Radhe Shyam: ఈ రెబల్‌ ఇంకో 50ఏళ్లు మిమ్మల్ని ఆనందపరుస్తాడు

‘‘రాధేశ్యామ్‌’ ఓ ప్రేమకథా చిత్రమే కాదు. ఇందులో ఇంకా చాలా ఉన్నాయి. ఎన్నో ట్విస్ట్‌లు, మలుపులు ఉన్నాయ’’న్నారు కథానాయకుడు ప్రభాస్‌. ‘సాహో’ తర్వాత ఆయన నుంచి వస్తున్న పాన్‌ ఇండియా చిత్రమే ‘రాధేశ్యామ్‌’. కె.కె.రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించారు.

Updated : 24 Dec 2021 04:19 IST

- కృష్ణంరాజు

‘‘రాధేశ్యామ్‌’ ఓ ప్రేమకథా చిత్రమే కాదు. ఇందులో ఇంకా చాలా ఉన్నాయి. ఎన్నో ట్విస్ట్‌లు, మలుపులు ఉన్నాయ’’న్నారు కథానాయకుడు ప్రభాస్‌. ‘సాహో’ తర్వాత ఆయన నుంచి వస్తున్న పాన్‌ ఇండియా చిత్రమే ‘రాధేశ్యామ్‌’. కె.కె.రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించారు. గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. పూజా హెగ్డే కథానాయిక. కృష్ణంరాజు, భాగ్యశ్రీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం రాత్రి రామోజీ ఫిల్మ్‌ సిటీలో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానుల చేతుల మీదుగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు, చిత్ర నిర్మాత కృష్ణంరాజు మాట్లాడుతూ ‘‘రెబల్‌ స్టార్‌ ఎప్పుడూ రెబల్‌గానే ఉంటాడు. లేదంటే ప్రభాస్‌ లాంటి మరో రెబల్‌ను కల్పిస్తాడు. ఈ రెబల్‌ ఇంకో 50ఏళ్లు మిమ్మల్ని ఆనందపరుస్తాడు’’ అన్నారు. హీరో ప్రభాస్‌ మాట్లాడుతూ ‘‘ట్రైలర్‌ అందరికీ నచ్చిందనుకుంటున్నా. కొవిడ్‌ సమయంలో అందరూ చాలా కష్టపడి చేశారు. రెండేళ్ల పాటు అటు జార్జియాలో.. ఇటు హైదరాబాద్‌లో చిత్రీకరణ జరిపాం. చిత్ర బృందానికి థ్యాంక్స్‌. మనోజ్‌ సర్‌ నన్ను బాగా చూపించారు. జగపతిబాబు అతిథిగా ఓ మంచి పాత్ర చేశారు. పూజా హెగ్డే చాలా అందంగా ఉంది. ఓ దర్శకుడు ఐదేళ్లు ఒక సినిమాపై  కూర్చోవడమంటే మామూలు విషయం కాదు. సినిమాలో చాలా ట్విస్ట్‌లు, మలుపులు ఉన్నాయి. క్లైమాక్స్‌ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని నమ్మకంగా చెబుతున్నా. కచ్చితంగా సినిమా మీ అందరికీ నచ్చుతుంద’’న్నారు.

* చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా తీయడానికి 4ఏళ్లు పడితే.. రాయడానికి 18ఏళ్లు పట్టింది. నేను ఈ పాయింట్‌ మా గురువు చంద్రశేఖర్‌ యేలేటి సర్‌ దగ్గర విన్నా. ఇండియాలో పెద్ద పెద్ద
రచయితల్ని పిలిపించి రాయించినా.. కథకు సరైన ముగింపు దొరకలేదు. ఆసమయంలో చంద్రశేఖర్‌ సర్‌ ఓ మాటన్నారు. జాతకాల మీద చేస్తున్నాం.. ఈ కథ ఎవరికి రాసిపెట్టుందో అన్నారు. ఇది ప్రభాస్‌కే రాసిపెట్టుంది. దీన్నొక ఛాలెంజ్‌లా తీసుకొని కథ తీర్చిదిద్దుకున్నా. ఒక ఫిలాసఫీని.. లవ్‌స్టోరీలా రాసి ఆ కథను ప్రభాస్‌కు చెప్పా. ఆయనకి నచ్చింది. ప్రభాస్‌ సర్‌ను నేనింత కంటే ఇంకేమి అడగను. ఆయనలాంటి ఫ్రెండ్‌, గురువు అందరికీ ఉండాలి. ఇందులో ఫైట్స్‌ ఉండవు. ఓ అమ్మాయికి అబ్బాయికి మధ్య జరిగే యుద్ధాలుంటాయి. దీంట్లో ఛేజింగ్‌లు ఉండవు.. ఓ అమ్మాయి కోసం అబ్బాయి సప్త సముద్రాలు దాటి వెళ్లే ప్రయాణముంటుంది. ఈ ట్రైలర్‌ సినిమాకి ఆహ్వాన పత్రికే. సినిమా అంతకు మించి అనేలా ఉంటుంది. ప్రొడక్షన్‌ డిజైనర్‌ రవీందర్‌ రెడ్డి, ఛాయాగ్రాహకుడు పరమహంస నా చిత్రానికి బలాన్నిచ్చారు. ప్రేరణ పాత్రలో పూజాని తప్ప మరొకరిని ఊహించుకోలేం. తను ఈ సినిమా కోసమే పుట్టింది’’ అన్నారు.

* దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ ‘ట్రైలర్‌ చాలా నచ్చింది. ఇదొక గాఢమైన ప్రేమకథలా అనిపిస్తోంది. ప్రభాస్‌, పూజాల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. మ్యూజిక్‌ అద్భుతంగా ఉంది. రాధా కంగ్రాట్స్‌. ‘ప్రాజెక్ట్‌ కె’ కోసం అమితాబ్‌, దీపిక తెలుగులో మాట్లాడితే.. ప్రభాస్‌ హిందీలో మాట్లాడారు. ఈయన హిందీ పెర్ఫామెన్స్‌.. దీపిక తెలుగు పెర్ఫామెన్స్‌తో ఆ సినిమా చేస్తున్నామ’’న్నారు.

* దర్శకుడు ఓం రౌత్‌ మాట్లాడుతూ ‘‘ప్రభాస్‌ నాకిది లవ్‌స్టోరీ అని చెప్పారు. కానీ, ట్రైలర్‌ చూస్తుంటే ప్రేమకథ మాత్రమే కాదు.. యాక్షన్‌, డ్రామా, సస్పెన్స్‌ చాలా ఉన్నాయనిపించింది. నిజంగా ఇది అద్భుతం. సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు. ‘‘ట్రైలర్‌ చాలా గొప్పగా ఉంది. షిప్‌ ఎపిసోడ్‌ చాలా బాగుంది. ‘రాధేశ్యామ్‌’ బృందానికి నా శుభాకాంక్షలు. ప్రభాస్‌ అభిమానుల్ని ఏమాత్రం నిరాశ పరచని రీతిలో మా ‘స్పిరిట్‌’ ఉంటుంది’’ అన్నారు దర్శకుడు సందీప్‌ వంగా.

* నటి పూజా హెగ్డే మాట్లాడుతూ ‘‘ఈ సినిమాతో నాలుగేళ్ల ప్రయాణం చేశాం. మా కష్టం ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని ఆశిస్తున్నాం. ప్రేక్షకులకు, తన అభిమానులకు కొత్తదనం అందించేందుకు ప్రభాస్‌ చాలా తపన పడుతుంటారు. ఆయన ‘బాహుబలి’, ‘సాహో’లాంటి యాక్షన్‌ సినిమాల తర్వాత.. ఇలాంటి లవ్‌స్టోరీని ఎంచుకోవడానికి కారణమదే. ఈ చిత్రంతో ఓ కొత్త ప్రభాస్‌ను, కొత్త పూజాను చూస్తారు. ఈ కథ కోసం దర్శకుడు రాధా చాలా కష్టపడ్డారు. అది నాకెంతో స్ఫూర్తినిచ్చింది. ఇదొక అందమైన ప్రేమకథ. సంక్రాంతి నాకు చాలా లక్కీ. ఈ చిత్రంతో అది మరోసారి నిరూపితమవుతుందని నమ్ముతున్నా’’ అంది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు వంశీ, ప్రమోద్‌, విక్కీ, దిల్‌ రాజు, నటులు జయరామ్‌, సచిన్‌ ఖేడేకర్‌, సంగీత దర్శకులు యువన్‌ శంకర్‌ రాజా, జస్టిన్‌ ప్రభాకరన్‌, గేయ రచయిత కృష్ణకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.


విధిని ఎదిరించి ప్రేమ గెలవగలదా?

‘‘రేయ్‌ అమ్మ పెళ్లి గురించి అడిగితే చెప్పు.. నా చేతిలో ప్రేమ, పెళ్లి లేవు’’ అంటూ విక్రమాదిత్యగా ప్రభాస్‌ చెప్పిన డైలాగ్‌తో ‘రాధేశ్యామ్‌’ ట్రైలర్‌ ఆసక్తికరంగా మొదలైంది. ప్రచార చిత్రంలో ప్రభాస్‌, పూజాల ప్రేమకథను ఆసక్తికరంగా చూపించారు. 70ల కాలం నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టేలా చూపించారు. ప్రముఖ ప్రొడక్షన్‌ డిజైనర్‌ ఆర్‌.రవీందర్‌ రెడ్డి ఆర్ట్‌ వర్క్‌, మనోజ్‌ పరమహంస ఛాయాగ్రహణం ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ‘‘పుట్టుక నుంచి చావు దాకా ఏరోజు ఏం జరుగుతుందో నాకు తెలుసు’’, ‘‘నీ ప్రేమ ఎదురవడం వరం. కానీ, అందుకోవడం మాత్రం ఓ యుద్ధం’’, ‘‘విధిని ఎదిరించి ప్రేమ గెలవగలదా? మన రాతే ఇంత పెద్ద భూకంపాన్ని సృష్టించిందా? ప్రాణం పోసిన ప్రేమే ప్రాణాలు తీస్తుందా?’’ అంటూ ట్రైలర్‌లో ప్రభాస్‌ చెప్పిన డైలాగ్‌లు ఆసక్తిరేకెత్తించేలా ఉన్నాయి.


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని