Sharwanand: సిక్స్‌ప్యాక్‌తో సిద్ధమయ్యాకే సినిమా చేస్తా

‘‘క్రీడా నేపథ్యంతో సినిమా చేయడానికి, తీయడానికి చాలా ధైర్యం కావాలి. ఈ జోనర్‌లో వచ్చిన సినిమాలు   ఎక్కువగా విజయాల్నే అందుకున్నాయి. ఇలాంటివి చేస్తున్నప్పుడు నటుడికే ఎక్కువ బాధ్యత....

Updated : 06 Dec 2021 06:15 IST

- శర్వానంద్‌

‘‘క్రీడా నేపథ్యంతో సినిమా చేయడానికి, తీయడానికి చాలా ధైర్యం కావాలి. ఈ జోనర్‌లో వచ్చిన సినిమాలు   ఎక్కువగా విజయాల్నే అందుకున్నాయి. ఇలాంటివి చేస్తున్నప్పుడు నటుడికే ఎక్కువ బాధ్యత ఉంటుంది. నాగశౌర్య పడిన కష్టం కనిపిస్తోంది. నేను ఇప్పుడు చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక... నాగశౌర్యలా సిక్స్‌ప్యాక్‌తో సిద్ధమయ్యాకే మరో సినిమా చేస్తా’’ అన్నారు యువ కథానాయకుడు శర్వానంద్‌. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘లక్ష్య’ ముందుస్తు విడుదల వేడుకకి దర్శకుడు శేఖర్‌ కమ్ముల, బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌తో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాగశౌర్య, కేతిక శర్మ జంటగా నటించిన చిత్రమే ‘లక్ష్య’. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. నారాయణ్‌దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు, శరత్‌ మరార్‌ నిర్మాతలు. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శర్వానంద్‌ మాట్లాడుతూ ‘‘మనకు ‘అఖండ’తో పూర్వవైభవాన్ని తీసుకొచ్చాడు బాలకృష్ణ సర్‌. మంచి సీజన్‌కి ఇదొక మంచి సంకేతం. నాగశౌర్యకు మరిన్ని విజయాలు రావాలి. బాలీవుడ్‌కి వెళ్లిపోవాలి’’ అన్నారు. నాగశౌర్య మాట్లాడుతూ ‘‘ఈ సినిమా చేస్తూ ఎంతో నేర్చుకున్నా. ఏ సమస్య వచ్చినా సరే నిర్మాతలు నాకోసం నిలబడ్డారు. చాలా మంచి పాటలు ఇచ్చారు కాలభైరవ. సంతోష్‌కు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఛాయాగ్రాహకుడు రామ్‌రెడ్డి అంతే కష్టపడ్డారు. మా కథానాయిక కేతిక మేం అనుకున్న పాత్రకి పక్కాగా సరిపోతుందని భావించాం. శేఖర్‌ కమ్ముల సర్‌ ‘లవ్‌స్టోరి’తో ఊపునిచ్చారు. ఆయన ఈ వేడుకకి రావడం ఆనందంగా ఉంది. ఎన్నో త్యాగాలు చేసి క్రీడాకారుడిగా జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన పుల్లెల గోపీచంద్‌, నాకు బాగా కావల్సిన శర్వానంద్‌ ఈ వేడుకకి రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. సంతోష్‌ జాగర్లపూడి మాట్లాడుతూ ‘‘నా తొలి సినిమా ‘సుబ్రమణ్యపురం’ తర్వాత సునీల్‌ నారంగ్‌ నన్ను పిలిచి ఈ అవకాశమిచ్చారు. ఏడున్నర గంటలు కథ విని ఈ సినిమా చేశారు నాగశౌర్య. సినిమా అనేది కళారూపం, దానికి ఆక్సిజన్‌ థియేటర్‌ వ్యవస్థ. ఆ ఆక్సిజన్‌ని అందజేసే వ్యక్తి నిర్మాత నారాయణ్‌దాస్‌ నారంగ్‌’’ అన్నారు. శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ‘‘ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆర్చరీ అనేది ప్రేక్షకులకు కొత్త. అందులోనే విజయం ఉంది’’ అన్నారు. పుల్లెల గోపీచంద్‌ మాట్లాడుతూ ‘‘భారతీయ క్రీడా సినిమాల్లో నిలిచిపోయే మరో చిత్రం కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. సునీల్‌ నారంగ్‌, కాలభైరవి, సృజనమణి, కిరీటి, రామ్‌రెడ్డి, జునైద్‌ పాల్గొన్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని