Published : 03/12/2021 05:56 IST

Akhanda: ‘అఖండ’తో నిజాలు చెప్పాం

- బాలకృష్ణ

‘‘ఒకప్పుడు ఎన్‌.టి.రామారావు తన సినిమాల ద్వారా భక్తిని బతికించారు. దైవ చింతన కొరవడిన ఇలాంటి తరుణంలో మళ్లీ ‘అఖండ’ భక్తిని బతికించిందని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా’’ అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అఖండ’. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విదేశాలతోపాటు, తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వసూళ్లతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. గురువారం రాత్రి చిత్రబృందంతో కలిసి హైదరాబాద్‌లో సినిమాని వీక్షించారు బాలకృష్ణ. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘ప్రేక్షకుల స్పందన పరమానందంగా ఉంది. ఒక చరిత్రని కళ్లముందు కట్టినట్టు, వాల్మీకిలా ఎంతో అద్భుతంగా బోయపాటి చిత్రీకరించారు. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ, అఖండ విజయాన్ని అందించిన ప్రేక్షకులకి నా అభినందనలు. తెలుగువాళ్లు కొత్తదనాన్ని ఎప్పుడూ ఆదరిస్తారు. దానికి నిదర్శనం ఈ సినిమానే. చిన్న పిల్లలు కూడా చాలా బాగుందని చెబుతున్నారు. ఇది కేవలం మా విజయం అనుకోవడం లేదు. ఇది చలన చిత్ర పరిశ్రమ విజయం. అందరూ కూడా కథలో లీనమై, సినిమాలో అంతర్భాగమై పనిచేశారు. ఇది కూడా ఓ పౌరాణికమే. ఎన్నో నిజాలు ఇందులో చెప్పాం. స్వతహాగా నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ కాబట్టి ఇందులో చెప్పిన విషయాల్ని నేను కూడా బయట అందరి దగ్గర ప్రస్తావిస్తుంటా. మేమే కాదు, నా అభిమానులే కాదు, పరిశ్రమ మొత్తం ఎదురు చూసింది ఈ సినిమాకోసం. చరిత్రలో లేని పాత్రల్ని ఇంత సజీవంగా తెరపైకి తీసుకురావడం మాకు మాత్రమే చెల్లు. ఈ సినిమా ఈశ్వరేచ్ఛ. ముందు తరాలకి కూడా భక్తి అంటే ఏమిటో చెబుతుంది. తమన్‌ అద్భుతమైన బాణీలు అందించారు. సినిమా చూస్తున్నప్పుడు తెరపై కనిపించేది బాలకృష్ణనేనా అని నాకే అనిపించింది. ఇలా సమాజానికి మంచి సందేశం అందిస్తూ, సేవ చేసే అవకాశాన్ని అందిస్తున్న పార్వతీ పరమేశ్వరులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మళ్లీ నేను, బోయపాటి చేయబోయే సినిమా ఏమిటని ఇంకా ఆలోచించలేదు. అఘోరా పాత్ర కోసం, సహజత్వం కోసం రకరకాలుగా ఆలోచించి ఆ గెటప్‌ని ఎంపిక చేశాం. సినిమానే మా దైవం.  నేను దర్శకుడి నటుడిని. ఆయన ఎలా చెబితే అలా చేస్తా. ఆ దేవుడే నాకు ఆ బలాన్నిస్తాడ’’న్నారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘అందరినోటా హిట్‌ అనే మాట వినిపిస్తోంది. ఈ విజయం సినిమాది, సినీ పరిశ్రమది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో తమన్‌తోపాటు ఇతర చిత్రబృందం పాల్గొంది.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని