Sirivennela: అక్షర శిల్పికి..అంతిమ వీడ్కోలు

అచ్చులు... కన్నీట మునిగాయి. హల్లులు... విలవిలలాడాయి. గుణింతాలు గుక్కపట్టి ఏడ్చాయి. పదాలు సిరివెన్నెల అంతిమయాత్రలో పాదాలు కలిపాయి. పాటలన్నీ శోకరాగంలో కలిసిపోయాయి. ఇంట్లో  బల్లపై ఉన్న కాగితం, కలం ...

Updated : 02 Dec 2021 09:34 IST

అచ్చులు... కన్నీట మునిగాయి. హల్లులు... విలవిలలాడాయి. గుణింతాలు గుక్కపట్టి ఏడ్చాయి. పదాలు సిరివెన్నెల అంతిమయాత్రలో పాదాలు కలిపాయి. పాటలన్నీ శోకరాగంలో కలిసిపోయాయి. ఇంట్లో  బల్లపై ఉన్న కాగితం, కలం మాత్రం ‘ఆయనెక్కడికీ వెళ్లడు... ఎందుకంటే... ఆయన ప్రాణం మేమే’ అని పాటరాముడి కోసం నీళ్లునిండిన కళ్లతో ఎదురుచూస్తున్నాయి. అక్షరం అంటే.. నశించనిది... మరి ఇన్ని తెలుగు అక్షరాలకు నిలువెత్తు విగ్రహరూపమాయన... ఆయనెక్కడికి వెళతారు? వెళ్లరు. వెళ్లలేరు. ప్రతి ఇంటా పాటలై ఉదయిస్తూనే ఉంటారు.

తెలుగుపాటకు కోట కట్టిన అక్షర శిల్పి సిరివెన్నెల సీతారామశాస్త్రికి అభిమానులు తుది వీడ్కోలు పలికారు. బుధవారం ఉదయం నుంచి ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్‌ ఫిల్మ్‌ఛాంబర్లో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ప్రముఖ కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, మహేష్‌బాబు, నాగార్జున, ఎన్టీఆర్‌, పవన్‌కల్యాణ్‌, రాజశేఖర్‌, తివిక్రమ్‌, రాజమౌళి, కీరవాణి, అల్లు అర్జున్‌, రానా, నాని, సుధీర్‌బాబు, నాగబాబు, శర్వానంద్‌, వరుణ్‌సందేశ్‌, శ్రీకాంత్‌, తనికెళ్ల భరణి, ఆర్పీ పట్నాయక్‌, శివబాలాజీ, నరేశ్‌, జగపతిబాబు తదితర సినీ ప్రముఖులు సీతారామశాస్త్రి భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. శోకతప్త హృదయాల మధ్య జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలు ముగిశాయి.


సీతారాముడు గౌరవం పెంచాడు

సిరివెన్నెల పాట స్పృశించని హృదయం అంటూ ఉండదేమో. ఆయన ప్రభావం పండితుల నుంచి పామరుల వరకు అందరిపైనా ఉంది. అందుకే ఆయన ఇక లేరని తెలిసిన ప్రతీ హృదయం ఉద్వేగంతో స్పందిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా... సిరివెన్నెలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఓ లేఖ రాశారు. ‘‘వేటూరి నాకు తెలుగు సాహిత్యం మీద ప్రేమని పెంచితే... సీతారాముడు గౌరవాన్ని పెంచాడు. తన సాహిత్యం నాతో ఆనందతాండవం, శివతాండవం చేయించాయి’’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. వీరిద్దరూ కలిసి చివరిగా ‘రంగమార్తాండ’ కోసం పనిచేశారు. ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల స్పందిస్తూ ‘‘మిత్రమా.. అనే మీ పిలుపే చెవుల్లో మోగుతోంది’’ అంటూ సిరివెన్నెలతో ఉన్న సాన్నిహిత్యాన్ని, ఆయన సాహిత్యం తనపై చూపించిన ప్రభావాన్ని లేఖలో నెమరేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని