Pushpa: మా అందరి కోరిక ఒకటే.. ‘సినిమాలు’ గెలవాలి

‘‘వచ్చీ రాగానే తొలి బంతికి సిక్సర్‌ కొడితే ఎంత ఊపొస్తుందో.. ‘అఖండ’ సినిమాతో తెలుగు సినిమాకి అంత ఊపిచ్చారు బాలకృష్ణ - బోయపాటి. ఇదే ఊపును ‘పుష్ప’తో   కొనసాగిస్తూ.. థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పిస్తామని మాటిస్తున్నా.....

Updated : 13 Dec 2021 14:07 IST

‘‘వచ్చీ రాగానే తొలి బంతికి సిక్సర్‌ కొడితే ఎంత ఊపొస్తుందో.. ‘అఖండ’ సినిమాతో తెలుగు సినిమాకి అంత ఊపిచ్చారు బాలకృష్ణ - బోయపాటి. ఇదే ఊపును ‘పుష్ప’తో కొనసాగిస్తూ.. థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పిస్తామని మాటిస్తున్నా. మాకందరికీ ఉన్నది ఒకటే కోరిక సినిమాలు గెలవాలి. మాతో పాటే ఈనెల 17న వస్తున్న మిగతా సినిమాలు గెలవాలి. ఆ తర్వాత వస్తున్న ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘భీమ్లా నాయక్‌’, ‘రాధేశ్యామ్‌’, ‘ఆచార్య’ తదితర చిత్రాలన్నింటినీ ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదించాలి’’ అన్నారు అల్లు అర్జున్‌. ఆయన కథానాయకుడిగా  సుకుమార్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. రష్మిక కథానాయిక. ఫహాద్‌ ఫాజిల్‌, సునీల్‌, అజయ్‌, అనసూయ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’ పేరుతో ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్‌లో ముందస్తు విడుదల వేడుక నిర్వహించారు.

* కథానాయకుడు అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. ‘‘నాలుగు సినిమాల కష్టం కలిపితే.. ఈ ఒక్క ‘పుష్ప’. సుకుమార్‌ ప్రీరిలీజ్‌ వేడుకకు రావట్లేదని చెప్పగానే షాకయ్యా. తనకి ఫోన్‌ చేస్తే.. ‘ఓ మంచి సినిమా ఇచ్చేందుకు చివరి నిమిషం వరకు కష్టపడుతున్నామ’ని చెప్పమన్నాడు. రష్మిక చాలా బాగా చేసింది. భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ పాత్ర పోషించినందుకు ఫహాద్‌ ఫాజిల్‌కు కృతజ్ఞతలు. అడగగానే ప్రత్యేక గీతం చేసిన నటి సమంతకు ప్రత్యేక కృతజ్ఞతలు. దేవిశ్రీ ప్రసాద్‌ అద్భుతమైన ఆల్బమ్‌ ఇచ్చాడు.  కెమెరామెన్‌ క్యూబా లేకుండా ఈ నేనీ చిత్రాన్ని ఊహించలేను’’ అన్నారు.

* ‘‘గీతాగోవిందం’ పాటల వేడుకకు అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా వచ్చారు. అప్పుడు నేను కోరుకున్నా.. ఆయనతో ఎప్పటికైనా కలిసి నటించాలని. ఆ కోరిక ‘పుష్ప’లోని శ్రీవల్లి పాత్ర రూపంలో నెరవేరింది. సినిమా చూశాక బన్ని పాత్రతో పాటు మా అందరి పాత్రల గురించి మాట్లాడుకుంటారు’’ అంది నటి రష్మిక.

* అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. ‘‘రెండు సంవత్సరాలకు ఓసారి జరిగే మహా అద్భుతం.. అదే సుకుమార్‌. చాలా రోజులుగా తాను చూపించాలనుకుంటున్న ఒక విశ్వరూపం.. నా కలల ప్రతిరూపం.. అల్లు అర్జున్‌. దేవీ.. మూడో దశాబ్దంలోనూ మన కర్ణభేరిపై కూర్చొని వాయిస్తున్న ఓ మధుర మృదంగం. ఈ సినిమా అందరికీ కన్నుల పండగ లాంటి చిత్రమవుతుంది’’ అన్నారు.

* చిత్ర నిర్మాతలు నవీన్‌ ఏర్నేని, వై.రవిశంకర్‌ మాట్లాడుతూ.. ‘‘మా బ్యానర్‌లో నిర్మించిన అత్యంత సవాల్‌తో కూడిన చిత్రమిదే. కచ్చితంగా సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్‌ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు.

*  ‘‘అల్లు అర్జున్‌ మన తెలుగు వాడైనందుకు చాలా గర్వపడాలి. ప్రేక్షకుల్ని అలరించడానికి తనెంత కష్టపడుతున్నాడో నాకు తెలుసు. ఈ సినిమా తన వైపు నుంచి డబుల్‌.. త్రిపుల్‌ ఎనర్జీతో మీ ముందుకు రానుంది. పుష్ప అంటే పువ్వు కాదు. అలాగే బన్ని అంటే బన్ను కాదు.. బ్లాక్‌బస్టర్‌’’ అన్నారు దర్శకుడు మారుతి.

* నటుడు సునీల్‌ మాట్లాడుతూ.. ‘‘పుష్ప’ అందరికీ మంచి దావత్‌లా ఉంటుంది. సినిమా చూసొచ్చిన వారం తర్వాత చిత్రంలోని వాతావరణం, అందులోని ఎమోషన్లు, నటించిన నటీనటులు గుర్తొస్తూనే ఉంటారు’’ అన్నారు. ‘‘నాకిదొక కలలా ఉంది. దాక్షాయణి పాత్రతో మిమ్మల్ని అందరినీ సర్‌ప్రైజ్‌ చేయనున్నా’’ అన్నారు నటి అనసూయ.

* గీత రచయత చంద్రబోస్‌ మాట్లాడుతూ ‘‘అరుదైన కథకు.. అందులోని సందర్భాలకు అరుదైన భావజాలంతో పాటలు రాసే అవకాశం రావడం నాకు దక్కిన భాగ్యంగా భావిస్తున్నాను. నా కోసం మంచి సందర్భాలు సృష్టించిన సుకుమార్‌కు, చక్కటి స్వరాలు సమకూర్చిన దేవిశ్రీ ప్రసాద్‌కు నా కృతజ్ఞతలు’’ అన్నారు.

* ఈ కార్యక్రమంలో దర్శకులు వెంకీ కుడుముల, బుచ్చిబాబు సానా, సిద్‌ శ్రీరామ్‌, మంగ్లీ, నటులు ధనుంజయ, అజయ్‌, ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ - లక్ష్మణ్‌, పీటర్‌ హెయిన్స్‌, ఛాయాగ్రాహకుడు మిరోస్లా క్యూబా బ్రోజెక్‌ తదితరులు పాల్గొన్నారు.


* ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘నా బెస్ట్‌ ఫ్రెండ్‌, ఫేవరెట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ఈరోజు ఇక్కడ లేనందుకు కాస్త బాధగా ఉంది. తను ప్రస్తుతం ముంబయిలో ‘పుష్ప’ను అద్భుతంగా అందించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. నేను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పని మీద ముంబయికి వెళ్లినప్పుడు.. అక్కడ ఏ సినిమా కోసం మీరు ఎదురు చూస్తున్నారని ప్రశ్నించా... ‘పుష్ప’ కోసమే అంటున్నారు. ఈ చిత్ర టీజర్‌ చూసినప్పుడే నా కళ్లు చెదిరిపోయాయి. నటన పట్ల అల్లు అర్జున్‌కు ఉన్న నిబద్ధత, అంకిత భావానికి, దర్శకుడి పట్ల తనకున్న నమ్మకానికి నా హ్యాట్సాఫ్‌. తను మన చిత్ర పరిశ్రమకు దొరికిన ఓ అద్భుతమైన బహుమతి’’ అన్నారు.


* దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ.. ‘‘పుష్ప’లాంటి సినిమాని.. ఇలాంటి ప్రపంచాన్ని.. అందులోని పాత్రల్ని ఇలా సృష్టించాలంటే అది సుకుమార్‌ తప్ప మరెవరూ చేయలేరు. అల్లు అర్జున్‌కు సినిమా.. చేసే పాత్రలు తప్ప మరో ప్రపంచం తెలియదు. తనలా ఓ పాత్ర కోసం ఇంత కష్టం పెట్టి, జీవం పోసే నటుడు ఇండియాలో మరొకరు ఉండరు. కచ్చితంగా చెబుతున్నాను ‘పుష్ప 2’ తర్వాత చాలా పెద్ద కథతో మీ దగ్గరకి వస్తాను’’ అన్నారు.


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని