
సమంత చిత్రం...‘యశోద’
కొత్త సినిమాల విషయంలో జోరుని ప్రదర్శిస్తోంది అగ్ర కథానాయిక... సమంత. ‘శాకుంతలం’ సినిమాని ఇప్పటికే పూర్తి చేసిన ఆమె, ఇటీవల ఓ అంతర్జాతీయ సినిమాకి పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న మరో చిత్రానికి కూడా ఆమె ఇదివరకే అంగీకారం తెలిపారు. హరి - హరీష్ దర్శకత్వం వహిస్తుండగా, శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో... ‘యశోద’ పేరుతో రూపొందనున్న ఆ చిత్రం సోమవారం హైదరాబాద్లో ఆరంభమైంది. సమంతకి ‘ఫ్యామిలీమేన్ 2’తో జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపుకీ, ఆమె స్థాయికి తగ్గ కాన్సెప్ట్ కుదరడంతో ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి మూవీస్ అధినేత, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ‘‘కథా నాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. థ్రిల్లింగ్ అంశాలతో, జాతీయ స్థాయిలో ప్రేక్షకులందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది ఇందులోని కథాంశం. ఈ రోజు చిత్రీకరణ ప్రారంభించాం. మార్చి నెలతో పూర్తి చేస్తాం. మణిశర్మ సంగీతం, సుకుమార్ కెమెరా పనితనం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇతర తారాగణానికి సంబంధించిన విషయాల్ని త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కళ: అశోక్, మాటలు: పులగం చిన్నారాయణ, చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: రామజోగయ్యశాస్త్రి.
Advertisement