Sirivennela Sitharama Sastry: ఆయన అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు

‘‘సీతారామశాస్త్రి గారి కవిత్వం గురించి చెప్పడానికి నాకున్న శక్తి సరిపోదు.. నాకున్న పదాలు సరిపోవు... ఎందుకంటే ఆయన మొదటి సినిమా ‘సిరివెన్నెల’లో రాసిన మొదటి పాట...‘ప్రాగ్దిశ వీణియ పైన...దినకర మయూఖ తంత్రుల పైన..’.

Updated : 01 Dec 2021 09:37 IST


‘‘సీతారామశాస్త్రి గారి కవిత్వం గురించి చెప్పడానికి నాకున్న శక్తి సరిపోదు.. నాకున్న పదాలు సరిపోవు... ఎందుకంటే ఆయన మొదటి సినిమా ‘సిరివెన్నెల’లో రాసిన మొదటి పాట...‘ప్రాగ్దిశ వీణియ పైన...దినకర మయూఖ తంత్రుల పైన..’. ఆ పాట విన్న వెంటనే నేను తెలుగు డిక్షనరీ అని ఒకటి ఉంటుంది అని కనుక్కున్నాను. దానిని శబ్దరత్నాకరం అంటారని తెలుసుకున్నాను. అది వెళ్ళి కొనుక్కుని తెచ్చుకుని ప్రాగ్దిశ అంటే ఏమిటి.. మయూఖం అంటే ఏంటి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నాను. అంటే ఒక పాటని అర్థమయ్యేలాగేనే రాయక్కర్లేదు.. దాన్ని అర్థం చేసుకోవాలి అనే కోరికను పుట్టేలా కూడా రాయొచ్చు అని తెలుగు పాట స్థాయిని పెంచినటువంటి వ్యక్తి.


- ఓ సభలో సీతారామశాస్త్రి గురించి దర్శకుడు త్రివిక్రమ్‌ వెలిబుచ్చిన మాటల్లో కొన్ని...

నాకు తెలిసి ప్రపంచం అంతా పడుకున్న తరువాత ఆయన లేస్తాడు. అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు ఆయన. పదాలు అనే కిరణాలు తీసుకుని, అక్షరాలు అనే తూటాలతో ప్రపంచం మీద వేటాడడానికి బయలుదేరుతాడు... రాత్రి పూట. ‘రండి... నాకు సమాధానం చెప్పండి...’ అని. మనం సమాధానం చెప్పలేని ప్రశ్నలని మన మీదకి సంధిస్తాడు. మన ఇంట్లోకి వస్తాడు.. మన హాలులో కూర్చుంటాడు.. మన బెడ్రూమ్‌లో మన పక్కనే నిలబడతాడు.. మనల్ని క్వశ్చన్‌ చేస్తాడు.. ‘రా.... ఎప్పుడూ ఒప్పుకోవద్దు ఓటమి’ అంటాడు.


గుండె నిండు గర్భిణిలా ఉంది

ప్రసవించలేని దుఃఖం పుట్టుకొస్తోంది

తల్లి కాగితానికి దూరమై

అక్షరాల పిల్లలు గుక్కపట్టి ఏడుస్తున్నాయ్‌

మీరు బతికే ఉన్నారు

పాట తన ప్రాణం పోగొట్టుకుంది

మీరు ఎప్పటికీ రాయని

పాటలాగ  మేం మిగిలిపోయాం

- సుకుమార్‌, దర్శకుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని