Updated : 08 Dec 2021 05:20 IST

Sirivennela: సిరివెన్నెల చివరి గీతిక

సినీప్రియుల కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇచ్చిన చివరి సంతకం ‘శ్యామ్‌  సింగరాయ్‌’ కోసం రాసిన ‘‘సిరివెన్నెల..’’ గీతం. సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన ఈ ఆఖరి పాటను.. ఆయన మరణించిన రెండో రోజునే రికార్డు చేసింది చిత్ర బృందం. ఆ గీతాన్ని మంగళవారం సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశారు. సినిమాని సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితమిస్తున్నట్లు తెలియజేశారు. ‘‘నెలరాజునీ.. ఇల రాణినీ.. కలిపింది కదా.. సిరివెన్నెల’’ అంటూ మనసులకు హత్తుకునేలా సాగుతున్న ఈ పాటకు మిక్కీ జే మేయర్‌ వినసొంపైన బాణీలందించగా.. అనురాగ్‌ కులకర్ణి భావయుక్తంగా ఆలపించారు. సినిమాలో నాయకానాయిలక మధ్య ఉన్న ఆహ్లాదకరమైన ప్రేమకథను తెలియజేసే గీతమిది. ‘‘నడిరాతిరిలో.. తెరలు తెరిచినది నిద్దురలో.. మగత మరచి ఉదయించినదా.. కులుకులొలుకు చెలి మొదటి కల’’,  ‘‘సంతోషం సరసనా.. సంకోచం మెరిసినా.. ఆ రెంటికి మించిన పరవశ లీలలు.. కాదని అనగలమా’’.. అంటూ పాటలో సిరివెన్నెల వినిపించిన సాహిత్యం ఎంతో అర్థవంతంగా ఉంది. అలాగే పాటలో నాని, సాయిపల్లవిల జోడీ చూడముచ్చటగా కనిపించింది. నాని కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని రాహుల్‌ సంకృత్యాన్‌ తెరకెక్కించారు. వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన ఈ సినిమా.. డిసెంబర్‌ 24న అన్ని దక్షిణాది భాషల్లోనూ విడుదల కానుంది. ఈ చిత్రానికి కథ: సత్యదేవ్‌ జంగా, కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: సాను జాన్‌ వర్గీస్‌.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని