే ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఆయన  నిద్రలేని రాత్రులెన్నో గడిపి... మనలో చైతన్యం నింపారు. స్ఫూర్తి రగిలించారు. ప్రేరణ ఇచ్చారు. హితోక్తి పలికారు. ప్రేమ పంచారు. ప్రశ్నించడం నేర్పారు. ఆయన ఓ పాటల గ్రంథాలయం. ‘తాజ్‌మహల్‌’ సినిమాకు నేను రాసిన పాట చూసి... ఆశీర్వదించారు. తర్వాత ‘పెళ్లిసందడి’ చిత్రానికి రాసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్లి.... ఆటోగ్రాఫ్‌ తీసుకున్నా. పాటలు ఎంతోమంది రాస్తారు. అయితే పాటల రచయితల కోసం నడుంబిగించి పోరాడిన వ్యక్తి సిరివెన్నెల. మా హక్కులకోసం ఎంతో శ్రమించారు. నిర్మాతలు, ఆడియో కంపెనీ అధిపతులతో మాట్లాడారు. రచయితల గుర్తింపు, రాయాల్టీ కోసం చట్టాలు చదివి, ఎన్నింటినో అధ్యయనం చేశారు. కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి పాటపై రచయిత హక్కుల కోసం  నిరంతర కృషి చేశారు. ‘ఎవరో ఒకరు.. ఎపుడో.. అపుడు’ అని రాసిన సీతా రామశాస్త్రి... అన్నీ ఆయనై మమ్మల్ని  నడిపించారు. అందుకే ఆయన భావనే.. జీవన. రాసిందే చేస్తారు. చేసేదే రాస్తారు. ఆదర్శకవి సిరివెన్నెల.’’

- చంద్రబోస్‌, గీత రచయిత


‘‘ఇది నమ్మలేని నిజం. సిరివెన్నెల మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. బాలసుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు కుడి భుజాన్ని కోల్పోయాననిపించింది. ఇప్పుడు నా ఎడమ భుజాన్ని కోల్పోయా. ఎంతో సన్నిహితంగా ఉండే ఆయన అనుకోకుండా మనల్ని వదిలి వెళ్లిపోయాడంటే నమ్మశక్యం కావడంలేదు’’.

 - దర్శకుడు కె. విశ్వనాథ్‌


చీకటి ఏకాంతం ఎక్కువగా ఇస్తుంది. పాట రాయాలంటే నాలోకి నేను వెళ్తుండాలి. నాతో నేను మాట్లాడుకోవాలి. పోట్లాడుకోవాలి. అలా జరగాలంటే చాలా పొరల్ని దాటుకుంటూ వెళ్లాలి. ఆ సంఘర్షణకు రాత్రి అనువైన సమయం.

( సిరివెన్నెల రాత్రి పూట పాటలు రాయడం వెనుక ఆంతర్యం)


‘‘సిరివెన్నెల మనకిక లేదు.. సాహిత్యానికి ఇది చీకటి రోజు. వేటూరిగారి తర్వాత అంత గొప్ప సాహిత్య విలువలను ఈ తరానికి అందించిన రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన భాషను అర్థం చేసుకోవడానికి మనకున్న పరిజ్ఞానం సరిపోదు. ఓ ఆత్మీయుడ్ని కోల్పోయా. గుండె బరువెక్కిపోతోంది. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు. 

 -చిరంజీవి


కె.విశ్వనాథ్‌ పాటలొద్దు అన్నారంటే...!

కె.విశ్వనాథ్‌..సిరివెన్నెలది విడదీయలేని అనుబంధం. ఈయన పాట లేని విశ్వనాథ్‌ సినిమాని ఊహించ లేము.  సినిమా పాటకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చిన సిరి వెన్నెల, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన విశ్వనాథ్‌ మధ్య ఓ సందర్భంలో ‘సినిమాకి పాటలెందుకు?’ అనే చర్చ వచ్చింది. ఈ     విషయాన్ని ఓ సారి సిరివెన్నెల ‘ఈనాడు సినిమా’తో పంచుకున్నారు. ‘‘తన సినిమాల్లో పాటలకు అగ్రతాంబూలం ఇచ్చే విశ్వనాథ్‌ అంతటి వారే..‘పాటలొద్దు’ అన్నారంటే.. ఎందుకని ఆలోచించాలి కదా? మనసు ఆకలి, ఆత్మ ఆకలి తీర్చేది కవిత్వం. ఆ అవసరం ఉంటేనే అలాంటి పాటలు రాయాలి. హాలీవుడ్‌లో పాట ఎందుకు కనుమరుగై పోయింది. బాలీవుడ్‌లో పాట రీ రికార్డింగుల్లో ఎందుకు కలిసిపోతోంది? ఎందుకంటే.. పాట జనాలకు నచ్చడం లేదు. పాటలతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు హిట్టయ్యాయి. అంటే పాటలున్నా, లేకున్నా పట్టించుకోవడం లేదనే కదా అర్థం. చెప్పాల్సిన కథ సూటిగా చెప్పు. లేదంటే పాట అవసరమయ్యే స్థాయి కథ తీసుకో’’ అని చెప్పారు.


పంపిన కథలన్నీ వెనక్కొచ్చేశాయి..

సిరివెన్నెల తనలోని భావాల్ని పాటలుగానే కాదు.. కథల రూపంలోనూ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ, కథా రచయితగా మెప్పించలేకపోయారట ఆయన. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పంచుకున్నారు. ‘‘నా అనుభవాలతో కథలు రాసే ప్రయత్నం చేశా. వాటిలో ఓ పదిహేను కథలే ప్రచురితమయ్యాయి. పోస్టులో పంపితే రెక్కలు కట్టుకుని తిరిగి వచ్చేసిన కథలు ముప్పై ఉన్నాయి. ఇక సగంలో వదిలేసిన కథలు 400 ఉంటాయేమో. కథా రచనలో నా శైలి వేరు. కవితాత్మకంగా, చాలా క్లిష్టంగా ఉంటాయి. కథా నిర్వచనాలకు లొంగవు. అందుకే ఆ యుద్ధం నేను చేయలేదు. ఏడు కథల్ని ఎంచుకుని ‘ఎన్నో రంగుల తెల్లకిరణం’ అని ఓ పుస్తకం వేశాను’’ అని తన జ్ఞాపకాల్ని పంచుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో మాటలు రాయమని అడిగారని కానీ, ఒప్పుకోలేదని చెప్పారు. ‘‘మూడు గంటల విషయాన్ని మూడు వాక్యాల్లో చెప్పడం అలవాటు చేసుకున్న వాడ్ని. మూడు వాక్యాల్లో చెప్పాల్సింది మూడు గంటలు చెప్పడమంటే కష్టమేగా’’ అనేవారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని