NAYEEM DIARIES: నయీం పాత్ర... నాకో సవాల్‌

‘‘నయీం తరహా పాత్రలు నటులకి తరచూ దొరికేవి కావు. ఎప్పుడో ఒకసారే అలాంటి పాత్రల్లో నటించే అవకాశం వస్తుంది. ‘నారప్ప’, ‘కేజీఎఫ్‌’ సినిమాల తర్వాత నయీం

Updated : 08 Dec 2021 07:17 IST

‘‘నయీం తరహా పాత్రలు నటులకి తరచూ దొరికేవి కావు. ఎప్పుడో ఒకసారే అలాంటి పాత్రల్లో నటించే అవకాశం వస్తుంది. ‘నారప్ప’, ‘కేజీఎఫ్‌’ సినిమాల తర్వాత నయీం పాత్ర చేయడం నాకొక సవాల్‌గా అనిపించింద’’న్నారు వశిష్ఠ సింహా. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నయీం డైరీస్‌’. దాము బాలాజీ దర్శకత్వం వహించారు. వరదరాజు నిర్మాత. ఈ నెల 10న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా వశిష్ఠ సింహా మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

* ‘‘సహజంగానే నాకు వ్యతిరేక ఛాయలున్న పాత్రలంటే ఇష్టం. నాటకాల్లో అలాంటి పాత్రలే  ఎక్కువగా చేశా. సినిమాల్లోనూ విలన్‌ పాత్రలతోనే ఎక్కువగా గుర్తింపు వచ్చింది. నయీం కథ గురించి చెప్పగానే ఆ పాత్రలో ఉన్న లోతు, భావోద్వేగాల్లోని గాఢత నాకు బాగా నచ్చాయి. ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన తీరు  ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాగని ఈ సినిమాలో నయీంని హీరోగా చూపించే ప్రయత్నం చేయలేదు. అతని జీవితానికి అద్దం పట్టే ప్రయత్నం చేశాం’’.
* ‘‘దర్శకుడు దాము బలాజీ, నిర్మాత వరదరాజు వల్లే ఈ సినిమాలో అవకాశం వచ్చింది. దాము తన నక్సలైట్‌ జీవితంలో చూసిన విషయాలు, నయీం గురించి ఆయన చేసిన పరిశోధనతో ‘నయీం డైరీస్‌’ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. చాలా వాస్తవికతతో తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కించాం. మా నాన్న తెలుగువారు, అమ్మ కర్ణాటకకి చెందినవారు. మా ఇంట్లో రెండు భాషలూ మాట్లాడతాం. అది ఈ సినిమాకి బాగా పనికొచ్చింది’’.
* ‘‘సంగీత దర్శకుడు హంసలేఖ నా అభిమాన సంగీత దర్శకుడు. ఆయన్ని కలిసేందుకు వెళ్లి ఆయన దృష్టిలో పడ్డా. క్రమంగా నాకూ సంగీతంపై మక్కువ పెరిగింది. సినీ పరిశ్రమలో గాయకుడిగా మొదలైన నా ప్రయాణం క్రమంగా నటనవైపు మళ్లింది. కెమెరా, ఎడిటింగ్‌ విభాగాల్లోనూ పనిచేశా. ‘కేజీఎఫ్‌2’లోనూ నటించా. తెలుగులో సంపత్‌ నంది నిర్మిస్తున్న ‘ఓదెల రైల్వేస్టేషన్‌’లో నటించా. ఆయన తదుపరి సినిమా ‘సింబా’లోనూ ఓ పాత్ర చేస్తున్నా’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని