Sirivennela Sitharama Sastry: అస్తమించిన అక్షర సూర్యుడు

సిరివెన్నెల సీతారామశాస్త్రి కాకినాడలోని సాహితి మిత్రబృందం సభ్యులకు తను రాసిన కవితలను పాడి వినిపిస్తుండేవారు. అక్కడే లెక్చరర్‌గా పనిచేసే ఎర్రంశెట్టి సత్యారావు సీతారామశాస్త్రిని సినీ సంభాషణల రచయిత ఆకెళ్లకు పరిచయం చేశారు.

Updated : 01 Dec 2021 14:21 IST

సిరివెన్నెల సీతారామశాస్త్రి కాకినాడలోని సాహితి మిత్రబృందం సభ్యులకు తను రాసిన కవితలను పాడి వినిపిస్తుండేవారు. అక్కడే లెక్చరర్‌గా పనిచేసే ఎర్రంశెట్టి సత్యారావు సీతారామశాస్త్రిని సినీ సంభాషణల రచయిత ఆకెళ్లకు పరిచయం చేశారు. ‘శంకరాభరణం’ సినిమా శత దినోత్సవాల సందర్భంగా సీతా రామశాస్త్రి రచించిన ‘గంగావతరణం’ గేయ కవిత దర్శకుడు విశ్వనాథ్‌ దృష్టిని ఆకర్షించింది. ఆయన సిరివెన్నెల సినిమాకు శ్రీకారం చుడుతూ నూతన గేయ రచయితను పరిచయం చేయాలని సంకల్పించినపుడు బాల సుబ్రహ్మణ్యం..విశ్వనాథ్‌కు సీతారామశాస్త్రి రాసిన గంగావతరణం కవితను పాడి వినిపించడం.. విశ్వనాథ్‌ అది విని పులకించిపోయి ‘సిరివెన్నెల’ చిత్రంలోని పాటలన్నీ సీతారామశాస్త్రి చేత రాయించడం లాంటి సంఘటనలన్నీ చకచకా జరిగిపోయాయి. అప్పటి నుంచి చెంబోలు సీతారామశాస్త్రి పేరు ‘సిరి వెన్నెల సీతారామశాస్త్రిగా మారిపోయింది.

నాదమయం సిరివెన్నెల కలం

సినిమా పాటలు తెరమీద చూస్తూ వింటుంటే ఆసక్తిని కలిగిస్తాయి. కానీ ‘సిరివెన్నెల’ సినిమా పాటలు బయట వింటున్నా సందేశాత్మకంగానూ, శ్రావ్యంగానూ ఉంటాయి. అందుకే ఆయన పాటలు పదకొండు నంది బహుమతులకు అర్హత సాధించాయి. ‘సిరివెన్నెల’ చిత్రంలో ఆయన రాసిన తొలి పాటను గమనిస్తే కవితా ధోరణి కనిపిస్తుంది. సగటు ప్రేక్షకుడికి ఈ పాట అంతరార్థం బోధపడకపోయినా, మహదేవన్‌ ఆ పాటని స్వరపరచిన తీరు జనాల్లోకి చొచ్చుకుపోయింది. ‘విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం..ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం..’ అంటూ పల్లవిలో ఓంకార నాద ఆవిర్భావాన్ని కవితా ధోరణిలో వర్ణించారు. అందునా, అంధుడైన కథానాయకుడికి తన మనోనేత్రం విశ్వసృష్టికి మూలాధారమైన ఓంకార నాదం సాక్షాత్కారమైంది. ‘ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన.. జాగృత విహంగ గతులే వినీల గగనపు వేదికపైన..పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా’ అంటూ ప్రథమ చరణాన్ని భావోద్వేగంతో వర్ణించారు. తూర్పు దిక్కు అనే వీణకు దినకరుని కిరణాలు తంత్రులుగా మారాయని, ఆ తంత్రులను బిగించి శూన్యంతో నిండిన ఆకాశమనే రంగస్థలం మీద పక్షులు తమ రెక్కలతో ఆ తీగలను మీటుతూ కిలకిలారావాలు చేస్తుంటే, ఆ శబ్దాలు జగత్రిని చైతన్యవంతం చేస్తున్నాయని సిరివెన్నెల అద్భుతంగా వర్ణించారు. ఈ పాటకు తొలి చిత్రంతోనే నంది బహుమతి అందుకున్నారు. 2004లో విడుదలైన ‘నేనున్నాను’ చిత్రం కోసం సిరివెన్నెల రచించిన ‘ఏ శ్వాసలో చేరి గాలి గాంధర్వమౌతున్నదో.. ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో...ఆ శ్వాసలో నే లీనమై నిను చేరనీ మాధవా’ పాటలో కథానాయకుని ప్రోత్సహిస్తూ కృతజ్ఞతా పూర్వకంగా కథానాయిక సమస్కరిస్తున్న కవితాంజలి ఈ పాట. గాలి శ్వాసలో చేరి గానం కావడం అనడం సిరివెన్నెల సృజనాత్మకతకు ప్రతీక. ‘శివ’ చిత్రంలో ‘బోటనీ పాఠముంది..మ్యాటనీ ఆట ఉంది..దేనికో ఓటు చెప్పరా’’ అంటూ వచన కవిత్వం పలికేలా సరదా పాట రాశారు సిరివెన్నెల. కాలేజీ విద్యార్థులు పాడుకునే ఈ పాట వింటుంటే మహాకవి శ్రీశ్రీ రచించిన ‘రాక్సీలో నార్మా షేరర్‌, బ్రాడ్వేలో కాంచనమాల ఎటకేగుటో సమస్య తగిలిందొక విద్యార్థికి’ అనే సంధ్యా సమస్యలు గుర్తొస్తాయి. ‘అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడకా’ అంటూ అలతి పదాలతో రచించిన ‘అంతఃపురం’ చిత్రంలోని పాట, ‘అల్లరి ప్రియుడు’ సినిమాలో ‘అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు...’ పాటలు మనసుకవి ఆత్రేయను గుర్తుచేస్తాయి. ఆత్రేయ లాగే సిరివెన్నెల కూడా వాన పాటను రాశారు. ‘వర్షం’ సినిమాలో ‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా...ఎన్నాళ్లని దాక్కుటాంవే పైన అంటూ కొంటెగా వానను ఆటపట్టిస్తూ సాగే గీతమిది. సిరి వెన్నెల రచించి గానం చేసిన ‘విదిలించరాదా విభో విభూది..విడిపించరాదా విరాగీ విపత్తి...కలిగించరాదా కపార్దీ విముక్తి..కనిపించలేదా ప్రభో ఈ కబోది..’పాట వింటే కార్తీక ఏకాదశి పుణ్యదినాన కైలాశం చేరుకున్న శాస్త్రి మనోధ్యేయం గుర్తురాకమానదు. సిరివెన్నెల ఓ పాటలో ఇలా చెప్పుకొన్నారు. ‘నొప్పిలేని నిమిషమేది జననమైన, మరణమైన జీవితాన...అడుగడుగున నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది..ఆశ ఉంది...అస్త్రమౌను శ్వాస నీకు..శస్త్రమౌను ఆశయమ్యు..ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి...ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి..ఇది సిరివెన్నెల అంతరంగం అనుకోవాలి. ఆయన ఇప్పుడు అస్తమించినా... ఆయన రాసిన అక్షరాలు ఎప్పటికీ మన హృదయాల్లో ఉదయిస్తూనే ఉంటాయి. 

   - ఆచారం షణ్ముఖాచారి


వేదాంత ధోరణిలో సాగిన.. జగమంత కుటుంబం నాది (చక్రం), చిలకా ఏ తోడు లేక (శుభలగ్నం),  మనసు కాస్త కలతపడితే (శ్రీకారం), ఎంతవరకు.. ఎందుకొరకు (గమ్యం) లాంటి పాటలు సీతారామశాస్త్రికి పేరుతోపాటు నందులు కూడా తెచ్చాయి. దేవుడు కరుణిస్తాడని (ప్రేమకథ), మరీ అంతగా.. మహా చింతగా (సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు) లాంటి పాటలు నందులు గెలుచుకోవడంతోపాటు యువత మెచ్చే ప్రణయ
గీతాల్లోనూ తనది అందె వేసిన చేయి అని నిరూపించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని