
Atrangi Re: నా బాల్యాన్ని గుర్తు చేసింది ‘అతరంగీ రే’
‘‘దర్శకుడు ఆనంద్ ఎల్రాయ్కు నేను వీరాభిమానిని. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన తన సినిమాల ద్వారా ప్రపంచానికి మన సంస్కృతి, మన బాధ, మన సంతోషం.. ఇలా ఎన్నో భావోద్వేగాలను చూపిస్తారు’’ అన్నారు ఏఆర్ రెహమాన్. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతరంగీ రే’. ధనుష్, సారా అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అక్షయ్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి రెహమాన్ స్వరాలు అందించారు. ఈ చిత్రం ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ఓ ప్రకటన విడుదల చేసింది. రెహమాన్ మాట్లాడుతూ ‘‘అతరంగీ’ కోసం నేను అందించిన స్వరాలు అన్నీ కథతో పాటు చిత్రంలో ప్రధాన పాత్ర ధారులు అక్షయ్, ధనుష్, సారాలను దృష్టిలో పెట్టుకుని చేసినవే. ఆనంద్ ఎల్రాయ్ నా జీవితంలో ముఖ్యమైన దర్శకుడు. రచయితలు ఇర్షద్, హిమాన్షులతో కలిసి పనిచేయడం చాలా బాగుంటుంది’’అని చెప్పారు. అక్షయ్‌కుమార్ మాట్లాడుతూ ‘‘అతరంగీ రే’ నా బాల్యాన్ని గుర్తు చేసింది. ఇందులో నా పాత్ర పెద్దదేమీ కాదు కానీ చాలా బాగుంటుంది. అందుకే కథ విన్న అరగంటలోనే ఓకే చేసేశాను’’అని చెప్పారు.