Published : 18 Jan 2022 00:33 IST

వచ్చేదెవరు.. వెనక్కి తగ్గేదెవరు?

‘నేడే విడుదల’ అంటూ థియేటర్లో కొత్త పోస్టర్‌ ఊరిస్తుంటే సినీప్రియులకు భలే కిక్కొస్తుంటుంది. కానీ, కరోనా పరిస్థితుల వల్ల కొన్నాళ్లుగా విడుదలల విషయంలో స్పష్టత కనిపించడం లేదు. విడుదల తేదీలు ప్రకటించడం.. పరిస్థితులు అనుకూలించక కొన్నాళ్లకి వాయిదా వేయడం.. ఇదే తంతు తరచూ కనిపిస్తోంది. సంక్రాంతి.. వేసవి.. అంటూ విడుదలల విషయంలో నిన్నమొన్నటి వరకు పక్కా ప్రణాళికలతో కనిపించింది తెలుగు చిత్ర పరిశ్రమ. కానీ, కొవిడ్‌ మూడో దశ ఉద్ధృతి వల్ల మరోసారి ఆ ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. జనవరి ఆరంభం నుంచే వైరస్‌ ప్రభావం మొదలవడంతో.. పెద్ద పండక్కి రావాల్సిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’ వంటి బడా చిత్రాలన్నీ వాయిదా పడ్డాయి. అయితే ఇప్పుడీ సెగ ఫిబ్రవరి చిత్రాలనూ తాకనున్నట్లు తెలుస్తోంది. ఓవైపు కొవిడ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం.. ఏపీలో మంగళవారం నుంచి థియేటర్లపై కరోనా ఆంక్షలు మొదలైన నేపథ్యంలో ఫిబ్రవరిని లక్ష్యం చేసుకున్న చిత్రాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అనుకున్న సమయానికి వచ్చేదెవరు? వెనక్కి తగ్గేదెవరు? అనేది ఆసక్తికరంగా మారింది.

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో.. ఇప్పటికే పలు రాష్ట్రాలు థియేటర్లపై ఆంక్షలు విధించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఇన్నాళ్లు పూర్తి సామర్థ్యంతో నిరాటంకంగా సినిమా ప్రదర్శనలు కొనసాగాయి. అయితే మంగళవారం నుంచి ఏపీలో నైట్‌ కర్ఫ్యూతో పాటు థియేటర్లలో 50శాతం ఆక్యుపెన్సీ అమలు కానుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి రేసులో నిలిచిన చిత్రాల్లో.. వాయిదా బాట పట్టెవి ఎన్ని అన్నది ఆసక్తికరంగా మారింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి వినోదాలకు చిరంజీవి ‘ఆచార్య’తో మెగా ఓపెనింగ్‌ దక్కుండేది. కానీ, కరోనా పరిస్థితుల వల్ల ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. ఫిబ్రవరి 4న విడుదల కావాల్సిన ఆ చిత్రాన్ని.. ఏప్రిల్‌ 1కి వాయిదా వేసినట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడీ బాటలో మరిన్ని పెద్ద సినిమాలు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.

రేసులో బోలెడన్ని..

సూర్య ‘ఈటీ’, రవితేజ ‘ఖిలాడీ’, అడివి శేష్‌ ‘మేజర్‌’, నిఖిల్‌ ‘18 పేజీస్‌’, అలియా భట్‌ ‘గంగూబాయి కథియావాడి’, పవన్‌ కల్యాణ్‌ ‘భీమ్లా నాయక్‌’ తదితర చిత్రాలన్నీ ఫిబ్రవరి బరిలో పోటీ పడేందుకు ఇప్పటికే బెర్తులు ఖరారు చేసుకున్నాయి. వీటిలో చాలా వరకు ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. మరికొన్ని తుది దశ చిత్రీకరణలోనూ, ఇంకొన్ని నిర్మాణాంతర పనుల్లోనూ ఉన్నాయి. ఇప్పుడు వీటి రాకపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ‘ఈటీ’, ‘మేజర్‌’, ‘గంగూబాయి కథియావాడి’ల రాక కష్టమేనని తెలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, దిల్లీ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో థియేటర్లపై ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఈ చిత్రాలు వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి నెలకొని ఉంది. త్వరలో వీటి కొత్త విడుదల తేదీలపై ఓ స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ‘ఖిలాడి’ని ఫిబ్రవరి 11న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. సంక్రాంతి సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లోనూ అదే తేదీకి వస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. కానీ, ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అనుకున్న తేదీకి వస్తారా? మరో కొత్త తేదీ వెతుక్కుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. పవన్‌ కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భీమ్లానాయక్‌’. సాగర్‌ కె.చంద్ర తెరకెక్కిస్తున్నారు. త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూరుస్తున్నారు. సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం ఫిబ్రవరి 25కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ తేదీనే లక్ష్యంగా చిత్రాన్ని శరవేగంగా ముస్తాబు చేస్తోంది చిత్ర బృందం. అయితే రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయన్న దాన్ని బట్టే ఈ చిత్ర విడుదల ఆధారపడి ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.

చిన్న చిత్రాలు సాహసిస్తాయా?

తొలి దశ, రెండో దశ కొవిడ్‌ ఉద్ధృతుల తర్వాత థియేటర్లపై ఆంక్షలు ఉన్నా చిన్న చిత్రాల సందడి బాగానే కనిపించింది. పరిమిత వ్యయంతో తెరకెక్కిన పలు సినిమాలూ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ‘జాంబిరెడ్డి’, ‘లవ్‌స్టోరీ’, ‘రాజ రాజచోర’ లాంటి చిత్రాలు 50శాతం ఆక్యుపెన్సీ పరిస్థితుల మధ్యే విడుదలై మంచి వసూళ్లు దక్కించుకున్నాయి. అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్‌ ధరల మధ్య చాలా వైరుధ్యాలున్నాయి. ముఖ్యంగా ఏపీలో టికెట్‌ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. నైట్‌ కర్ఫ్యూ వల్ల అక్కడ మూడు ఆటలే సాధ్యమవుతాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చిన్న చిత్రాలు థియేటర్లు ముందుకొచ్చే సాహసం చేస్తాయా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతం ఆంధ్రాలో నైట్‌ కర్ఫ్యూ ఉన్నా.. అది రాత్రి 11గంటల తర్వాతే అమలు కానుంది. ఈ నేపథ్యంలో పలు చోట్ల థియేటర్ల యాజమాన్యాలు సినిమా ప్రదర్శన వేళల్ని సర్దుబాటు చేసుకుని..నాలుగు ఆటలు వేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇది వర్కవుటయితే ‘18 పేజీస్‌’ లాంటి చిన్న సినిమాల విడుదలకు ఆటంకం ఉండదని సినీ వర్గాల్లో చర్చలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా రానున్న రోజుల్లో పరిస్థితుల్ని బట్టి దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని