
బాలకృష్ణ సహకారంతోనే ఈ స్థాయి పోరాటాలు
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘అఖండ’. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. శ్రీకాంత్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్ స్టంట్ శివ.. ఆయన కుమారులు కెవిన్, స్టీవెన్ మాట్లాడుతూ.. ‘‘బాలకృష్ణ, బోయపాటి శ్రీను అందించిన సహకారం వల్లే అఖండ’లో ఫైట్స్ ఇంత బాగా వచ్చాయి. అఘోరాగా బాలయ్య ఎంట్రీ దగ్గర్నుంచి క్లైమాక్స్ వరకు అన్ని ఫైట్స్ కంపోజ్ చేశాం. 80రోజులు పని చేశాం. 60 నుంచి 65 రోజులు యాక్షన్ సీక్వెన్స్ కోసమే కేటాయించాం. మిగిలిన రోజుల్లో ఎలివేషన్స్ గురించి దర్శకుడితో ప్రయాణం చేశాం. బోయపాటి కథ వినిపించాక.. ఫైట్స్ ఎలా తీర్చిదిద్దాలన్న విషయంలో మేము బాగా ఆలోచించాం. అఘోరా అంటే మామూలు మనిషి కాదు. తెలుగు ఇండస్ట్రీ అంటే మాస్. మంచి యాక్షన్ సీక్వెన్స్ కోరుకుంటారు. అందులోనూ బాలయ్య సర్ అంటే వేరే లెవల్ ఉండాలి. అందుకే ప్రతి ఫైట్‌ను విభిన్నంగానే డిజైన్ చేశాం. తమన్ నేపథ్య సంగీతం ఫైట్లకు మరింత ఆకర్షణ అందించింది. క్లైమాక్స్ ఫైట్‌ను వంద మందితో తీశాం. దానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తుందని ముందే ఊహించాం. ఇప్పుడు మా అంచనాలు నిజమయ్యాయి. ఈ చిత్రానికి మేము ఫైట్ మాస్టర్స్‌లా పని చేయలేదు. ఫ్యాన్స్‌లా చేశాం. బాలయ్యలో ఓ పవర్ ఉంది. ఆయన ఇండియన్ సినిమాకు ఓ సూపర్ హీరో’’ అన్నారు.