సిగురాకు సిట్టడవి గడ్డా

‘‘సెబుతున్నా నీ మంచి సెడ్డా... ఆంతోటి పంతాలు పోబోకు బిడ్డా... సిగురాకు సిట్టడవి గడ్డా... చిచ్చుల్లో అట్టుడికి పోరాదు బిడ్డా’’ అంటూ అడవి తల్లి తన బిడ్డలకి చెప్పింది. మరి ఆ బిడ్డలు ఏం చేశారో తెలియాలంటే మాత్రం ‘భీమ్లానాయక్‌’ చూడాల్సిందే. పవన్‌కల్యాణ్‌, రానా కథానాయకులుగా

Updated : 05 Dec 2021 04:36 IST

‘‘సెబుతున్నా నీ మంచి సెడ్డా... ఆంతోటి పంతాలు పోబోకు బిడ్డా... సిగురాకు సిట్టడవి గడ్డా... చిచ్చుల్లో అట్టుడికి పోరాదు బిడ్డా’’ అంటూ అడవి తల్లి తన బిడ్డలకి చెప్పింది. మరి ఆ బిడ్డలు ఏం చేశారో తెలియాలంటే మాత్రం ‘భీమ్లానాయక్‌’ చూడాల్సిందే. పవన్‌కల్యాణ్‌, రానా కథానాయకులుగా నటిస్తున్న చిత్రమిది. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్‌ రచన చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.  

‘‘కిందున్న మడుసులకా కోపాలు తెమలవు
పైనున్న సామేమో కిమ్మని పలకడు...
దూకేటి కత్తులా కనికరమెరగవు...
అంటుకున్న అగ్గిలోన ఆనవాళ్లు మిగలవు...’’

..అంటూ సాగే ఈ చిత్రంలోని పాటని శనివారం విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి ఈ గీతాన్ని రచించగా, తమన్‌ స్వరాలు సమకూర్చారు. దుర్గవ్వ, సాహితి చాగంటి ఆలపించారు. భీమ్లానాయక్‌’ చిత్రంలో ఓ కీలక సందర్భంలో వచ్చే గీతమిదని సినీ వర్గాలు తెలిపాయి. రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ ‘‘ఒక తల్లి కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలు తగవుని చూడలేని ఓ కన్నతల్లి పాట ఇది. ఆ తల్లి ఎవరో కాదు.. అడవి తల్లి. ఇలాంటి భావన ఒక పాటలో కావాలని దర్శకులు చెప్పినప్పుడు సంగీత దర్శకుడు తమన్‌ గుండెల్ని రంపపు కోతకు గురిచేస్తుంటే ఎలా ఉంటందో అలాంటి ఒక శబ్ధాన్ని వినిపించారు. దానికి అనుగుణంగానే నేను పదాలు సమకూర్చా. అలా మా మాటల మధ్యలోనే పాట సిద్ధమైంది. పల్లెతనం తొణికిసలాడే గొంతులు కుదిరాయి. ఈ పాట రాసిన వెంటనే మా గురువు సిరివెన్నెల సీతారామశాస్త్రి సర్‌కి వినిపించా. ‘ఈ పాట నేనే రాశానా అన్న భావన కలిగింది. ఈ పల్లె భాష నాకెలా తెలుసు అన్న ఆశ్చర్యం నీకు కలగలేదా? అంత బాగా రాసావు’ అంటూ మెచ్చుకున్నార’’ని చెప్పారు. ఈ పాటకి సంబంధించిన లిరికల్‌ వీడియోని సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా ఆయన్ని స్మరించుకుంటూ విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని